Saturday, June 26, 2021

ఏపీలో కొత్తగా వచ్చిన పరిశ్రమలు ఎన్ని?: రామకృష్ణ

 ఏపీలో కొత్తగా వచ్చిన పరిశ్రమలు ఎన్ని?: రామకృష్ణ


Jun 26 2021


అమరావతి: గత రెండేళ్లలో ఏపీలో కొత్తగా వచ్చిన పరిశ్రమలు ఎన్ని అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సూటిగా ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ తిరోగమన విధానాల వల్ల ఏపీలో కొత్తగా పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేకపోగా, ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు కూడా పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయన్నారు. లులూ గ్రూప్, రిలయన్స్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ట్రైటాన్ వంటి సంస్థల పెట్టుబడులు తరలిపోయినట్లు తెలుస్తోందని తెలిపారు. పారిశ్రామిక పురోగతి లేకుండా రాష్ట్ర ప్రగతి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ఏపీ నుండి రాజ్యసభ సభ్యునిగా గెలిపించిన పారిశ్రామికవేత్త పరిమల్ నత్వాని ద్వారా ఏపీకి ఎంత పెట్టుబడులు వచ్చాయని నిలదీశారు. గత రెండేళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఎన్ని ఉద్యోగాలిచ్చిందంటూ రామకృష్ణ అనేక ప్రశ్నలు సంధించారు

Monday, June 14, 2021

ఐటీ సలహాదారు.. మందు దందా!

 Jun 14 2021 @ 02:55AMహోంఆంధ్రప్రదే

ఐటీ  సలహాదారు.. మందు దందా!

నెలకు రూ.40 కోట్ల ముడుపులు?


ఒక్కో కేసుకు రూ.200 చొప్పున వసూలు


కనీవినీ ఎరుగని బ్రాండ్లూ ఆయన చలవే


సుప్రీం, దారుహౌస్‌ రుద్దడంలో కీలక పాత్ర


జగన్‌, సాయిరెడ్డిలకు సన్నిహితుడు


డిస్టిలరీలకు, ప్రభుత్వ పెద్దలకు సంధానకర్త


మద్యం లావాదేవీలన్నీ ఆయన కనుసన్నల్లోనే


ముఖ్యనేత తరఫునా, సొంతంగా వసూళ్లా?


ఐటీ సలహాదారు రాజశేఖర్‌రెడ్డి దందాపై సర్వత్రా చర్చ 




ఆయన ఓ ఐటీ రంగ నిపుణుడు.. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రంగంలో సలహాదారు కూడా.. ఆ విభాగానికి ఆయన సలహాలు ఇస్తున్నారో లేదో తెలియదు గానీ.. సంబంధం లేని ‘మందు’ శాఖలో మాత్రం ఆయన పేరు మార్మోగిపోతోంది. ప్రపంచంలోనే కనీవినీ ఎరుగని మద్యం బ్రాండ్లు రాష్ట్రంలో ప్రత్యక్షం కావడానికి.. ప్రీమియం బ్రాండ్లు మాయమవడానికి ఆయనగారి చలవే కారణమని తెలుస్తోంది. అసలు పని వదిలేసి.. పైసలొచ్చే కొసరు పనే ఆయనకు ముద్దుగా మారిందనేది సంబంధిత వర్గాల మాట. మొత్తంమీద మద్యం మామూళ్ల లావాదేవీల్లో ఆయన మునిగి తేలుతున్నారన్న చర్చ సర్వత్రా సాగుతోంది!




(అమరావతి - ఆంధ్రజ్యోతి)


రాష్ట్రంలో జరుగుతున్న మద్యం దందాకు మూల పురుషుడిగా, తెర వెనుక వ్యక్తిగా రాష్ట్ర ఐటీ సలహాదారు కేశిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పేరు ప్రభుత్వ వర్గాల్లో విస్తృతంగా వినబడుతోంది. గతంలో అమెరికాలోని కాలిఫోర్నియాలో పనిచేసిన ఈయన.. ఆ త ర్వాత వైసీపీకి తన సేవలందించారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ సారథ్యంలోని ఇండియన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ(ఐప్యాక్‌)లో పనిచేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆయన్ను ఐటీ సలహాదారు(పాలసీ, పెట్టుబడులు)గా నియమించుకుంది. గత రెండేళ్లుగా ఈ పదవిలో కొనసాగుతున్నారు.




తాజాగా మద్యం విక్రయాల్లో జరుగుతున్న గోల్‌మాల్‌ వెనుక ఈయన పేరు వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది. జగన్‌ ప్రభుత్వం వచ్చాక మద్యం అమ్మకాల్లో కొత్త పోకడలు తలెత్తిన విషయం తెలిసిందే. గతంలో ఉండే ప్రముఖ బ్రాండ్లన్నీ పారిపోగా.. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో నడిచే చిల్లరమల్లర బ్రాండ్లన్నీ తెరపైకి వచ్చాయి. ఎవరూ కనీవినీ ఎరుగని బ్రాండ్లు ఇవి. కొన్ని డిస్టిలరీలను తమ అధీనంలోకి తెచ్చుకుని అక్కడ తయారుచేసే మద్యానికి రోజుకో లేబుల్‌ మార్చేస్తూ విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. అవి తప్ప మరే ఇతర బ్రాండ్లూ రాష్ట్రంలో అమ్మడానికి వీల్లేని పరిస్థితులు సృష్టించారు. అయితే ఈ ఎంపిక చేసిన బ్రాండ్ల తెర వెనుక బాగోతాలన్నీ ఐటీ సలహాదారు రాజశేఖర్‌రెడ్డి ద్వారా జరుగుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటు జగన్మోహన్‌రెడ్డికి, ఇటు విజయసాయిరెడ్డికి సన్నిహితంగా మెలిగే ఈయన కనుసన్నల్లోనే మద్యం వ్యాపారమంతా నడుస్తోంది. రాష్ట్రంలో నెలకు 20 లక్షల కేసుల మేర మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఒక్కో కేసుకు రూ.200 వంతున ముడుపులు చెల్లించాల్సి వస్తోందన్నది మద్యం వ్యాపార వర్గాల మాట.




ఈ లెక్కన నెలకు రూ.40 కోట్లు ముడుపుల దందా సాగుతోందన్న మాట. మరి ముఖ్య నేత తరఫునే ఈ వసూళ్లు చేస్తున్నారా.. లేదా తానే సొంతంగా దందా సాగిస్తున్నారా అనేది తేలాల్సి ఉంది! మొత్తానికి నెలకు రూ.40 కోట్ల మేర పిండుతున్న ముడుపులు ఎక్కడెక్కడికి చేరుతున్నాయన్న దానిపై అటు మద్యం వ్యాపారుల్లోనూ, ఇటు ఎక్సైజ్‌ అధికారుల్లోనూ ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. 




అదాన్‌ వెనుక..


అదాన్‌ డిస్టిలరీస్‌ పుట్టుపూర్వోత్తరాలు, దాని వెనుక ఉన్న పెద్దల వివరాలను పరిశీలిస్తే ఈ గూడుపుఠాణి వ్యవహారం మరింత స్పష్టంగా అర్థమవుతుంది. అదాన్‌ డిస్టిలరీ్‌సకు ప్రస్తుతం ఇద్దరు డైరెక్టర్లున్నారు. వారిలో ఒకరు కె.శ్రీనివాస్‌. ఈయన టెనెట్‌బైలాజికల్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అనే మరో కంపెనీలో కూడా డైరెక్టర్‌. ఆ కంపెనీలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌రెడ్డి కూడా డైరెక్టరే. అదాన్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ కాకినాడ సీపోర్టు ప్రైవేటు లిమిటెడ్‌లో అదనపు డైరెక్టర్‌గా ఉండడం గమనార్హం. వీటన్నిటినీ పరిశీలిస్తే రాష్ట్రంలో మద్యం వ్యాపారం మొత్తం ఎలా నడుస్తుందో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఐటీ సలహాదారుగా ఉంటూ అక్కడ చేసింది, చేస్తోంది ఏమీ లేకపోయినా.. ఈ మద్యం లావాదేవీల్లో మాత్రం రాజశేఖర్‌రెడ్డి తలమునకలైపోయారని.. డిస్టిలరీ్‌సకు, ప్రభుత్వ పెద్దలకు అనుసంధానకర్తగా కీలక లావాదేవీలన్నీ ఆయన చక్కబెడుతుంటారని ప్రచారం జరుగుతోంది. డిస్టిలరీస్‌ యాజమాన్యాలతో ప్రభుత్వ పెద్దలకు సాన్నిహిత్యం ఉండడం, ప్రభుత్వంలో ఉన్నవారే వారితో వ్యవహారాలు నడిపిస్తుండడంతో ఈ వాదనకు మరింత బలం చేకూరుతోంది!!




రెండే రెండు బ్రాండ్లు..


రాష్ట్రంలో అమ్ముడవుతున్న మద్యంలో అత్యధిక భాగం రెండు బ్రాండ్లే కనిపిస్తాయి. అందులో ప్రధానమైనది అదాన్‌ డిస్టిలరీస్‌ ఉత్పత్తి చేసే సుప్రీం బ్లెండ్‌ విస్కీ. రెండోది దారుహౌస్‌. హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న అదాన్‌ డిస్టిలరీస్‌ సుప్రీం బ్లెండ్‌ విస్కీని తయారు చేస్తుండగా.. కర్నూలు కేంద్రంగా దారుహౌస్‌ బ్రాందీ తయారవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో 70 శాతం మేర ఈ మద్యమే అమ్ముడవుతోంది. అదేదో జనం ఇష్టపడి కొనుక్కుంటోంది కాదు. ప్రభుత్వమే ఈ రెండు బ్రాండ్లను.. మరీ ముఖ్యంగా సుప్రీం బ్రాండ్‌నే రాష్ట్ర మద్యం దుకాణాల్లో అమ్ముడయ్యేలా శాసిస్తూ.. అనివార్యంగా ప్రజలు వాటినే కొనుక్కునే పరిస్థితి సృష్టించింది. ఈ మద్యం మాత్రమే కొనుగోలు చేసి దుకాణాల్లో అమ్మించడానికి తెర వెనుక జరిగిన తతంగం, ఆ తర్వాతి లావాదేవీల్లో రాజశేఖర్‌రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Saturday, May 29, 2021

Jagan Two years Rule

 పంచడం..తుంచడం!

జగన్‌ పాలనకు రెండేళ్లు

May 30 2021


రెండేళ్ల పాలనలో ఏమున్నది గర్వకారణం?

నవరత్నాలు మినహా అన్నీ పక్కకే!

వ్యక్తిగత లబ్ధి.. రాజకీయ ప్రయోజనానికే ప్రాధాన్యం

రాజధాని అమరావతిని అటకెక్కించారు.. ‘మూడు’పై ముందుకుపోలేరు

నగరాలు, పరిశ్రమల అభివృద్ధికి మంగళం.. తాడేపల్లికే సీఎం పరిమితం

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమూ ‘రివర్స్‌’.. పోలవరం పరిస్థితిపై అనిశ్చితి

ప్రత్యేక హోదాపై ఎప్పుడో హ్యాండ్సప్‌.. నోరెత్తే నేతలపై కేసులు, అరెస్టులు

ఒక్కచాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చారు. ఐదేళ్లలో ఇప్పటికి రెండేళ్లు కరిగిపోయాయి. విభజన అనంతరం నవ్యాంధ్రగా ఏర్పడిన సీమాంధ్ర తొలి నాళ్లలో కన్న కలలన్నీ చెదిరిపోయాయి. కొత్త సర్కారు ప్రాధాన్యాలు మారిపోయాయి. రాజధాని అమరావతి లేదు. కొత్త పరిశ్రమలు లేవు. పెట్టుబడులు రావు. రెండేళ్ల పాలన గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే... అప్పులు తెచ్చి ‘సంక్షేమం’ పేరిట నగదు పంచడం, రాజకీయ ప్రత్యర్థులను రకరకాల కేసుల్లో అరెస్టు చేయడం! ఈ రెండింటిపైనే దృష్టి! ‘వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అను నేను’ అని ప్రమాణ స్వీకారం చేసి రెండేళ్లయిన సందర్భంగా ఒక విశ్లేషణాత్మక కథనం.... 

