Monday, December 30, 2019

అమరావతి అంగుళం కదిలినా ఊరుకోం!- సుజన చౌదరి

అమరావతి  అంగుళం కదిలినా ఊరుకోం!- సుజన చౌదరి
30-12-2019 04:25:03

 కేంద్రంతో మాట్లాడే చెప్తున్నా
 రాజధాని రాష్ట్ర నిర్ణయమే..
 కానీ ఇప్పుడు మార్పు కుదరదు
 అమరావతికి రూ.8వేల కోట్లు చాలు
 బీజేపీ ఎంపీ సుజనా చౌదరి వెల్లడి
అమరావతి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): ‘రాజధాని అమరావతి ఒక్క అంగుళం కదిలినా ప్రజలు, బీజేపీ చూస్తూ ఊరుకోవు. కేంద్రంతో చర్చించే ఈ మాట చెప్తున్నా. కేంద్రం అధికారాలేంటో అవసరమై న సందర్భంలో చెప్తాం’ అని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఉద్ఘాటించారు. అమరావతి తరలింపు విషయంలో కేంద్ర ప్రభుత్వ అంగీకారం ఉందన్న వైసీపీ వర్గాల మాటలకు అర్థం లేదన్నారు. ఇలాంటి మూ డు రాజధానుల పనికి ఎవరైనా మద్దతిస్తారా? అని ప్రశ్నించారు. ఇదేదో రెండు జిల్లాల ప్రజలు, రైతుల సమస్య కాదని, మొత్తం 13 జిల్లాల రైతుల సమస్య అని పేర్కొన్నారు. రాజధాని రైతులకు మద్దతు తెలిపేందుకు ఆదివారం రాజధాని ప్రాంతంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. మొదట మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో పూజలు నిర్వహించారు.

ADVERTISEMENT


POWERED BY PLAYSTREAM


అ నంతరం తుళ్లూరు, మందడం, వెలగపూడి, కృష్ణాయపాలెంలో ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు వెళ్లి ప్రసంగించారు. అమరావతి నిర్మాణానికి ఇప్పటికే వేలకోట్లు ఖర్చుచేశారన్నారు. అమరావతిలో రాజధా ని పెట్టాలని ఆరోజు రైతులు అడగలేదని, నాటి ప్ర భుత్వం, ప్రతిపక్షం, ఎమ్మెల్యేలంతా కలిసి నిర్ణయిం చి పెట్టారన్నారు. ఆనాడు అమరావతికి మద్దతుగా మాట్లాడిన జగన్మోహన్‌రెడ్డే.. రాజధాని నిర్మాణానికి 30 వేల ఎకరాలు కావాలన్నారని గుర్తు చేశారు. ‘ఆ రోజు ప్రభుత్వం వద్ద డబ్బులేక భూసేకరణ పద్ధతిలో కాకుండా.. భూసమీకరణ విధానంలో వెళ్లింది. ఇప్పుడు రాజధాని మారుస్తాం అంటే రైతులకు 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలి. దాదాపు 34వేల ఎకరాలకు అది సుమారు రూ.1.5లక్షల కోట్లు అవుతుంది’ అని సుజనా అన్నారు. రేపు విశాఖపట్నం రైతు కూడా సుఖంగా ఉంటారని చెప్పలేమన్నారు.

రాష్ట్ర నిర్ణయమే అయినా..
రాజధాని ఎక్కడుండాలో నిర్ణయించుకునేది రాష్ట్ర ప్రభుత్వమే అయినా కేంద్రానికీ కొన్ని హక్కులుంటాయని సుజనాచౌదరి పేర్కొన్నారు. ‘రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 94(3) ప్రకారం రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక సాయం అందిస్తామని కేంద్రం పేర్కొంది. ఎన్డీయే హయాంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటైతే వాటి రాజధానుల నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయలేదు. కానీ ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక పరిస్థితుల్లో విడిపోవాల్సి రావడంతో రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులిస్తామన్నారు. ఆనాడు అసెంబ్లీలో ఏకగ్రీవంగా జగన్‌, వైసీసీకి చెందిన ఎమ్మెల్యేలతో సహా అంతా అమరావతి రాజధాని అని తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. ఒక్క ఎమ్మెల్యే కూడా వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. అలా పంపాకే కేంద్రం రూ.1500 కోట్లు ఇచ్చింది. ఇక్కడ రాజధాని ఉందన్న కారణంతోనే విజయవాడ-గుంటూరు ప్రాంతాన్ని స్మార్ట్‌సిటీ పథకం కింద ఎంపిక చేసి వెయ్యికోట్లు ఇచ్చింది.

