Thursday, March 5, 2020

ఏకకాలంలో ప్రజా, న్యాయ పోరాటం

ఏకకాలంలో ప్రజా, న్యాయ పోరాటం
రిజర్వేషన్‌ తగ్గింపు వైసీపీ ఉన్మాద చర్య: చంద్రబాబు

అమరావతి, మంగళగిరి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): ‘‘బీసీల పట్ల వైసీపీ ప్రభుత్వం ఉన్మాదంగా వ్యవహరిస్తోంది. పూలే, ఎన్టీఆర్‌ ఆదర్శాలను వైసీపీ కాలరాస్తోంది. బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24 శాతంకు తగ్గింపు వైసీపీ ఉన్మాద చర్య. దీనిపై అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు తెలపాలి. అన్ని నియోజకవర్గాల్లో ఆందోళనలు జరపాలి. దీనిపై ఇప్పటికే బీసీ ప్రత్యేక బృందాన్ని ఢిల్లీకి పంపాం. సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటీషన్‌ వేస్తున్నాం. అటు న్యాయపోరాటాన్ని, ఇటు ప్రజాపోరాటాన్ని ఉధృతం చేయాలి’’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపు ఇచ్చారు. గురువారం ఉదయం టీడీపీ బీసీ నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.



‘‘టీడీపీ అంటే బీసీ.. బీసీ అంటే టీడీపీ. అందుకే జగన్‌ బీసీలపై కక్ష సాధిస్తున్నారు. బీసీ రాజకీయ సాధికారతకు వైసీపీ సమాధి కడుతోంది’’ అని ధ్వజమెత్తారు. మౌనంగా ఉంటే వైసీపీ ఉన్మాదం పెట్రేగిపోతోందన్నారు. బీసీల హక్కుల రక్షణ కోసం ఉద్యమించాలని, బీసీ రాజకీయ సాధికారతను కాపాడుకోవాలని, 34 శాతం బీసీ రిజర్వేషన్‌ను కాపాడుకోవాలని సూచించారు. బీసీలు పోరాడి సాధించుకున్న హక్కు 34% రిజర్వేషన్‌ అనీ, ఇప్పుడు పోగొట్టుకుంటే తిరిగి రాదని స్పష్టం చేశారు. దీనిని తాకట్లు పెట్టే అధికారం, పొట్టకొట్టే అధికారం వైసీపీకి లేదన్నారు. కాగా.. స్థానిక సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్‌ కోత విధించిన వైసీపీకి బీసీలు తగిన గుణపాఠం చెప్పాలని టీడీపీ రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ఓ ప్రకటనలో పిలుపిచ్చారు. 50 శాతం రిజర్వేషన్లు మించకూడదనే హైకోర్టు తీర్పును అడ్డుగా పెట్టుకుని బీసీలకు జగన్‌ తీరని అన్యాయం చేశారని.. 60 శాతం రిజర్వేషన్‌ కోసం ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లాలని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు పాలకొల్లులో డిమాండ్‌ చేశారు. 

No comments:

Post a Comment