(అమరావతి- ఆంధ్రజ్యోతి)

వ్యక్తిగత లబ్ధి చేకూరే పథకాలను అమలు చేయడం.. అందులోనూ ఉత్పాదకత, ఉత్పత్తితో సంబంధంలేకుండా నేరుగా ఖాతాల్లోకే నగదు జమచేయడం.. ఓటు బ్యాంకును భద్రంగా చూసుకోవడం! సూటిగా చెప్పాలంటే... ఇదే రెండేళ్ల వైసీపీ పాలన సారాంశం! జగన్‌ పాలన కూల్చివేతలతోనే మొదలైంది. ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలోనే ప్రజా వేదికను కూల్చివేశారు. ఇది ఇప్పటిదాకా రాష్ట్ర ప్రజలు ఎరుగని అనుభవం. అవినీతి అధికారులు అక్రమ సంపాదనతో కట్టుకున్న భవనాలను బిహార్‌లో స్కూళ్లు, పాఠశాలలుగా మార్చారు. కానీ... స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే, ప్రజా ధనంతో నిర్మించిన ప్రజా వేదికను ప్రజల అవసరాల కోసం వాడుకునే అవకాశమున్నా... ‘అక్రమ నిర్మాణం’ అంటూ కూల్చివేయడం విస్మయపరిచింది. ఇక జరగబోయేది కట్టడం కాదు... కూల్చడమేనా అనే అనుమానాలకు అప్పుడే బీజాలు పడ్డాయి. మే 20వ తేదీన జరిగిన ఒకరోజు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశం సందర్భంగా.. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై తరహాలో రాష్ట్రంలో ఒక ప్రథమశ్రేణి నగరంలేదని సీఎం జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ... ఆ దిశగా నగరాలను అభివృద్ధి చేసే ప్రయత్నాలు మాత్రం జరగడంలేదు. రాష్ట్రంలో ‘కాస్మొపాలిటిన్‌’ లక్షణాలున్న ఏకైక నగరం విశాఖపట్నం! ఈ నగరాన్ని పర్యాటక, ఐటీ, వాణిజ్య రాజధానిగా మార్చేందుకు చేపట్టిన ప్రణాళికలన్నీ వైసీపీ సర్కారు పక్కన పడేయడం గమనార్హం. మరోవైపు... అభివృద్ధి అంటే నాలుగు భవనాలు నిర్మించడమేనా అంటూ ప్రభుత్వ పెద్దలు కొత్త వాదన తీసుకురావడం విశేషం. భవనాలు నిర్మించడం ఒక్కటే అభివృద్ధి కాకపోవచ్చు. కానీ... ఆర్థిక కార్యకలాపాలకు, కొత్త ఉపాధికి ఊతమిచ్చేది నగరాలే!

కేసులు... అరెస్టులు...

ప్రతిపక్ష నేతగా ఉండగా... ప్రభుత్వంపై జగన్‌, వైసీపీ నేతలు నిత్యం విరుచుకుపడేవారు. ఇక... సోషల్‌ మీడియాను ప్రధాన అస్త్రంగా వాడుకున్నారు. అధికారంలోకి వచ్చాక సోషల్‌ మీడియా పోస్టులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టులు పెడితే చాలు... సీఐడీ రంగంలోకి దిగుతోంది. రాత్రికి రాత్రి అరెస్టులు చేస్తోంది. ఇక... విపక్షంలో చురుగ్గా వ్యవహరించే నేతలపై రకరకాల కేసులు పెట్టడం, ఆందోళనలు చేయకుండా గృహనిర్బంధం చేయడం నిత్యకృత్యంగా మారింది. ఈ స్థాయి కక్ష సాధింపు చర్యలు గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ లేవని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

ప్రాజెక్టులు పార‘నీరు’

రాష్ట్రానికి జల జీవ నాడి... పోలవరం! 2021 జూన్‌ నాటికి పూర్తి చేస్తామని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. ఇప్పటి వరకూ కాఫర్‌ డ్యామ్‌ను మూసివేసే పనులు కూడా పూర్తి చేయలేదు. ఆ సంగతి పక్కనపెడితే... నీటినిల్వ గరిష్ఠ మట్టాన్ని 41.15 మీటర్లకు తగ్గించి పోలవరం జలాశయాన్ని ఒక సాధారణ బ్యారేజీగా మార్చే ప్రమాదం కూడా కనిపిస్తోంది. కొత్తగా మరో ఎత్తిపోతలను తెరపైకి తేవడం మరో అనుమానానికి దారి తీస్తోంది. కొత్త అంచనాల ప్రకారం నిధులు ఇచ్చేది లేదని కేంద్రం తేల్చి చెప్పినా... ఒత్తిడి తెచ్చి, నిధులను సాధించుకోలేని పరిస్థితి నెలకొంది. 

ఇంటికే పరిమితం...

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ జగన్‌ తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయానికే పరిమితమయ్యారు. క్యాబినెట్‌ సమావేశాలు ఉంటే మినహా... ‘సచివాలయానికి రాని సీఎం’గా పేరు తెచ్చుకున్నారు. జిల్లాల పర్యటనలు, జనంలోకి వెళ్లడం దాదాపుగా నిల్‌! ఇక... ముఖ్యమంత్రి అయ్యాక ఢిల్లీలో ఒకసారి మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత అమరావతిలోకానీ, ఢిల్లీలో కానీ మీడియాతో మాట్లాడిందే లేదు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు నీలం సంజీవరెడ్డి నుంచి నవ్యాంధ్ర తొలి సీఎం చంద్రబాబు వరకు ఎవ్వరూ ఈ తరహాలో ఇంటికి పరిమితం కాలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మాట తప్పినట్లేనా... 

ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు ‘ప్రత్యేక హోదా- దాని ప్రయోజనాల’పై జగన్‌ మాట్లాడని రోజు లేదు. ఎన్నికల ప్రచారమంతా దాని చుట్టూనే సాగింది. అధికారంలోకి రాగానే... హోదా గాలిలో కలిసిపోయింది. ఈ రెండేళ్లలో కేంద్రంపై చిన్నపాటి ఒత్తిడి కూడా తెచ్చిన పాపాన పోలేదు. పైగా... ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లోనే హోదాపై జగన్‌ చేతులు ఎత్తేశారు. ‘‘బీజేపీకి మనతో అవసరం లేదు. సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి... విన్నపాలు చేసుకోవడంతప్ప మరో మార్గం లేదు’’ అంటూ విపక్షనేతగా ఉన్నప్పుడు చూపిన ‘పోరాట పటిమ’ను ఒక్కసారిగా పక్కనపెట్టేశారు. ఇది మాత్రమే కాదు! రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి అనేక అంశాలపై కేంద్రంపై ఒత్తిడి తేకుండా...లేఖలు రాసి వదిలేస్తున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం ఒక ఉదాహరణ. ఇక... అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు సిబ్బందిని శాశ్వత ఉద్యోగులను చేస్తానన్న హామీ ని  మరిచిపోయారు. అధికారంలోకి రాగానే పాత పెన్షన్‌ ప ద్ధతి పునరుద్ధరిస్తామని, సీపీఎస్‌ రద్దుచేస్తామని చె ప్పారు. దీనిపై కేంద్రానికి లేఖ రాయడం మినహా చేసిందేమీ లేదు.

నవరత్నాల సర్కార్‌...

ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ‘నవరత్నాల’ను అమలు చేస్తే చాలు... ఇక అన్నీ చేసినట్లే అని సర్కారు భావిస్తోంది. ఆదాయం పెంచుకునే మార్గాలన్నీ వదిలేసి... అప్పులు తెచ్చి, పథకాలు అమలు చేయడపైనే దృష్టి సారించింది. ఊరికి, మండలానికి, జిల్లాకు, రాష్ట్రానికి పనికొచ్చే పనులు చేయకపోయినా... వ్యక్తిగత లబ్ధి చేకూర్చే పథకాలను అమలు చేయడం ద్వారా ‘సొంత ప్రతిష్ఠ’ను పెంచుకోవడమనే ఫార్ములా పూర్తిస్థాయిలో అమలవుతోంది. 

బాబు ముద్ర ఉండొద్దని..

నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు ముద్రను చెరిపివేయడమే లక్ష్యంగా కొత్త పాలన జరుగుతోందనే విమర్శలున్నాయి. చంద్రబాబు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ, ప్రజలను కలిసే ‘ప్రజా వేదిక’ కూల్చివేత అందులో భాగమే అనే విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత... ‘అమరావతి’నీ అటకెక్కించారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట పాలనా రాజధాని, శాసన రాజధాని, న్యాయ రాజధాని అంటూ మూడు ముచ్చట మొదలుపెట్టారు. ఇందులో ఉన్న శాసన, న్యాయపరమైన సంక్లిష్టతలు, రాజధానికి భూములిచ్చిన రైతులకు న్యాయం ఎలా చేస్తారో చెప్పకుండానే... ప్రకటన చేశారు. దీని ఫలితం... అటు అమరావతి మూలన పడిపోయింది. ఇటు మూడు రాజధానులూ ముందుకు కదలడంలేదు. ‘ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఏది?’ అంటే... సమాధానం చెప్పుకోవడానికి తడుముకోవాల్సిన పరిస్థితి!


Friday, May 28, 2021

Jagan Bail - CBI & Central Government

 జగన్‌ బెయిలుపై సీబీఐ ఏమంటుంది? రద్దా.. వద్దా!?

May 29 2021

రఘురామ పిటిషన్‌పై ‘కౌంటర్‌’ ఏమిటి?

కేంద్రం ‘సూచన’లే సీబీఐకి కీలకం!?

జగన్‌తో కేంద్రం సంబంధాలకుసంకేతం

రద్దు చేయాలంటే తేడా వచ్చినట్లే

బెయిలుకే ఓకే అంటే ‘ఆల్‌ ఈజ్‌ వెల్‌’

ఒకటో తారీఖున తేలనున్న సంగతి

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి జగన్‌ బెయిలును రద్దు చేయాలన్న పిటిషన్‌పై సీబీఐ ఎలాంటి వైఖరి తీసుకుంటుంది? ‘ఔను... రద్దు చేయాలి!’ అంటుందా? లేక... ‘రద్దు చేయవద్దు.  బెయిలు నిబంధనలను ఆయన ఎంతమాత్రమూ ఉల్లంఘించడంలేదు’ అని చెబుతుందా? ఇది సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం. జగన్‌ బెయిలు రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై జగన్‌తోపాటు సీబీఐ కూడా కౌంటర్‌ దాఖలు చేయాల్సి ఉంది. కానీ... లాక్‌డౌన్‌ పేరుతో జగన్‌ న్యాయవాది, ఉన్నతాధికారుల అభిప్రాయం తెలుసుకోవాలంటూ సీబీఐ లాయర్‌ కౌంటర్‌ వేయకుండా వాయిదా కోరారు. దీనిపై సీబీఐ కోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ... జూన్‌ 1లోపు కౌంటర్‌ వేయకుంటే, తామే పిటిషన్‌పై నేరుగా విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. అంటే... ఇక మూడు రోజులే గడువు! జగన్‌ కౌంటర్‌ విషయంలో ఎలాంటి గందరగోళమూ లేదు. ఎందుకంటే... బెయిలు రద్దు చేయవద్దనే ఆయన కోరుతారు. ఇక... సీబీఐ ఏం చెబుతుందన్నదే ప్రశ్న! కేంద్రం మనసులో మాట?: అధికారంలోకి రాకముందు నుంచే బీజేపీతో జగన్‌ సత్సంబంధాలు నెరుపుతున్న విషయం బహిరంగ రహస్యమే. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన అదే వైఖరి కొనసాగిస్తున్నారు. ప్రత్యేక హోదా మొదలుకుని, కొవిడ్‌ సమయంలో రాష్ట్రానికి ఆక్సిజన్‌/వ్యాక్సిన్‌ కేటాయింపు వరకు... ‘విన్నపాల’కు మాత్రమే పరిమితమవుతున్నారు. ప్రధానమంత్రిని జార్ఖండ్‌ ముఖ్యమంత్రి విమర్శించినా జగన్‌ ఊరుకోకపోవడం గమనార్హం. ‘రాజకీయ ప్రాధాన్యమున్న’ కేసుల్లో సీబీఐ సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో... జగన్‌ బెయిలు రద్దు పిటిషన్‌పై కేంద్రం ‘సూచనల’ ప్రకారమే నడుచుకునే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఏం జరగవచ్చు...