అదేవిధంగా 130 కేంద్ర ప్రభుత్వ సంస్థలు అమరావతిలో భూములు కొన్నాయి. రూ.940 కోట్లకు 1293 ఎకరాలను కొనుగోలు చేయగా... అందులో రూ.540కోట్లను ఆయా సంస్థలు ఇప్పటికే చెల్లించాయి. హ్యాపీనెస్ట్‌ పేరుతో ప్రజలకు ఫ్లాట్ల ప్రాజెక్టులో రూ.72 కోట్లు కొనుగోలుదారులు చెల్లించారు. 350 మంది అఖిలభారత సర్వీసు అధికారులు తమకిచ్చిన స్థలాలకు రూ.87.5 కోట్లు చెల్లించారు. అన్నింటికీ మించి రైతులు త్యాగాలు చేశారు. దాదాపుగా పూర్తికావస్తున్న రాజధానిని ఇప్పుడు తరలిస్తామనేందుకు వీలులేదు. అలా తరలిస్తే అది దేశ వృద్ధిరేటుపైనా ప్రభావం చూపిస్తుంది. కేంద్రానికీ కొన్ని హక్కులుంటాయి. అవేంటో అవసరమైన సందర్భంలో చెప్తాం’ అని సుజనా స్పష్టం చేశారు.

అదనపు ఖర్చెందుకు?
‘అమరావతి నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితుల్లో రాష్ట్రం లేదని మంత్రులు చెప్తున్నారు. ఒకప్పుడు చంద్రబాబు కూడా రాజధాని నిర్మాణానికి రూ.4లక్షల కోట్లు కావాలన్నారు. అంత డబ్బు అవసరం లేదు. రాజధాని నిర్మాణానికి మరో రూ.8వేల కోట్లు సరిపోతాయి. ఇంకా అదనంగా కావాలంటే డబ్బులున్నప్పుడే చిన్నగా నిర్మించుకోవచ్చు. డబ్బుల్లేవని అంటున్న ప్రభుత్వం అసలు తరలింపు పేరుతో అదనపు ఖర్చు పెట్టడమెందుకు? ఇక్కడ సచివాల యం ఉంది. హైకోర్టు నడుస్తోంది. ఒకవేళ హైకోర్టును కర్నూలుకు తీసుకెళ్లినా ఇబ్బంది లేదు. రాజ్‌భవన్‌ కూడా ఏర్పాటుచేశారు. గవర్నర్‌ ఏమైనా ఆ రాజ్‌భవన్‌ సరిపోవడం లేదన్నారా?’ అని సుజనాచౌదరి ప్రశ్నించారు. పొరపాట్లు జరుగుతుంటాయని, ఇప్పటికైనా వాటిని సరిదిద్దుకుని ముందుకెళ్లాలని సూచించారు.

