ఆ సొమ్ముతో రాజధానిఅభివృద్ధి అసాధ్యం:బొత్స
విజయనగరం: అభివృద్ధి, సంక్షేమమే వైకాపా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతామని వివరించారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం వద్ద ఉన్న వనరులకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో పదవులు, నిధులు ఉన్నా అభివృద్ధి ఆలోచన వారికి లేదని, గత పాలకులకు దోచుకోవడమే తప్ప మరో లక్ష్యం లేదని విమర్శించారు. అందుకే వారిని ప్రజలు ఇంటికి పంపించారని ఎద్దేవాచేశారు. ఉగాది నాటికి విజయనగరంలో ఇళ్లు లేని పేదలకు ఇల్లు ఇచ్చే బాధ్యత వైకాపా ప్రభుత్వానిదని బొత్స అన్నారు.
రాజధాని అంశంపై నిపుణుల కమిటీల సలహాలతో ముందుకెళుతున్నామని బొత్స అన్నారు. కానీ చంద్రబాబు, అశోక్ గజపతి రాజు వంటి వారు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. వారు అభివృద్ధి చేయలేకపోగా విమర్శలకు దిగడం సరికాదన్నారు. రాజధాని ఎక్కడ ఉన్నా తమకు ఇబ్బంది లేదు గానీ, రాష్ట్ర పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలన్నారు. లక్షా తొమ్మిది వేల కోట్ల రూపాయలతో రాజధాని అభివృద్ధి సాధ్యం కాదన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడి ఉన్నాయన్నారు. వాటిని అభివృద్ధి చేయాలన్నది సీఎం జగన్ లక్ష్యమని బొత్స వివరించారు. విమర్శలు చేసే ముందు తెదేపా ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు.
No comments:
Post a Comment