దర్యాప్తు సంస్థలు నిందితుడికి వ్యతిరేకంగా వ్యవహరించడం సహజం. బెయిలు పిటిషన్లను వ్యతిరేకించడం, గరిష్ఠ శిక్ష విధించాలని కోరడం... ఇందులో భాగమే. ఈ విధంగా చూస్తే... జగన్‌ బెయిలును రద్దు చేయాలని సీబీఐ కోరాలి. అదే జరిగితే... పెద్ద సంచలనం అవుతుంది. జగన్‌పట్ల కేంద్రం వైఖరికి అదొక సంకేతంగా భావించవచ్చు. ఇక... సీబీఐ ముందున్న మరో ‘ఆప్షన్‌’, బెయిలు రద్దు చేయాల్సిన అవసరం లేదని చెప్పడం! ఇది ఒక దర్యాప్తు సంస్థగా సీబీఐ చేయకూడని పని. ఎందుకంటే... రఘురామరాజు తన పిటిషన్‌లో అనేక కీలక అంశాలను ప్రస్తావించారు. అక్రమాస్తుల కేసులో సాక్షులను ప్రత్యక్షంగా, పరోక్షంగా బెదిరిస్తున్నారని.. బెయిల్‌ షరతులను ఉల్లంఘిస్తున్నారని తెలిపారు. న్యాయస్థానం ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. పలువురు సాక్షులు జగన్‌ ప్రభుత్వంలో అధికారులుగా ఉండటం, కొందరు సహ నిందితులు కీలక స్థానాల్లో ఉండటం, ఒకరికి సలహాదారు పదవి ఇవ్వడం, విజయసాయి రెడ్డి, అయోధ్య రామిరెడ్డిని రాజ్యసభకు పంపడం లాంటివన్నీ పిటిషన్‌లో వివరించారు. ప్రజాప్రతినిధుల కేసుల్లో విచారణ వేగవంతం చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను జీర్ణించుకోలేని వైసీపీ నేతలు న్యాయవ్యవస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ఇంత నిర్దిష్టమైన అంశాలు పేర్కొన్నప్పటికీ... జగన్‌ బెయిలు రద్దు చేయకూడదనే వైఖరికే సీబీఐ కట్టుబడితే అది కేంద్రం ‘సూచనల’ మేరకే జరిగినట్లు భావించాల్సి ఉంటుంది. ఇది... కేంద్రంతో జగన్‌ సత్సంబంధాల ఫలితమే అని చెప్పవచ్చు. 

మౌన మార్గం...

జగన్‌ బెయిలు రద్దుకు ఎస్‌ లేదా నో చెప్పడంతోపాటు సీబీఐ ముందు మరొక ఆప్షన్‌ కూడా ఉంది. అదేమిటంటే... ‘ఈ విషయంలో మేం జోక్యం చేసుకోం. మీరే నిర్ణయం తీసుకోండి’ అని బంతిని సీబీఐ కోర్టులోకే నెట్టేయడం! అలాగే... అసలు కౌంటరే వేయకుండా మౌనం పాటించవచ్చు. ‘జూన్‌ 1వ తేదీ నాటికి కౌంటర్‌ వేయకపోతే నేరుగా పిటిషన్‌పై విచారణ చేపడతాం’ అని కోర్టు ఇప్పటికే చెప్పింది. ఆ తర్వాత... విచారణ సమయంలో సీబీఐ  అభిప్రాయాన్ని కోరే అవకాశముంటుంది. అది ప్రస్తుతానికి... అప్రస్తుతం! మొత్తానికి... జగన్‌ విషయంలో కేంద్రం మెతక వైఖరితో ఉందా, వ్యతిరేకత భావనతో ఉందా అనే విషయం మరో మూడు రోజుల్లో తేలిపోతుంది.

కొసమెరుపు: తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా బీజేపీ రాష్ట్ర సహ ఇన్‌చార్జి సునీల్‌ దియోధర్‌ బహిరంగంగా మాట్లాడుతూ... త్వరలో జగన్‌ బెయిల్‌ రద్దవుతుందని వ్యాఖ్యానించారు. దీని భావమేమిటో మరి!




Thursday, May 27, 2021

అధికార మదంతో ప్రభుత్వ టెర్రరిజం

 అధికార మదంతో ప్రభుత్వ టెర్రరిజం


May 28 2021

కరోనా విలయంలోనూ దాడులేనా?


కక్ష సాధింపుల గడ్డగా మార్చారు.. ప్రతి తప్పుడు కేసునూ మేమొచ్చాక సమీక్షిస్తాం


ఆ అధికారులపై ప్రైవేటు కేసులు వేస్తాం.. తప్పులు చేయిస్తున్నవారూ రక్షించలేరు


ఇప్పుడు అతి చేస్తున్న ప్రతి వైసీపీ నేతా ఇంతకింత చెల్లించుకుంటారు


కొవిడ్‌ వ్యాక్సిన్లకు డబ్బివ్వరు.. రంగుల ప్రకటనలకు మాత్రం వందల కోట్లు


కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో లాక్కుంటున్నారు.. అయినా సంక్షేమ భజన


చంద్రబాబు ఆగ్రహం.. మహానాడు తొలి రోజు ప్రసంగం

అమరావతి, మే 27 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ టెర్రరిజం అడుగడుగునా అధికార మదంతో తాండవమాడుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని వేధింపులు, కక్ష సాధింపులకు చిరునామాగా మార్చారని మండిపడ్డారు. ‘‘కరోనా విలయంలో వేల సంఖ్యలో ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే వారి ప్రాణాలు కాపాడే బాధ్యతను గాలికి వదిలిపెట్టి రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేసి కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనేవారు లేక రైతులు అల్లాడుతుంటే పట్టదు. మాస్కులు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించిన వైద్యుడు ఈ లోకం వదిలి వెళ్ళేవరకూ వెంటాడి వేధిస్తారు. ఇదొక పాలనా? దీనికోసమేనా ఒక్క చాన్సు కావాలని ప్రజలను వేడుకుని అధికారంలోకి వచ్చింది’ అని నిలదీశారు. గురువారం ప్రారంభమైన టీడీపీ రెండు రోజుల డిజిటల్‌ మహానాడులో ఆయన తొలుత ప్రారంభోపన్యాసం చేశారు. రాజకీయ వేధింపుల తీర్మానంపై కూడా మాట్లాడారు. ‘తప్పుడు కేసులతో అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ధూళిపాళ్ల నరేంద్ర, జేసీ ప్రభాకర్‌ రెడ్డి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి వంటి టీడీపీ నేతలను అరెస్టు చేశారు. ఎంపీ రఘురామరాజును పోలీసు కస్టడీలో తీవ్రంగా కొట్టారు. సోషల్‌ మీడియాలో పోస్టు పెడితే కేసులు.. అరెస్టులు. ఆస్పత్రిలో రోగులను పరామర్శించడానికి వెళ్తే అరెస్టులు. మీడియాపై దేశ ద్రోహం కేసులు... సుప్రీంకోర్టు ఆదేశాన్ని కూడా లెక్కచేయకుండా అహంకారంతో పరిషత్‌ ఎన్నికలను పెడితే హైకోర్టు వాటిని రద్దు చేసింది. రాష్ట్రంలో ప్రజస్వామ్యం హతమారిపోతోందని కోర్టులు వ్యాఖ్యానించే పరిస్థితి వచ్చింది’ అని వ్యాఖ్యానించారు. 

ఇంకా ఏమన్నారంటే..చూస్తూ ఊరుకోవద్దు..

పోలీసులు అడ్డగోలుగా తప్పుడు కేసులు పెడితే టీడీపీ శ్రేణులు చూస్తూ ఊరుకోవద్దు. ఎదురు తిరిగి ప్రైవేటు కేసులు వేయాలి. ఈ విషయంలో పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది. స్టేషన్లో కొడితే మేజిస్ట్రేట్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయండి. ఎంపీ రఘురామరాజు అలా చేయడం వల్లే పై నుంచి కిందవరకూ అందరూ ఇరుక్కుపోయారు. పోలీసులు కూడా ఆలోచించుకోవాలి. కరోనాతో మీ వాళ్లు కూడా వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. అయినా ప్రభుత్వానికి పట్టడం లేదు. మీతో తప్పులు చేయిస్తోంది. రేపు మిమ్మల్ని కాపాడేందుకు వాళ్లెవరూ ఉండరు. వైసీపీ నేతలకూ ఒక మాట గట్టిగా చెబుతున్నాం. గతంలో చూసీ చూడనట్లు ఊరుకున్నాం. ఇక ముందు సహించేది లేదు. అన్నీ వడ్డీతో చెల్లిస్తాం. సంక్షేమ పఽథకాల పేరుతో కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో అంతకు రెట్టింపు లాక్కుంటున్నారు. సామాన్యుల బతుకు దుర్భరం చేస్తున్నారు. ఆదాయాలు పడిపోయి ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఎక్కడా పనులు లేవు. అమరావతిని చంపేశారు. పరిశ్రమలు రావడం లేదు. ఉద్యోగాలు లేవు.  అప్పులపై బండి నడిపిస్తున్నారు. మూడు తరాలకు సరిపోను అప్పుల భారం  మోపుతున్నారు. రైతులకు రూ.87 వేల కోట్లు ఇచ్చామని కబుర్లు చెబుతున్నారు. పంట కొనే దిక్కే లేదు. రాష్ట్రంలో ఏ రైతు ఆనందంగా ఉన్నాడు? గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా అమ్మేశారు. దివాలా తీసిన వ్యక్తుల మాదిరిగా ఉన్నవన్నీ అమ్ముకుని బండి నడిపిస్తున్నట్లుగా ఉంది. 14 కొత్త వైద్య కళాశాలలు పెడుతున్నామని ప్రతి రోజూ చెబుతున్నారు. పెట్టడానికి నిధులు ఎక్కడున్నాయి? ఏం చేశారో చెప్పలేక ప్రతిపక్షాన్ని బూతులు తిట్టి పోతున్నారు. 

ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి

కరోనా సమయంలో పేదలకు, అవసరం ఉన్న వారికి పార్టీ నేతలు చేతనైనంత సాయం చేయాలి. చాలా కుటుంబాలు అనారోగ్యం బారిన పడి భోజనం సమకూర్చుకోలేక ఇబ్బంది పడుతున్నాయి. అటువంటి వారికి ఇళ్లకే భోజనం పంపండి. ఎక్కడైనా మీకు శక్తి లేకపోతే చెప్పండి. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా కొంత డబ్బు సమకూరుస్తాం. ట్రస్ట్‌ ద్వారా 600 మంది వరకూ ఆన్‌లైన్‌లో వైద్య సేవలు పొందారు. ఐదు వేల మంది వరకూ సేవలు పొందేలా విస్తరించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చినవారు అదే అధికారాన్ని ఉపయోగించుకుని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకున్నారు. మీడియాను, న్యాయవ్యవస్థనే బెదిరించడం.. ప్రతిపక్ష అభ్యర్థులపై దాడులు చేయడం దారుణమని యాక్షన్‌ ఫర్‌ డెమెక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) నివేదికలో పేర్కొన్నారు. వృత్తిలో అత్యున్నతంగా ఉన్నవారికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పదవి ఇస్తారు. కానీ ప్రభుత్వంలో అప్పుడే పదవీ విరమణ చేసినవారికి ఇచ్చారు. పరిషత్‌ ఎన్నికలపై సుప్రీంకోర్టు ఉత్తర్వులను అర్థం చేసుకోలేదు. చట్టవిరుద్ధంగా జారీచేసిన నోటిఫికేషన్‌ వల్ల రూ.120కోట్లు ఖర్చు. ఈ ముఖ్యమంత్రి ఆలోచన ఏంటో ఇలాంటి నియామకాలు, చర్యలతో అర్థం కావాలి.


ఆనందయ్యను రాచిరంపాన పెడుతున్నారు


సమాజ హితం కోరి తనకు తెలిసిన పరిజ్ఞానాన్ని నలుగురికి అందించాలని తపించిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యను వైసీపీ ప్రభుత్వం రాచిరంపాన పెడుతోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అంటూ ఒకరుంటే దీనిపై స్పందించాలని డిమాండ్‌ చేశారు. కరోనాపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఆనందయ్య విషయాన్ని ప్రస్తావించారు. ‘ఆయన్ను పోలీసులు తీసుకెళ్లి తమ అదుపులో ఉంచుకున్నారు. అధికార పార్టీ నేతలు ఆయనతో రహస్యంగా ఆ మందు తయారు చేయించి తమ వారికి పంచుకుంటున్నారు. ఇదేనా పాలన? ఆయన్ను ఇంటికి పంపండి. కావాలంటే అక్కడ పోలీసు కాపలా పెట్టుకోండి. ఆయన కుటుంబ సభ్యులను భయపెట్టవద్దు’ అని సూచించారు.

ఖలీల్‌ జిబ్రాన్‌ కవిత.. 