విజయసాయి స్థాయిలేని వ్యక్తి
ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ విషయంలో తనపైనా ఆరోపణలు చేశారని, సీబీసీఐడీ అధికారులు తన గ్రామంలో కూడా తిరిగి విచారించారని సుజనాచౌదరి చెప్పారు. కానీ ఎక్కడా ఒక్క తప్పు కూడా పట్టుకోలేకపోయారన్నారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పేరిట అసెంబ్లీలో కూడా పలువురి పేర్లు చదివిన ముఖ్యమంత్రి జగన్‌... తన పేరు చదవలేకపోయారని, ఏమైనా భయమేమో అని సుజన వ్యాఖ్యానించారు. ఇప్పుడు కొత్తగా సీబీఐ విచారణ అంటున్నారని, అంటే రాష్ట్రంలో పనికిరాని సీబీసీఐడీ వ్యవస్థ ఉందని అర్థమా? అని ప్రశ్నించారు. విజయసాయిరె డ్డి మీపై సీబీఐ విచారణ చేయాలని రాష్ట్రపతికి ఫి ర్యాదు చేశారు కదా? అని ప్రశ్నించగా... ‘విజయసాయిరెడ్డి స్థాయి లేని వ్యక్తి. అనుకోని పరిస్థితుల్లో నా యకుడైన మనిషి. సీబీఐ విచారణ చేయాలని గతంలోనే స్వాగతించిన వ్యక్తిని నేను. వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కేసు వేస్తే... అంతా స్టేకు వె ళ్లారు. నేను స్టేకు కూడా వెళ్లకుండా స్వాగతించా. సాక్షి పత్రికలోనే కోటి రూపాయల ప్రకటన ఇచ్చి... ఎవరైనా వచ్చి విచారించుకోవచ్చని చెప్పా’ అని గుర్తు చేశారు.

బుగ్గనపై పరువునష్టం దావా: రావెల
సుజనాచౌదరిపై విమర్శలు చేసే స్థాయి విజయసాయిరెడ్డికి లేదని రావెల కిషోర్‌బాబు పేర్కొన్నా రు. సుజనా కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు అరుణ్‌జైట్లీ తో మాట్లాడి పలు నిధులను రాష్ట్రానికి తెచ్చారని, సాయిరెడ్డి రాష్ర్టానికి తెచ్చింది ఏముందని ప్రశ్నించారు. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేసినట్లు మంత్రి బుగ్గన తనపై ఆరోపణలు చేశారని, మైత్రి సంస్థ పేరుతో తాను 40.48 ఎకరాలు కొన్నానని ఆరోపించారన్నారు. వీటికి ఆధారాలు బయటపెట్టాలని, లేకుంటే రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేస్తానని రావెల అన్నారు.
తలదన్నేవాడు ఢిల్లీలో ఉన్నాడు!
‘రాజధాని రైతులారా ఇది మీ ఒక్కరి సమస్య కాదు. ఇది రాష్ట్ర సమస్య. ఆధైర్య పడొద్దు. తాడిని తన్నేవాడు ఇక్కడ ఉంటే... తలను తన్నేవాడు ఢిల్లీలో ఉన్నాడు. చూస్తూ ఊరుకోం!’’... ఇవీ రాజధాని రైతులను ఉద్దేశించి సుజనాచౌదరి చెప్పిన ఓదార్పు మాటలు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని, ఒక ప్రభుత్వం రైతులకు హామీలు ఇచ్చి మరో ప్రభుత్వం కుదరదంటే కోర్టులు చూస్తూ కూర్చోవన్నారు. సీఆర్‌డీఏతో రైతులు చేసుకున్న ఒప్పందంలో నిబంధనలన్నీ క్షుణ్ణంగా అధ్యయనం చేశామన్నారు. దాని ప్రకారం అభివృద్ధి చేస్తామంటేనే రైతులు భూములు ఇచ్చేందుకు సంతకాలు చేశారన్నారు. ప్రభుత్వం వెనక్కు తగ్గితే రైతులు లక్ష కోట్లు అడిగే హక్కు ఉందన్నారు. పారిశ్రామికవేత్తలు వివిధ బ్యాంకుల్లో రుణాలు తీసుకొని నిర్మాణాలను ప్రారంభించారన్నారు. ఇప్పుడు వారు కోర్టుకు వెళితే భారీగా పరిహారం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇదే జరిగితే ఏపీ ముగినిపోతుందని సుజన వ్యాఖ్యానించారు. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు, అక్రమాలకు వైసీపీ వారికి అవకాశం లేదనే విశాఖ మీద పడ్డారని ఆయన ఆరోపించారు.

No comments:

Post a Comment