Monday, December 30, 2019

ఏపీ రాజధానిని మూడు ముక్కలు చేసే అధికారం జగన్‌కులేదు

జగన్‌కు ఆ అధికారం లేదు
31-12-2019 04:14:30

అమరావతిని ముక్కలు చేస్తారా?.. రాజధానిపై మళ్లీ ప్రజాతీర్పు కోరాలి
ఆ భూములను సెజ్‌లకు ఇచ్చే కుట్ర
విశాఖలో ప్రభుత్వ భూములకు బినామీలుగా రాజకీయ నేతలు
సీపీఐ నారాయణ
హైదరాబాద్‌, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ‘ఏపీ రాజధానిని మూడు ముక్కలు చేసే అధికారం సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి ఏ మాత్రమూ లేదు. ఏపీ రాజధానిగా అమరావతిని మొదట జగన్‌ కూడా అంగీకరించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైసీపీ మేనిఫెస్టోలో రాజధాని మార్పు గురించి ఎక్కడా పేర్కొనలేదు. రాజధానిని మార్చాలంటే జగన్‌ మళ్లీ ఎన్నికలకు వెళ్లాల్సిందే’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు.

ADVERTISEMENT


POWERED BY PLAYSTREAM


సోమవారం హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరావతిలో రైతుల నుంచి సేకరించిన భూములు తిరిగి ఇచ్చేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉద్యోగులకు క్వార్టర్స్‌ నిర్మించారని, రోడ్ల నిర్మాణం కూడా జరిగిందని, కాలువలు, చెరువులను పూడ్చేశారని తెలిపారు. ఇప్పుడు రైతులకు భూములు తిరిగి ఇచ్చినా, వ్యవసాయం చేసుకోవడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. రాజధానిని మూడు ముక్కలు చేస్తే.. మిగిలిన భూమి వ్యవసాయానికి పనికి రాకుండా పోతుందన్నారు. వాటిని ఎలాగో రైతులు తీసుకోరని, దీంతో ఆ భూములను సెజ్‌లకు ఇవ్వవచ్చని జగన్‌ యోచిస్తున్నారని నారాయణ ఆరోపించారు.

ఏపీ సీఎం జగన్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌ మంచి మిత్రులని, అందుకే ఒకరినొకరు మెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏపీకి మూడు రాజధానులు అని జగన్‌ ప్రకటన చేయగానే హైదరాబాద్‌లోని భూములకు రేట్లు పెరిగాయని, దీంతో జగన్‌కు కేసీఆర్‌ ధన్యవాదాలు చెబుతున్నారని విమర్శించారు. అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కేపిటల్‌గా మారిందని, అక్కడ ఒక్కపైసా కూడా ఖర్చు పెట్టనక్కర్లేదని నారాయణ అన్నారు. అమరావతిని కొనసాగించేదాకా కమ్యూనిస్టు పార్టీలు పోరాడుతాయన్నారు. భూ దొంగలను కాపాడే విషయంలో జగన్‌, చంద్రబాబు ఇద్దరూ ఒకటే అని నారాయణ విమర్శించారు. విశాఖలో ప్రభుత్వ భూములకు బినామీలుగా రాజకీయ నాయకులు మారిపోయారని, వారిలో వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్‌ నేతలూ ఉన్నారని ఆరోపించారు. ఆ వివరాలను ఆయన వెల్లడించారు.

అన్యాక్రాంతమైన భూములివే..
మధురవాడలోని సర్వే నం.331/5లోని 10 ఎకరాల భూమిని మాజీ సైనికుల పేరుతో స్థానిక నాయకుల ఆక్రమణ.
కొమ్మాది సర్వే నం.28/2లో స్వాతంత్య్ర సమరయోధుని పేరుతో 10 ఎకరాల భూమి అన్యాక్రాంతం.
కొమ్మాది సర్వే నం.161/1లో 10 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా.
కొమ్మాది సర్వే నం.7లో 10 ఎకరాల భూమిని మాజీ సైనికుల పేరుతో ఆక్రమణ.
కొమ్మాది సర్వే నం.154/3లో 5 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం.
కొమ్మాది సర్వే నం.7లో 50 ఎకరాలు మైటాస్‌ సంస్థకు కేటాయించారు. ఆ సంస్థ మాయమైనా భూమిని తిరిగి స్వాధీనం చేసుకోలేదు.
మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తికి పరదేశిపాలెం సర్వే నం.66లో 35 ఎకరాలు భూదాన భూమి.
పెందగంట్యాడ సర్వే నం.274లో 60 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా.
గాజువాక సర్వే నం.87లో 1000 చదరపు గజాల భూమి మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం కుటుంబ సభ్యుల ఆక్రమణ.
పెందుర్తి మండలం ముదపాక భూముల విషయంలో సిట్‌ నిర్ధారణ బయటపెట్టాలి.
పరదేశిపాలెం సర్వే నం.101/1లో నాలుగు ఎకరాల 89 సెంట్ల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలి.

No comments:

Post a Comment