లెబనాన్‌ కవి ఖలీల్‌ జిబ్రాన్‌ కవితను చంద్రబాబు చదివి వినిపించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్ధితులకు ఇది అద్దం పడుతోందని వ్యాఖ్యానించారు. ‘ఎవరి నాయకులైతే అబద్ధాలకోరులవుతారో ఆ జాతిని చూసి జాలిపడదాం. నిజం చెప్పే ధైర్యం చచ్చిన మేధావులు, జాతి విద్వేషంతో రగులుతూ పరుల గాలిని సైతం సహించని మూకలున్న దేశాన్ని చూసి జాలిపడదాం. రక్తపాతం, చిత్రహింసలతో ప్రపంచాన్ని ఏలాలనుకునే బందిపోట్లను, రౌడీలను హీరోలుగా కొలిచే జాతిని చూస్తే జాలేస్తోంది. తమ హక్కులు తెంచుకుపోతున్నా.. తమ స్వేచ్ఛ కొట్టుకుపోతున్నా కిమ్మనని దేశాన్ని, ప్రజలను చూసి జాలిపడదాం’ అని ఆ కవితలో ఉంది.

అధికారంతో మిడిసిపాటు


May 28 2021

అన్నీ రాసి పెట్టుకుంటున్నాం.. వడ్డీతో బదులు తీరుస్తాం


మాకూ ఒక రోజు వస్తుందని గుర్తుంచుకోండి


వైసీపీ నేతలకు చంద్రబాబు హెచ్చరిక


జనార్దన్‌రెడ్డి అరెస్టుపై ఆన్‌లైన్‌లో నిరసన దీక్ష


తప్పుడు కేసులు పెడితే పోలీసులపై ప్రైవేటు కేసులు


స్టేషన్లో కొడితే మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు


టీడీపీ అధినేత ఆగ్రహం

ఈ రోజు ఎవరెవరు ఏం చేశారో అన్నీ గుర్తు పెట్టుకుంటున్నాం. రాసి ఉంచుకుంటున్నాం. అణిచివేతను, కక్ష సాధింపును అనుభవించిన ప్రతి టీడీపీ నాయకుడు, కార్యకర్త దానికి బదులు తీర్చుకుంటారని గుర్తుంచుకోండి. 

రాయలసీమలో ఫ్యాక్షన్‌ రాజకీయాలు, ప్రతీకార రాజకీయాలు ఉండకూడదని టీడీపీ శ్రమించి పనిచేసి వాటిని రూపుమాపింది. కానీ ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత వేధింపు రాజకీయాలు మొదలయ్యాయి. 

 - చంద్రబాబు

అమరావతి, మే 26 (ఆంధ్రజ్యోతి): అధికారం చేతిలో ఉందని వైసీపీ నేతలు మిడిసిపడుతున్నారని.. వారి ప్రతి అరాచకానికీ వడ్డీతో బదులు తీరుస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా బుధవారం టీడీపీ నిర్వహించిన ఆన్‌లైన్‌ నిరసన దీక్షలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘అధికారం అండతో ప్రభుత్వ టెర్రరిజాన్ని ప్రదర్శిస్తున్నారు. నాయకులను అణచివేస్తే టీడీపీ ఉండదని భ్ర మిస్తున్నారు. ఎంత అణిచివేస్తే అంత బలంగా పోరాడే శక్తి టీడీపీ శ్రేణులకు ఉంది. గడియారం తిరుగుతూనే ఉంటుంది. ఒక రోజు మాకూ వస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ‘మనపై తప్పుడు కేసులు పెట్టిన వారిపై ప్రైవేటు కేసు వేసే హక్కు మనకు ఉంది. ఎంతవరకై నా వెళ్లి పోరాడదాం. స్టేషన్లో పోలీసులు కొట్టినా ఊరుకోవలసిన అవసరం లేదు. నిర్భయంగా మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేయండి. అక్కడ న్యాయం జరగకపోతే ఇం కా పైకి వెళ్దాం. ఎంపీ రఘురామరాజును పోలీసు కస్టడీలో కొట్టించారు. ఆర్మీ ఆస్పత్రిలో నిజాలు బయటకు వచ్చి ముఖ్యమంత్రి బోనులో నిలబడ్డారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతివారూ పోరాడాలి. పోలీసుల్లో కొందరు మరీ అతిగా పోతున్నారు. వారందరినీ గుర్తు పెట్టుకుంటు న్నాం. ప్రభుత్వం మారితే మీ పరిస్థితేం టో ఆలోచించుకోండి. మీకు జీతాలు ఇస్తోంది ప్రజలు తప్ప వైసీపీ నేతలు కాదు. మరీ ఎక్కువ చేస్తే తర్వాత పశ్చాత్తాపపడాల్సి వస్తుంది’ అని ఆయన హెచ్చరించారు.

ఇంత చెత్త సీఎంను చూడలేదు..

కరోనా సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడే పనిని వదిలిపెట్టి రాజకీయ కక్ష సాధింపులపై జగన్‌రెడ్డి దృష్టి పెట్టి పనిచేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. టీడీపీ తన రాజకీయ చరిత్రలో చాలా మంది ముఖ్యమంత్రులను చూసిందని, కానీ ఇంత చెత్త ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదన్నారు. ‘కరోనా వచ్చిన పేదలు, మధ్య తరగతి ప్రజలు చికిత్స కోసం అల్లాడుతున్నారు. డబ్బులు లేకపోతే ప్రాణాలు నిలబడే పరిస్థితి లేదు. పడకలు దొరకవు... ఆక్సిజన్‌ దొరకదు. ఇవేవీ ఈ సీఎంకు పట్టవు. ఉన్మాద పాలనకు కేరాఫ్‌ అడ్ర్‌సగా మారింది’ అని విమర్శించారు. కేసులు, అరెస్టులకు భయపడవద్దని...భయపడి ఇంట్లో దాక్కుంటే ఇంకా మీద పడతారని, అందరూ కలిసి తిరగబడితేనే వెనక్కి తగ్గుతారని పార్టీ శ్రేణులకు సూచించారు. బీసీ జనార్దన్‌రెడ్డి ఏనాడూ ఫ్యాక్షన్‌ రాజకీయాల జోలికి పోలేదని, సొంత డబ్బులతో నియోజకవర్గం అభివృద్ధికి పనిచేశారని గుర్తుచేశారు.



State Terrorism - TDP ఆంధ్రప్రదేశ్‘స్టేట్ టెర్రరిజం’ అంటూ ఏపీలో పాలనపై మహానాడులో తీర్మానం

 ఆంధ్రప్రదేశ్‘స్టేట్ టెర్రరిజం’ అంటూ ఏపీలో పాలనపై మహానాడులో తీర్మానం

May 27 2021

అమరావతి: టీడీపీ మొదటి రోజు మహానాడు కార్యక్రమం ముగిసింది. టీడీపీ మహానాడులో తొలి రోజు 6 తీర్మానాలపై చర్చించారు. ‘స్టేట్ టెర్రరిజం’ అంటూ ఏపీలో పాలనపై మహానాడులో తీర్మానం చేశారు. పాలన అంటేనే కేసులు, అరెస్టులుగా మారిందంటూ నేతల విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు రెండోరోజు మహానాడు నిర్వహిస్తారు. టీడీపీ అధికారంలోకి వచ్చినా పూడ్చలేని స్థాయిలో.. రాష్ట్రానికి నష్టం జరిగిందని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ప్రజలు గమనించాలన్నారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది టీడీపేనని ఆ పార్టీ నేత అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు.

టీడీపీ మహానాడు గురువారం ఉదయం ప్రారంభమైంది. మా తెలుగుతల్లి గీతాలాపనతో కార్యక్రమం మొదలైంది. గత మహానాడు నుంచి ఈ మహానాడు వరకు అసువులు బాసిన తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలకు మహానాడు సంతాపం ప్రకటించింది.  సంతాప తీర్మానాన్ని గూడూరు ఎరిక్షన్ బాబు ప్రవేశపెట్టారు. రెండు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. 

Saturday, January 23, 2021

Poor Andhrapradesh - Aranyakrishna

 Poor Andhrapradesh - Aranyakrishna 

పాపం ఆంధ్ర ప్రదేశ్! 

గత పదేళ్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర చూస్తే ఇక్కడ ఏమాత్రం బలం లేని బాహ్య శక్తి ఒకటి "ఒత్తిడి రాజకీయాలు" ద్వారా రాష్ట్ర రాజకీయాల్ని అతలాకుతలం చేస్తున్నది.  ఫలితంగా తాజా పరిణామం ఏమిటంటే చివరికి జగన్ గారు కూడా ఆవు తోకని పట్టుకొని రాజకీయ గోదారి ఈదాల్సి వస్తున్నది.  కొన్ని వందలో వేలో దేవాలయాల్లో అదేదో గోపూజ నిర్వహించమని దేవాదాయ శాఖ ఉత్తరువులిచ్చిందట.  రాముడిని, ఆవుని, పెద్ద పెద్ద బొట్లని ఆధారం చేసుకున్న రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో కూడా సీరియస్ గా మొదలయ్యాయి.  ఏనాడూ మత రాజకీయాలకి తావులేని ఈ రాష్ట్రంలో "హిందువునోయీ!  నీ కంటే పెద్ద హిందువునోయీ" అని నిరూపించుకోవాల్సిన పరిస్తితి ఏర్పడింది.

రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్నంత కష్ట కాలంలో ఎప్పుడూ లేదు.  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా మూడు పార్టీలున్నాయి.   అవి వైసీపి, టీడీపి, బీజేపి.  జనసేనని నేనెప్పుడూ ఒక రాజకీయ పార్టీగానే గుర్తించలేదు.  బీజేపికి ఒక కుషన్ గా మాత్రమే పనిచేయాలనే ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో మరెవరి కోసమో ఏర్పరచబడ్డ పార్టీ అది.  (పార్టీ అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే "జనసేన" అనే పేరుతో ఎన్నికల సంఘంతో రిజిస్టర్ చేయబడింది కాబట్టి.)  ఆ రకంగా బీజేపిని ఆం.ప్ర.లో "ఒకటిన్నర పార్టీ"గా చెప్పుకోవచ్చు.  కానీ ఈ ఒకటిన్నర పార్టీ మిగతా రెండు సింగిల్ పార్టీల కంటే బలమైనది అని కానే కాదు.   ఏదో ఒక రోజు ఈ ఒకటిన్నర పార్టీ ఒకటే పార్టీగా మారిపోవటం ఖాయమని నాతో సహా మీ అందరికీ తెలిసిన విషయమే.  ఇంక కాంగ్రెస్!  రాష్ట్ర విభజన ద్వారా తమ ప్రయోజనాల్ని కాంగ్రెస్ దారుణంగా దెబ్బతెసిందని ఆంధ్రులంతా ముక్త కంఠంతో అనుకోవటం వల్లనే కాక, గతంలో కాంగ్రెస్ ని అధికార పథాన నడిపిన నాయకులు, కేడర్ దాదాపుగా మొత్తం ఇప్పుడు వైసీపిలోనే వున్న నేపథ్యంలోనూ కాంగ్రెస్ ని ఒక చరిత్రగానే చెప్పుకోవాలి. ఆ సమయంలో సోనియాగాంధి వల్లనే తెలంగాణ కల సాకారమైందని కేసీఆర్ అనటం కూడా కాంగ్రెస్ పట్ల ఏపీ ప్రజలు మరింత ఆగ్రహం చూపారు.  2014 ఎన్నికల్లో కాంగ్రెస్ మీద కసి తీర్చుకున్నారు.  మరింక వామపక్షాలేమో తమని తాము సగం ఉద్యమ పార్టీలుగా, సగం ఎన్నికల పార్టీలుగా తీర్చిదిద్దుకున్న నేపథ్యంలోనూ, ఎన్నికల సమయంలో ఏ బూర్జువా పార్టీ వైపుంటారో (ఖచ్చితంగా వుంటారు కూడా) ఊహించలేని కారణంగానూ వారిని ఒక నిర్ణాయక శక్తిగా భావించలేం.    ఈ కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా మూడంటే మూడే రాజకీయ పార్టీలున్నాయని చెప్పాల్సి వచ్చింది.  

పైన చెప్పుకున్న మూడు పార్టీల ఆర్ధిక విధానాల్లో ఏమాత్రం వ్యత్యాసం లేకున్నప్పటికీ - రెండింటికి మాత్రం ఆ పార్టీల ఆవిర్భావాలకి ఏదో ఒక సిద్ధాంతం మాత్రం వుంది.  బీజేపికి ఏ మతపరమైన లక్ష్యాలున్నాయో మనందరికీ తెలుసు.  ఇంక టీడీపి తెలుగువారి ఆత్మగౌరవ ప్రాతిపదికన ఏర్పడి, ఆ ప్రాతిపదిక ప్రజలచే ఆమోదించబడి సఫలమైన పార్టీ.  ఆవిర్భావ ప్రాతిపదికని తదనంతర కాలంలో పూర్తిగా విస్మరించింది టీడీపి.  తెలుగువారి ఆత్మగౌరవం అంటేనే స్థానిక సంస్కృతులకి, భాషలకి, జాతీయ పార్టీల వల్ల కలిగే హానిని గుర్తించటం.  ఆ విషయాన్ని విస్మరించి, అధికారంలోకి రావటం కోసం ఆ జాతీయ పార్టీలతోనే పొత్తులు పెట్టుకుంటూ ప్రస్తుతం గ్లోబలైజేషన్ని, ఉదారవాద ఆర్ధిక విధానాలకి పల్లకీ మోయటం, అధికారంలోకి రావటం తప్ప ప్రస్తుతం మరే ఇతర లక్ష్యాలేవీ లేని పార్టీ టీడీపి.  సాధారణంగా ప్రతి ప్రాంతీయ పార్టీకి ఒక సిద్ధాంతం, లక్ష్యం వుంటాయి. కానీ ఒక వ్యక్తి అధికారంలోకి రావటం మినహా మరే ఇతర సైద్ధాంతిక భూమిక లేదా లక్ష్యం లేని పార్టీ వైసీపి.  ఆయన కాంగ్రెస్లో వుండగా ముఖ్యమంత్రి అయ్యుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ పుట్టుండేదే కాదు.  ఆయన కాంగ్రెస్లో వుండగా ఆయనని ముఖ్యమంత్రిగా నియమించలేదు కాబట్టి తన కోసం, తన కొరకు, తనచే ఏర్పరచబడిన పార్టీ అది.  ఆ తరువాత కాంగ్రెస్ వల్ల భవిష్యత్తుని పోగొట్టుకున్న నాయకులు, టీడీపిలోని అసంతృప్త జీవులూ వైసీపితో కలిసి దానిని బలోపేతం చేసారు.  

"పిట్ట పోరు, పిట్ట పోరు పిల్లి తీర్చిన కథ"ని మనం "పంచతంత్రం"లో చదువుకున్నాం.  అదేంటంటే రెండు పిట్టలు ఒక రొట్టెముక్కని సమానంగా పంచుకోవటం దగ్గర తగాదా పడుతుంటే ఎక్కడి నుండో వచ్చిన ఒక పిల్లి వచ్చి ఒక రొట్టెని రెండు ముక్కలు సమానంగా చేస్తానని చెబుతూ - ఇటు కొద్దిగా ఎక్కువైంది, అటు కొద్దిగా తక్కువైందని అంటూ మొత్తం మీద రొట్టెనంతా తినేస్తుంది.  ఇప్పుడు రెండు పిట్టలు ఎవరో, ఆ పిల్లి ఎవరో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా.  ఆ పార్టీ గురించి కొంత చెప్పుకోవాలి.  దక్షిణాది ప్రజలు ఎంతైనా ద్రావిడ సంస్కృతికీ, సిద్ధాంతాలకీ దూరం కాలేరని ఉత్తర భారతంలో మతం పనిచేసినట్లు దక్షిణ భారతంలో పనిచేయదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మోడీ "నాయకత్వాన అభివృద్ధి" అనే మంత్రాన్ని 2014 ఎలక్షన్స్ వరకు ఉపయోగించారు. ఒక్క కేరళలో మాత్రం పైపై రంగుల అభివృద్ధి నమూనాని ఏమాత్రం అంగీకరించని రాజకీయ పరిపక్వత అక్కడి ప్రజలకు వున్నదని, అందువల్ల "వాటెవర్ ఇటీజ్ వర్త్" అనే ప్రాతిపదికన ఎలాంటి ముసుగుల్లేకుండా "ట్రూ కలర్స్"తోనే ఎప్పటిలా ప్రయత్నించి భంగపడ్డారు.  అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో "గుజరాత్ మోడల్"ని మత నమూనాగా కాక అభివృద్ధి నమూనాగా ముందుకు తెచ్చి ప్రచారం చేసుకున్నారు.  అప్పటిలో చాలామంది తటస్థవాదులు కూడా కాంగ్ర్రెస్ అవినీతికి విసిగిపోయి మోడీగారు గుజరాత్ ని అభివృద్ధి చేసారని, దేశం మొత్తం అలానే అభివృద్ధి చెందుతుందని అనుకున్నారు.   అయినప్పటికీ బీజేపికి ఆశించిన ప్రయోజనం లేకపోయింది. దానితో "గుజరాత్ మోడల్"ని మత రాజకీయ నమూనాగా మొన్నటి హైదరాబాద్ ఎన్నికల్లో "పైలట్ ప్రాజెక్టు"గా ప్రయోగించి అనుకున్నదానికంటే ఎక్కువగానే సఫలం అయ్యారు.  ఇప్పుడు అదే మత అగ్రీకరణ వాదాన్ని ఆంధ్రప్రదేశ్ కి కూడా విస్తరించారు.  ఇదెలా సాధ్యమైందనేది తెలుసుకోవాలంటే కొంచెం ముందు వెనుకలగానైనా గత ఆరేడేళ్ల రాజకీయ చరిత్రని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి.

****

2014 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టారు.  పుష్కలమైన ఆవేశం కలిగివుండి, ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ ఏదో మేథోమథనంలో వుంటాడనే ఇమేజితో, యువతని ఆకర్షించి, ప్రభావితం చేసే విధంగా చేగువేరా తరహా సాహస ఆదర్శాల్ని అవపోసన పట్టినవాడిగా తనకంటూ ఒక ఇమేజి సృష్టించుకున్న పీకే తాను సామాన్య, బడుగు, బలహీన ప్రజల తరపున ప్రశ్నించటానికే రాజకీయ పార్టీ పెట్టగానంటూ ముందుకు రావటంతో చాలామంది ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూశారు.  ఆయన పార్టీ ఆవిర్భావ సభలోనే కాంగ్రెస్ మీద నిప్పులు చెరిగాడు. కాంగ్రెస్ వి దేశ విచ్చిన్నకర రాజకీయాలని తేల్చిపారేశాడు.  "కాంగ్రెస్ హటావో - దేశ్ కీ బచావో" అంటూ ఊగిపోతూ నినాదాలు, పిలుపులూ ఇచ్చాడు. అప్పటికే ఆయన సోదరుడు చిరంజీవి కేంద్రమంత్రిగా వున్నారు.  కాంగ్రెస్ పట్ల వున్న తిరస్కార వాతావరణం వల్ల ఆయన రాజకీయ భవిష్యత్తు చరమాంకంకి వచ్చేసింది. తాను రాజకీయాల విషయంలో తన సోదరుడితో కూడా ఘర్షణ పడ్డానని, తాము ఒకరితో మాట్లాడుకోవటం లేదని కూడా పదే పదే పీకే ప్రకటించారు.  ఆ విధంగా "పార్టీని అమ్ముకున్న చిరంజీవి సోదరుడు" అనే సెట్ బాక్ నుండి బైటపడి తానొక ఇండివిడ్యువల్ అనే విశ్వసనీయత కోసం ప్రయత్నించారు.  "పబ్లిక్ మెమొరీ ఈజ్ షార్ట్" అనే సిద్ధాంతాన్ని బాగా నమ్మారేమో పార్టీ పెట్టాక "మా అన్నయ్యకి జరిగిన ద్రోహానికి ప్రతీకారం తీర్చుకుంటా" అని అన్నారు.  కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా ప్రజలు వోట్లు వేసి గెలిపిస్తే కేంద్రమంత్రి పదవి కోసం వారికే ధోకా ఇచ్చిన ఈయనకి ఎవరు ద్రోహం చేసారో మరి!  "కేంద్రంలో మోడీ అభివృద్ధి పాలనకి, రాష్ట్రంలో చంద్రబాబు అనుభవానికి మద్దతునిస్తునిస్తున్నా" అన్న ఆయన 2014 ఎన్నికల్లో పోటీ చేయకున్నా ప్రచారం అయితే నిర్వహించాడు.  ఆ సమయంలో ఆయన జగన్ అవినీతి, కేసులు అంటూ తీవ్రంగా దాడి చేసి, యువతలో జగన్ పట్ల వున్న సానుకూల వైఖరిని దెబ్బ కొట్టి వారి వోట్లని ఎన్.డీ.ఏ. వైపు చీల్చేందుకు దోహదం చేసారు.  ఆ విధంగా ఆయన మొదట జగన్ అవకాశాల్ని దెబ్బ కొట్టాడు.  ఆయన కానీ, ఆయన పార్టీ కానీ ఎక్కడా ఒక్క సీట్లో కూడా పోటీ చేయకపోయినా ఒక ఏక వ్యక్తి పార్టీగా ఎన్.డీ.ఏ.లో భాగస్వామి హోదాలో మోడీ ప్రమాణస్వీకారానికి హాజరయ్యాడు.  2014 ఎన్నికల్లో పోటీ చేయకుండానే రాజకీయం చేసిన ఆయన బీజేపీ అమ్ములపొదిలో వున్న అస్త్రం అని అర్ధం అవుతుంది.  2014 ఎన్నికల తరువాత సుమారు నాలుగు సంవత్సరాల పాటు మౌనంగా వున్నారాయన.  మధ్యలో ఒకసారి మాత్రం అమరావతి రైతుల నుండి అన్యాయంగా భూములు లాక్కుంటున్నారని, వారికి తన మద్దతు వున్నదని చిన్న హడావిడి చేసారు. 

ఢిల్లీని మించిన రాజధాని నిర్మాణంలో సహకరిస్తామని ప్రామిస్ చేసి పిడికెడు మట్టి, చెంబుడు నీళ్లు ఇచ్చి చేతులు దులుపుకున్నది కేంద్రం.  విభజన చట్టంలోని ఏ ఒక్క ఏర్పాటుకి పూర్తి స్థాయిలో సహకరించకుండా మొండి చేయి చూపించింది.  ముఖ్యమైన పరిపాలన భవంతుల్ని కట్టుకొని అమరావతి నుండే పాలన సాగిస్తున్న చంద్రబాబుకి ఏమాత్రం సహకరించని కేంద్ర యంత్రాంగాన్ని కానీ, మోడీని కానీ ప్రశ్నించటమే తన ఊపిరని పదేపదే పేర్కొన్న పీకే ఏనాడూ పల్లెత్తు మాట అనలేదు.  ఆ నాలుగేళ్ల కాలంలో తన మీద ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు.  ఎన్నికలకి ఒక సంవత్సరం ముందు మాత్రమే ఆయన నోరు విప్పాడు.  అది కూడా ప్రధానంగా తెలుగుదేశంకి వ్యతిరేకంగానే.  2014 ఎన్నికల్లో వైసీపికి వ్యతిరేకంగా చేసిన ప్రచారం కంటే 2019 ఎన్నికల్లో టీడీపికి వ్యతిరేకంగా ఎక్కువ ప్రచారం చేసారు.  2019లో రాష్ట్రంలో ఎలాగూ బీజేపి అధికారంలోకి వచ్చే ప్రశ్న లేదు కాబట్టి ఎవరికీ శాశ్వతంగా మద్దతు ఇవ్వకపోతే ఎవరూ బలపడరనే బీజేపి రాజకీయ వ్యూహానికి అనుగుణంగానే ఆయన పనిచేసారు.  ఆయన తక్షణ లక్ష్యం ఎన్నికల్లో గెలవటం కాదు.  "ఒక్క అవకాశం ఇవ్వండి" అని తన పాదయాత్ర ద్వారా దుమ్ము రేపుతూ బలపడిన జగన్ కి వున్న వ్యతిరేక వోటుని చీల్చటానికే పీకే ఉపయోగపడ్డారు.  2014 & 2019 ఎన్నికల సందర్భంగా తన వైఖరి కారణంగానే పీకేని ఒక "పొలిటికల్ పర్సన్"గా కాక "పొలిటికల్ హిట్ మాన్"గా గుర్తిస్తాను.  

ఆ ప్రాంతంలో రాజధాని నెలకొల్పటం కరెక్టే కానీ ఒక మహా నగర నిర్మాణం చేయటం అనేకరకాలుగా నష్టకరం.  రాజధాని అంటే  మౌలిక వసతులు కలిగివుండి, రాష్ట్రంలోని ప్రజలందరికీ అందుబాటులో వుంటే చాలు.  ముప్ఫై నలభై ఏళ్ల పాటు నిర్మాణం కొనసాగే అమరావతి అనే బడా ప్రాజెక్ట్ తనకి తిరుగులేని రాజకీయ బలం అవుతుందని చంద్రబాబు అనుకోవటం ఆయన దురాశ తత్వానికి చిహ్నం.  సంవత్సరానికి మూడు పంటలు పండే పచ్చని భూముల్ని రియల్ ఎస్టేట్లోకి దింపాడాయన.  అమరావతి తన బంగారు బాతు అనుకున్నాడాయన.  అమరావతి అనే ప్రపంచ స్థాయి నగర నిర్మాణం జరగాలంటే నిలకడైన రాజకీయ సుస్థిరత, కేంద్రం నుండి బలమైన మద్దతు సాధ్యమా అనే కనీస సెన్స్ ఆయనకి లేదు.  రియల్ ఎస్టేట్ అభివృద్ధే ప్రజల అభివృద్ధి అని ప్రచారం చేసుకోవటం దారుణం.  ఆయన అనుకున్నట్లుగా ఏదీ జరగలేదు సహజంగానే.  

చంద్రబాబు పాలనలో పోలవరం, అమరావతి నిర్మాణానికి బీజేపి సహాయ నిరాకరణ, "స్పెషల్ స్టేటస్ సాధ్యపడదని ఏం చేస్తారో చేసుకోండని చెప్పటం, హైదరాబాద్ ని పోగొట్టుకోవటం వల్ల ఆదాయ నష్ట నివారణ కోసం కొంత ఆర్ధిక స్వాంతన కలిగించే విధంగా నిధులు మంజూరు చేయకపోవటం, చంద్రబాబు బీజేపిని ఏమీ అనలేక ప్రతీసారి బాధని వ్యక్తం చేసే బలహీనతకి గురికావటం,  "ప్రత్యేక హోదా" బదులు ప్రత్యేక ఆర్ధిక పాకేజిని ప్రకటిస్తామని హామీ ఇచ్చి, తిరిగి అదీ నిలబెట్టుకోని బీజేపిని ఆయన నిలదీయలేని పరిస్తితిలో దానికీ తలొగ్గటం వైసీపికి కలిసి వచ్చింది.  అప్పుడు జగన్ గారు "ప్రత్యేక హోదా" కోసం విజృంభించి డిమాండ్ చేయటం మొదలెట్టడంతో బీజేపితో తెగతెంపులు చేసుకొని ప్రత్యేక హోదాని మరిచిపొమ్మన్న చంద్రబాబే ఢిల్లీలో దీక్షా శిబిరం నిర్వహించారు.  ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా గురించి ఎంతో అరచి, గగ్గోలు పెట్టిన వైసీపి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ ఊసే మర్చిపోయింది. గుర్తు చేసుకొని కూడా ప్రయోజనం లేదు.  కేంద్రంలో "దున్నపోతు మీద జడవాన"వంటి బ్రూట్ మెజారిటీ పవర్ వుందని జగన్ గారికి బాగా తెలుసు. ఎవరి బలహీనతలు వాళ్లకుంటాయని బీజేపీకి కూడా బాగా తెలుసు.  ఈ పరిణామాలన్నీ మనం గమనిస్తే  రాష్ట్రంలో తనకి ఏమాత్రం బలం లేనప్పటికీ కేవలం కేంద్రం వున్న అధికారాన్ని వాడుకొని ఏ పార్టీకి తన స్టాండ్ ని వుంచుకోనివ్వని ఒత్తిడిని బీజేపి సృష్టించిందని అర్ధం అవుతుంది.  

"విజయవాడ పరిసర ప్రాంతాలలోనే రాజధానిని ఏర్పాటు చేయటాన్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నానని, అప్పటికే 13 జిల్లాలతో చిన్న రాష్ట్రమైపోయిన ఆంధ్రప్రదేశ్ ని ప్రాంతాలవారీగా విడదీయటం తమకు ఇష్టం లేద"ని జగన్ నిండు అసెంబ్లీలో గట్టిగా అన్నప్పటికీ తాను అధికారంలోకి వచ్చాక అదే అమరావతి బీజేపి మళ్లీ కేంద్రంలో రావటంతో తనకో గుదిబండ కాగలదని గ్రహించిన జగన్ గారు మూడు రాజధానుల సిద్ధాంతాన్ని అమలు చేయటానికి పూనుకున్నారు.  (నా దృష్టిలో మూడు రాజధానులో పెద్ద మాయ.  ఈయన కూడా "రాజధాని చుట్టూ అభివృద్ధి" అనే స్కీముని ముందుకు తెచ్చాడు.  కాకుంటే మూడు రాజధానులట.  రాజధాని అంటే అభివృద్ధి చెందితే మూడేం ఖర్మ?  ముప్ఫై పెట్టొచ్చుగా! ) ఆ క్రమంలో ఆయన, ఆయన ప్రభుత్వంలోని మంత్రులు, ఆయన పత్రిక కుల, ప్రాంతీయ విభేదాల కుంపట్లు కూడా రాజేసారు. సాధారణంగా రెడ్లు కాంగ్రెస్ కి, కమ్మలు టీడీపీకి వత్తాసు ఇచ్చేవారే కానీ ఆంధ్రప్రదేశ్లో కులం ఇంతగా రాజకీయం కావటం అంతకు మునుపు ఎప్పుడూ జరగలేదు. ఇక్కడ దారుణంగా నష్టపోయింది అర ఎకరం నుండి ఆరెకరాల వరకు అమరావతి కోసం 34వేల ఎకరాలు పోగుచేసి పెట్టిన 29వేల మంది చిన్న సన్నకారు రైతులే.  ఇప్పుడు వారికి తిరిగి ప్లాట్ల పట్టాలే ఇవ్వగలరు కానీ ఆ భూమిని వ్యవసాయ యోగ్యం చేయటం సాధ్యం కాదు.  ఇది పైకి చూడటానికి వైసీపి-టీడీపి మధ్య వ్యవహారంలా కనిపిస్తుంది కానీ ఈ పరిణామానికి మూల సూత్రధారి మాత్రం బీజేపీనే.    ఇప్పటికే విజయవాడ-మంగళగిరి ప్రాంతంలో అసెంబ్లీ, హైకోర్ట్, డీజీపి ఆఫీస్ వంటివి ఏర్పాటు చేసినప్పటికీ అక్కడి నుండే పూర్తి స్థాయి పాలన చేయాలంటే  జగన్ కి అమరావతి తలనొప్పే.  అందుకే ఆయన అదే "రాజధాని చుట్టూ అభివృద్ధి" అనే మంత్రం జపిస్తూ తనకి అనుకూలమైన పరిస్తితులు వున్న చోటికి, అదే లాండ్ పూలింగ్ విధానంలో రాజధానిని వికేంద్రీకరిస్తున్నాడు.  రేపు చంద్రబాబో లేదా మరొకరో అధికారంలోకి వచ్చి విశాఖ, కర్నూలు నుండి మిగతా రాజధానుల్ని మళ్లీ అమరావతికి తరలిస్తామంటే మళ్లీ నష్టపోయేది భూములిచ్చిన సామాన్యులే.   ఎందుకంటే విశాఖలో కూడా లాండ్ పూలింగ్ జరుగుతుంది. ఇవి బాధ్యత లేని రాజకీయాలు.  కేంద్రంలో ప్రభుత్వమేమో రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోది అని తేల్చి చెప్పేస్తుంది.  రాష్స్ట్ర స్థాయిలోనేమో బీజేపీ అమరావతి పరిరక్షణకి కట్టుబడి వున్నానంటుంది.  మోడీ ఒప్పుకోరు, అమిత్ షా ఊరుకోడు అంటూ డబుల్ గేం ఆడుతుంది.  విగ్రహ ధ్వంసాల తరువాత అందరూ మత రాజకీయాలకి పాల్పడుతున్నారు కానీ అంతకుముందు మూడు ప్రధాన పార్టీలలో ఆర్ధిక విషయాల్లో ఒకటే పంథా అయినప్పటికీ బీజేపీది మత రాజకీయాలు కాగా, చంద్రబాబుగారివి పెట్టుబడిదారీ అవకాశవాద స్వార్ధ రాజకీయాలు కాగా, జగన్ గారివి తన కులం వారిని అందలం పైకి ఎక్కించటంతో పాటు ఓ పర్టిక్యులర్ కులాన్ని తొక్కేయాలనే కుల రాజకీయాలు, ద్వేష రాజకీయాలు.  ఆయన ద్వేష రాజకీయాల బాటన్ ని ఆయన నుండి అందుకున్న కొడాలి నాని, వల్లభనేని వంశీ, విజయసాయి రెడ్డి, బొత్స, అంబటి రాంబాబు వంటి వారి పరుషమైన, హేయమైన, అవమానకరమైన మాటల దాడుల్లో మరీ కనిపిస్తుంది.  తెలుగుదేశం వదిలి వైసీపిలోకి జంపైన ప్రతివాడూ "వెన్నుపోటు" రాజకీయాల గురించే మాట్లాడతాడు.  ఆ సోకాల్డ్ వెన్నుపోటు సంభవించిన ఇరవై ఏళ్ల తరువాత కూడా అదే పార్టీలో ఎందుకున్నాడో ఒక్కడూ చెప్పడు.  వాళ్లు ప్రజలకి తాము జవాబుదారీలం కాదనుకోవటం వల్లనే అలా మాట్లాడగలుగుతున్నారు.  మరో వైపు ప్రజా సంక్షేమం కోసం పరిపాలన చేయటమంటే సుస్థిర ఆదాయ వనరుల్ని ఏర్పాటు చేయగల ఉత్పాదక సంపద సృష్టికాక వేల కోట్ల రూపాయిల్ని అప్పులు తీసుకొచ్చి ప్రజలకి పంచటం చేస్తున్నారాయన.  ఎక్కడ వోటమి చెందుతానో అన్న భయానికి సరిగ్గా ఎన్నికల ముందు చంద్రబాబు కూడా ఏదో పసుపు కుంకుమ పథకం పేరుతో డబ్బులు పంచిపెట్టారు.  దాన్ని జగన్ మరో లెవెల్ కి తీసుకెళ్లారు.  ఇవి వోటు బాంక్ రాజకీయాలు కాక ప్రజానుకూలమైనవి ఎలా అవుతాయి?  ఇదీ ఆంధ్రప్రదేశ్ ప్రజల దారుణమైన దుస్థితి.   

ఇప్పుడు రాష్ట్రంలో రథాల దగ్దం, విగ్రహాల విధ్వంసంతో బీజేపీతో పాటు మిగతా రెండు ప్రధాన పార్టీలు కూడా మతాన్ని నెత్తికెత్తుకోవాల్సి వస్తున్నది. బీజేపీవాళ్లు సరే సరి, ఇప్పుడు చంద్రబాబు, జగన్ కూడా పెద్ద బొట్లు పెట్టుకొని హిందూత్వ ప్రతినిధులుగా, పరిరక్షకులుగా ముందుకొస్తున్నారు.  (బీజేపిని ఎదుర్కోవటానికి తెలంగాణలో కేసీఆర్ కూడా తానే అసలైన హిందువునని ప్రచారం చేసుకోవాల్సిన దుస్థితి,  కాకుంటే ఆయన పర మత విమర్శలకి, ద్వేషాలకి పాల్పడలేదు.  భవిష్యత్తు సంగతి తెలియదు.) అలా నెత్తికెత్తుకోకపోతే బీజేపీ బలపడిపోతుంది.  బీజేపిని నిలువరించటానికి లేదా బీజేపితో వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోడానికో ఎన్నడూ లేనిది చంద్రబాబు కూడా మైనారిటీ వ్యతిరేకిగా ముద్ర వేయించుకోటానికి సిద్ధమైపోయాడు.  మెజారిటేరియనిజం ఉచ్చులో చిక్కుకున్నారు. ఆయన ఎంత భయంకరంగా క్రైస్తవ ద్వేషాన్ని వెల్లడించాడు?   ఈ ప్రెజర్ పాలిటిక్స్ పరిస్తితికి ప్రధాన కారణం మాత్రం బీజేపీనే.   

ఎన్నికల్లో ఏదో ఒక బూర్జువా పార్టీ పల్లకీకి బోయీగా వామపక్షాలు మారనప్పుడే ప్రజల్ని హేతుబద్ధ రాజకీయాల వైపు ప్రజల్ని నడిపించగలవు.  వైసీపి, టీడీపిల బలహీనతల కంటే ఎన్నికల్లో ఒకట్రెండు సీట్లల్లో విజయాల కోసం వామపక్షాల ఆశ్రిత లక్షణమే అతి పెద్ద బలహీనత.  గ్లోబలైజేషన్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న రైట్ వింగ్ ఫోర్సెస్ మీదకి నెపాన్ని ఎంతగా తోసేసినా తమ బలహీనతల్ని నిజాయితీగా అంచనా వేసుకొని కార్యాచరణకి పూనుకునేంత వరకు ఈ ప్రజావ్యతిరేక రాజకీయాలు చచ్చిపోవు.  కాకుంటే కాలం గడుస్తున్న కొద్దీ ప్రజలు సెక్యులరిజం అనే పదాన్ని మరిచిపోయి, వామపక్షాల పరిస్తితి మరింత దయనీయమై,  పరిస్తితి "ఏ పాయింట్ ఆఫ్ నో రిటర్న్"కి వెళుతుందేమోనన్న సంశయం కూడా నాలో వుంది.

***

ఇంక అన్ని పార్టీల వారూ నన్ను బడితె పూజకి చేయటానికి సిద్ధం అయిపోండి మరి!  ఎందుకు ఆలస్యం? 🙂






Friday, January 22, 2021

ఎన్నికల విధులు నిర్వర్తించలేం NGO Association

 ఎన్నికల విధులు నిర్వర్తించలేం

Jan 23, 2021, 03:24 IST

Amravati Employees JAC And AP Govt Employees Federation Request to CS - Sakshi

బందరురోడ్డులోని సీఎస్‌ క్యాంపు కార్యాలయంలో సీఎస్‌కు వినతి పత్రాన్ని అందజేస్తున్న ఏపీజేఏసీ అమరావతి స్టేట్‌ టీం సభ్యులు


వ్యాక్సిన్‌ ఇచ్చే వరకు వాయిదా వేయాలి


ప్రతి ఉద్యోగికి రెండు డోసులు ఇచ్చాకే ఎన్నికలు జరపాలి


సీఎస్‌కు అమరావతి ఉద్యోగుల జేఏసీ, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య వినతి  


సాక్షి, అమరావతి: కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చేవరకు ఎన్నికల విధులు నిర్వహించలేమని అమరావతి ఉద్యోగుల జేఏసీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కి తెలిపాయి. వ్యాక్సిన్‌ ఇచ్చేవరకూ పంచాయతీ ఎన్నికలు తాత్కాలికంగా నిలుపుదల చేయాలని కోరాయి. ఈ మేరకు శుక్రవారం వేర్వేరుగా సీఎస్‌ను కలిసి వినతిపత్రాలు ఇచ్చాయి. జేఏసీ చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్, ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షుడు వైవీ రావు, కోశాధికారి, పంచాయతీరాజ్‌ ఇంజనీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.వి.మురళీకృష్ణనాయుడు, టీచర్ల సంఘాల జేఏసీ చైర్మన్‌ జి.వి.నారాయణరెడ్డి, పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు, కార్యదర్శి బి.కిషోర్‌కుమార్‌ తదితరులు సీఎస్‌ను కలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి అరవ పాల్, సమాఖ్య ప్రతినిధులు సీఎస్‌తో సమావేశమయ్యారు. 



ఉద్యోగులపై ఎందుకీ కాఠిన్యం?

అనంతరం బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఉద్యోగుల అభ్యంతరాలను తొమ్మిది పేజీల లేఖలో సీఎస్‌కు తెలిపామన్నారు. ప్రతి ఉద్యోగికి రెండు డోసుల వ్యాక్సిన్‌ అందేవరకు ఎన్నికలు నిర్వహించకుండా చూడాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ప్రభుత్వ అభ్యర్థనను, ఉద్యోగుల ఆందోళనను పెడచెవినపెట్టి ఎన్నికల నిర్వహణకు సిద్ధమవడం బాధాకరమని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ ఒకరోజులో పూర్తయ్యేది కాదని, కనీసం నెలరోజులపాటు నిత్యం ఉద్యోగులతో, ఓటర్లతో మమేకం కావాల్సి ఉంటుందని తెలిపారు. 1.40 లక్షల పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించాలని, బ్యాలెట్‌ బాక్సులు, సరంజామా తీసుకోవాలని, ఈ క్రమంలో ఎక్కడైనా కరోనా బారినపడే ముప్పు ఉందని చెప్పారు. ఉద్యోగుల పట్ల ఎన్నికల కమిషనర్‌ ఎందుకు ఇంత కఠినవైఖరితో ఉన్నారో తెలియడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సొంత కార్యాలయ ఉన్నతాధికారులను సైతం వదలకుండా జాయింట్‌ డైరెక్టర్‌ స్థాయి వ్యక్తిని తొలగించారని చెప్పారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం వ్యాక్సిన్‌ పంపిణీ, ఎన్నికల నిర్వహణ రెండు ఒకేసారి చేపట్టడం ఉద్యోగులకు ఎలా సాధ్యమనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 


కరోనా భయంతో ఎన్నికల విధులంటేనే హడలిపోతున్నాం

కరోనా మహమ్మారి ముప్పు ఇంకా ప్రబలంగా ఉన్న ప్రస్తుత తరుణంలో పంచాయతీ ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు ప్రభుత్వ ఉద్యోగుల్లో అత్యధికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి అరవ పాల్, సమాఖ్య ప్రతినిధులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కి ఇచ్చిన వినతిపత్రంలో తెలిపారు. కరోనా భయంతో ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు విముఖంగా ఉన్నవారిని ఎన్నికల విధులకు కేటాయించవద్దని, సుముఖంగా ఉన్న ఉద్యోగులను.. అదీ వారికి వ్యాక్సిన్లు వేసిన తరువాతే ఎన్నికల విధుల్లో నియమించాలని కోరారు. కరోనా వైరస్‌ మ్యుటేషన్‌ చెందుతూ తీవ్రరూపు దాలుస్తున్నందున ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల విధులకు హాజరైతే కరోనా బారినపడే ప్రమాదం ఉందని కలవరపడుతున్నట్టు పేర్కొన్నారు.  



ప్రాణాలు కాపాడుకునే రాజ్యాంగ హక్కు ఉద్యోగులకూ ఉంది

Jan 23, 2021, 03:39 IST

There is a constitutional right to defend the lives of employees - Sakshi

మీడియాతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ చైర్మన్‌ వెంకట్రామిరెడ్డి


రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి 


వ్యాక్సినేషన్‌ తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి 


ఎన్నికల కమిషనర్‌ ఉద్యోగుల ప్రాణాల గురించి ఆలోచించాలి


సాక్షి, అమరావతి: ‘ఎన్నికలు నిర్వహించే హక్కు రాజ్యాంగబద్ధంగా ఎన్నికల కమిషన్‌కు ఉన్నట్టే... తమ ప్రాణాలను కాపాడుకునే రాజ్యాంగబద్ధ హక్కు ఉద్యోగులకూ ఉంది. ఎన్నికలకు మేం వ్యతిరేకం కాదు. కానీ ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌ పూర్తి చేసిన తరువాతే ఎన్నికలు నిర్వహించాలి’ అని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం వెలగపూడిలోని సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ వ్యక్తిగత పంతానికి పోకుండా ఉద్యోగుల ప్రాణాల గురించి ఆలోచించాలని కోరారు. ‘రాష్ట్రంలో లక్ష మంది పోలీసులున్నారు. వారంతా రెండు డోసుల వ్యాక్సినేషన్‌ తీసుకోకుండా ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికల విధులకు హాజరవుతారా?’ అని ప్రశ్నించారు.



కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టాయని, అది పూర్తి కాకుండా ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. 2018లోనే స్థానిక సంస్థల కాలపరిమితి ముగిసినప్పటికీ అప్పుడు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదో చెప్పాలన్నారు. ఎన్నికలు నిర్వహించే రాజ్యాంగబద్ధమైన హక్కును ఎన్నికల కమిషనర్‌ నాడు ఎందుకు వినియోగించలేదని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని 2018 అక్టోబర్‌ 23న కోర్టు ఆదేశించినా పట్టించుకోలేదన్నారు. కరోనా వ్యాక్సినేషన్‌ జరుగుతున్నప్పుడే నిమ్మగడ్డకు రాజ్యాంగబద్ధ అధికారాలు గుర్తొచ్చాయా? అని ప్రశ్నించారు.


ఎన్నికల విధులంటే వేల మందిని కలవాలి.. 

ఎన్నికలు బహిష్కరిస్తామని తాము అనలేదని, ముందుగా ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తి చేశాకే ఎన్నికలు జరపాలని వెంకట్రామిరెడ్డి డిమాండ్‌ చేశారు. ‘రాజ్యాంగ నిర్మాతలు కరోనా లాంటి విపత్కర పరిస్థితులను ఊహించలేదు. ఎన్నికల కమిషనర్‌ తన విచక్షణాధికారాలను ఉపయోగించి ఉద్యోగుల ప్రాణాలు కాపాడేందుకు వ్యాక్సినేషన్‌ పూర్తి అయ్యేవరకు ఎన్నికలను వాయిదా వేయాలి’ అని కోరారు. కరోనా కారణంగా న్యాయస్థానాలు సైతం ఆన్‌లైన్‌ ద్వారానే వాదనలు వింటున్నాయని గుర్తు చేశారు. ఎన్నికల విధుల్లో వేలాదిమందిని కలవాల్సిన ఉద్యోగులకు కరోనా ముప్పు ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. ఈ అంశంపై సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశామని, తీర్పు ఎలా వచ్చినా ఉద్యోగుల అభిప్రాయం మాత్రం ఇదేనన్నారు. వ్యాక్సినేషన్‌ పూర్తి కాకుండా ఎన్నికల విధులకు హాజరు కావాలని ఉద్యోగులను ఒత్తిడి చేయొద్దని ఎన్నికల కమిషనర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరతామన్నారు. కరోనా వ్యాక్సినేషన్‌ పూర్తయ్యే వరకు ఎన్నికలు వాయిదా వేయాలని ప్రభుత్వం కోరుతోందని, తాము మాత్రం ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌ పూర్తి చేసిన తరువాత ఎన్నికలు నిర్వహించాలని అడుగుతున్నామని వివరించారు. 



కార్పొరేట్ల కోసమే వ్యవసాయ చట్టాలు - CPI

 కార్పొరేట్ల కోసమే వ్యవసాయ చట్టాలు

Jan 23 2021 @ 03:49AMహోంఆంధ్రప్రదే 


26న కలెక్టరేట్ల వద్ద ట్రాక్టర్‌ ర్యాలీలు: సీపీఐ

అందరూ కలసి శక్తిగా మారాలి: ఉండవల్లి

 రాజమహేంద్రవరంలో రైతు సంఘీభావ సదస్సు 


రాజమహేంద్రవరం, జనవరి 22(ఆంధ్రజ్యోతి): ‘‘కార్పొరేట్‌ సంస్థల కోసమే కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. వాటివల్ల వచ్చే ప్రమాదాన్ని పసిగట్టిన రైతులు పోరాడుతున్నారు. రైతు సంఘాలు, ప్రజా సంఘాలు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే విధంగా ఉద్యమం చేస్తున్నాయి. ఈ ఉద్యమం రాజకీయ పార్టీలను కూడా ప్రభావితం చేస్తోంది. ఇక. కేంద్రం దిగిరావాలి. వ్యవసాయ సాగు చట్టాలను పూర్తిగా రద్దు చేయాలి. రైతు ఉద్యమానికి సీపీఐ అండగా ఉంటుంది. ఈ నెల 26న జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద ట్రాక్టర్ల ర్యాలీలు నిర్వహించనున్నాం. మనిషన్న ప్రతీవాడు రైతు ఉద్యమానికి సంఘీభావమే కాదు. మద్దతిచ్చి ఉద్యమంలోకి రావాలి’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరంలోని ఆనంరోటరీ హాల్‌లో సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అధ్యక్షతన జరిగిన రైతు సంఘీభావ సదస్సులో మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణకుమార్‌, జీవీ హర్షకుమార్‌, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, సీపీఐ నేతలు పాల్గొన్నారు.  సెక్యులర్‌ పార్టీలైన టీడీపీ, వైసీపీ మతతత్వ పార్టీ అయిన బీజేపీకి ఎందుకు మద్దతిస్తున్నాయని రామకృష్ణ ప్రశ్నించారు. కార్పొరేట్ల చేతిలోకి వివిధ రంగాలు వెళితే, దేశం విచ్చిన్నమవుతుందని ఉండవల్లి అరుణ్‌కుమార్‌ హెచ్చరించారు. కార్పొరేట్లకు ఉపయోగపడే సాగు చట్టాలను కేంద్రం తీసుకుని రావడం వల్ల పెద్ద దళారీ వ్యవస్థ రాబోతుందని హర్షకుమార్‌ అన్నారు. 



ఎన్నికలు నిర్వహించలేం! CS of AP to SEC

ఎన్నికలు నిర్వహించలేం!

Jan 23 2021



ఏకకాలంలో వ్యాక్సినేషన్‌, ఎన్నికలు అసాధ్యం

మీరు తొలగించిన అధికారులు టీకా విధుల్లో బిజీ 

సుప్రీం ఆదేశాలు వచ్చేవరకూ ప్రక్రియను ఆపండి  

ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు సీఎస్‌ ఆదిత్యనాథ్‌ లేఖ

2 డోసులు వేసేవరకు ఆపాలి.. ఉద్యోగ నేతలు



అమరావతి, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాక్సినేషన్‌, స్థానిక సంస్థల ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించడం అసాధ్యమని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. వైద్య, ఆరోగ్యశాఖ, పోలీసుశాఖతో సహా ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది వంటి ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు మొదటి, రెండోదశ వ్యాక్సినేషన్‌ చేపట్టేందుకు 60రోజులు పడుతుందని, అప్పటి వరకూ ఎన్నికలు నిర్వహించడం వీలుకాదని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు స్పష్టం చేసింది. వాక్సినేషన్‌ను నిర్వహిస్తూనే, స్థానిక ఎన్నికలను సజావుగా పూర్తిచేయాలంటూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును విభేదిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించామని వెల్లడించింది. సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడే వరకూ ఎన్నికల ప్రక్రియపై ముందడుగు వేయవద్దని ఎస్‌ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ప్రస్తుత తరుణంలో ఎన్నికల నిర్వహణ సాధ్యంకాదని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు శుక్రవారం రాసిన మూడు పేజీల లేఖలో సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌ స్పష్టం చేశారు.




కనీసం ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు వ్యాక్సినేషన్‌ పూర్తిచేయకుండా ఎన్నికలు నిర్వహించలేమన్నారు. ఎన్నికలపై హైకోర్టు గురువారం తీర్పు వెలువరించిన మరుక్షణమే కోడ్‌ అమలులోకి వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. పాలనా విధానాలు పాటించకుండానే కొంతమంది అధికారులను తొలగిస్తూ ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకుందని, అయితే వారంతా ఇప్పటికే వ్యాక్సినేషన్‌ బాధ్యతల్లో బిజీగా ఉన్నారని ఆ లేఖలో సీఎస్‌ స్పష్టం చేశారు. కరోనా నివారణ కోసం వ్యాక్సినేషన్‌ చేపడుతూనే, స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిచేయాలని హైకోర్టు ఆదేశించిందని గుర్తుచేశారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించకముందే జిల్లా యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగంతో ఎస్‌ఈసీ సమావేశాన్ని నిర్వహించి ఎన్నికల సన్నాహకాల గురించి తెలుసుకోవడాన్ని సీఎస్‌ స్వాగతించారు. ఎస్‌ఈసీ పట్ల సీనియర్‌ అధికారులు అసభ్యకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై స్పందించిన సీఎస్‌.. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అంటే ప్రభుత్వానికి అత్యంత గౌరవం ఉందని వెల్లడించారు. జాతీయ స్థాయిలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమంపై జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఈ నెల 14న మార్గదర్శకాలను జారీ చేసిందని వివరించారు. తొలిదశ, రెండోదశ వ్యాక్సినేషన్‌ పూర్తిచేసేందుకు 60 రోజులు పడుతుందన్నారు.




ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకూ ఎన్నికల షెడ్యూల్‌ను వాయిదా వేసుకోవడమే మంచిదని సీఎస్‌ సూచించారు. వ్యాక్సినేషన్‌, ఎన్నికలూ రెండూ ఎలాంటి ఆటంకాలూ లేకుండా సుజావుగా పూర్తికావాల్సి ఉందన్నారు. అందువల్ల కొత్తగా స్థానిక సంస్థల షెడ్యూల్‌ను విడుదల చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాక్సినేషన్‌ను నిర్వహిస్తున్నామని, అందుకే సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను దాఖలు చేశామన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే వరకూ ఎన్నికల షెడ్యూల్‌ను వాయిదా వేయాలన్నారు.






 

SEC - JAGAN - HIGH COURT Controversy

 రాజ్యాంగ వ్యవస్థలపై రంకెలు!


Jan 23 2021 


ఎస్‌ఈసీపై సర్కారు ధిక్కారం

హైకోర్టు తీర్పునకు తిరస్కారం

కోర్టు ఆదేశించినా సహాయ నిరాకరణ

సుప్రీంకోర్టుకు వెళ్లామంటూ సాకులు

ఎన్నికలపై ఎస్‌ఈసీ ఆదేశాలే  అంతిమం

పట్టించుకునేందుకు సిద్ధంగా లేని ప్రభుత్వం

అధికారుల బదిలీ ఆదేశాలు అమలయ్యేనా?

నేడు తొలి విడత పోలింగ్‌కు నోటిఫికేషన్‌

కలెక్టర్లు తమ నోటీస్‌లు జారీ చేస్తారా?

ఎస్‌ఈసీని పట్టించుకోకుంటే జరిగేదేంటి?

రాజ్యాంగ సంక్షోభం, ప్రతిష్టంభన తప్పవా?



రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అంటే లెక్కలేదు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పునకే దిక్కులేదు. ‘మా  ఇష్టం. మేం చెప్పిందే జరగాలి’ అనే మొండితనమే తప్ప... రాజ్యాంగ వ్యవస్థలకు విలువే లేదు. ఇదీ... ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి. ఏది ఏమైనా పంచాయతీ ఎన్నికలు జరపాలని ఎస్‌ఈసీ! ఎట్టి పరిస్థితుల్లోనూ అందుకు సహకరించవద్దని సర్కారు పెద్దలు! ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సహకరించాలన్న హైకోర్టు ఆదేశాలనూ పట్టించుకోవడం లేదు. ‘సుప్రీంకోర్టుకు వెళ్లాం’ అనే నెపంతో ధిక్కారం ప్రదర్శిస్తున్నారు. ఇది ఏకకాలంలో రెండు రాజ్యాంగ వ్యవస్థలతో సర్కారు చేస్తున్న యుద్ధం! రాష్ట్ర చరిత్రలోనే కాదు... బహుశా దేశంలో ఎక్కడా, ఎప్పుడూ తలెత్తని సంక్షోభం!  ఇదే పరిస్థితి కొనసాగితే... ఏం జరుగుతుంది? రాజ్యాంగ సంక్షోభం తలెత్తుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం తెలియక న్యాయ నిపుణులు, విశ్లేషకులే తలలు పట్టుకుంటున్నారు.




(అమరావతి - ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో స్థానిక ఎన్నికల వాయిదాతో మొదలైన సమరం ఇప్పుడు తారస్థాయికి చేరుకుంది. ఎస్‌ఈసీతో రాష్ట్ర ప్రభుత్వం ‘ఢీ అంటే ఢీ’ అంటున్న సందర్భం తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఆవిష్కృతమవుతోంది. అదే సమయంలో... హైకోర్టు ఇచ్చిన తీర్పునూ గౌరవించకుండా సర్కారు తన ధిక్కార ధోరణి ప్రదర్శిస్తోంది. ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీతో సహకరించాలని హైకోర్టు ధర్మాసనం గురువారం స్పష్టమైన తీర్పు చెప్పింది. ‘టీకా, ఎన్నికలూ... రెండూ ముఖ్యమే. సమన్వయంతో రెండింటినీ విజయవంతం చేయండి’ అని స్వయంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. దీనిని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ‘మేం సుప్రీం కోర్టును ఆశ్రయించాం. అక్కడ తీర్పు ఎలా వస్తుందో చూసి... దానిని బట్టి సహకరిస్తాం’ అని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.




శుక్రవారం ఇదే వైఖరి కనబరిచారు. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ సుప్రీంకోర్టులో సోమవారం విచారణకు రానుంది. ఎస్‌ఈసీ కూడా కేవియట్‌ వేసినందున... తన వాదనలు కూడా వినాల్సిందే! ఈ విషయం ఒక్కరోజులో తేలవచ్చు, తేలకపోవచ్చు. ఆ సంగతి పక్కనపెడితే... సుప్రీం కోర్టులో ఎలాంటి నిర్ణయం రానంత వరకు, హైకోర్టు ఆదేశాలు అమలులో ఉన్నట్లే. దీని ప్రకారం ఎస్‌ఈసీకి అధికారులు సహకరించాల్సిందే. ఒకవేళ సుప్రీం కోర్టు ఆదేశాలు ప్రభుత్వానికి  అనుకూలంగా వస్తే... ఎన్నికలు ఆగిపోతాయి. అప్పటిదాకా, హైకోర్టు ఆదేశాలే అమలులో ఉంటాయి. ఈ విషయం స్పష్టంగా తెలిసినప్పటికీ... ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు. ‘సుప్రీం కోర్టులో ఏదో జరుగుతుంది’ అనే ఒక వూహాజనిత కారణంతో హైకోర్టు ఆదేశాలనూ తుంగలో తొక్కేయడం కనీవినీ ఎరుగని పరిణామనని న్యాయ నిపుణులు చెబుతున్నారు.




ఎస్‌ఈసీతో యుద్ధం 


కరోనా నేపథ్యంలో స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని ఇటీవల కేరళ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అదేం కుదరదని, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలో నిర్ణయించే అధికారం ఎస్‌ఈసీదే అని కోర్టు స్పష్టం చేసింది. దీంతో కేరళ సర్కారు ఎస్‌ఈసీకి సంపూర్ణంగా సహకరించింది. ఇప్పుడు... ఏపీలో ఆ పరిస్థితులు కనిపించడంలేదు. ఏదిఏమైనా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ హయాంలో ఎన్నికలు నిర్వహించరాదని సర్కారు భావిస్తోంది. దాదాపు 9 నెలలుగా ఎస్‌ఈసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ‘గొడవ’ నడుస్తోంది. ఎస్‌ఈసీ ఆదేశాలు, సూచనలేవీ ప్రభుత్వం పాటించలేదు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వ్యవహారం కోర్టుల్లో ఉన్నందున... ఎలాంటి వివాదాల్లేని పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఎస్‌ఈసీ భావించింది. కరోనా అని ఒకసారి, టీకా అని  మలిసారి... సర్కారు సహాయ నిరాకరణ చేస్తోంది. ఎన్నికల నిర్వహణకు హైకోర్టు ధర్మాసనం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. శుక్రవారం ఒకవైపు ఎస్‌ఈసీ రమేశ్‌ కుమార్‌ తన కార్యాలయంలో ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తుండగా... అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్‌ తాడేపల్లి క్యాంప్‌ ఆఫీసులో ‘ఎన్నికలను  ఆపడం ఎలా’ అనే ప్రతివ్యూహాలు సిద్ధం చేయడంలో నిమగ్నమయ్యారు.




 ‘ఆయన ఏం చెప్పినా వినొద్దు’ అనే సంకేతాలను అధికార యంత్రాంగానికి పంపించారు. ఈ క్రమంలో భేటీకి రావాలని పిలిచినా... పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య అధికారులు ఎస్‌ఈసీకి ముఖం చాటేశారు. ఇది ఎస్‌ఈసీతోపాటు, హైకోర్టునూ ధిక్కరించడమే అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. సర్కారు పెద్దల ‘మూడ్‌’ గమనించిన ఎస్‌ఈసీ... శుక్రవారం సాయంత్రం సంచలన నిర్ణయం తీసుకుంది. గత ఏడాది స్థానిక ఎన్నికల సమయంలో అధికారిక విధులు సక్రమంగా నిర్వహించడంలో విఫలమయ్యారంటూ... రెండు జిల్లాల కలెక్టర్లు, ఒక ఎస్పీసహా 9 మందిని ఎన్నికల విధుల నుంచి తప్పించారు. కానీ... ఈ ఆదేశాలను అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. ఎస్‌ఈసీ ఆదేశాలను సర్కారు బుట్ట దాఖలు చేస్తే ఏం చేయాలి? ఈ బదిలీలు అమలులో ఉన్నట్టా, లేనట్టా? రాజ్యాంగ వ్యవస్థను ధిక్కరిస్తే ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం లేదు. ఎందుకంటే... ఇలాంటి సందర్భం ఎప్పుడూ తలెత్తలేదు. ఈ క్రమంలోనే ఎస్‌ఈసీ రమేశ్‌ కుమార్‌ శుక్రవారం గవర్నర్‌ను కలిసి పరిస్థితి వివరించినట్లు తెలిసింది.



నోటిఫికేషన్‌ ఇచ్చినా...


హైకోర్టు ఆదేశించినప్పటికీ... ఎస్‌ఈసీతో కనీసం భేటీకి కూడా సర్కారు ఇష్టపడటంలేదు. అటు ఉద్యోగ సంఘాలూ ‘ఎన్నికలకు మేం సహకరించం’ అని తేల్చి చెబుతున్నాయి. అయినా సరే... ఎస్‌ఈసీ  తన పని తాను చేసుకుపోవాలనే భావిస్తున్నారు. దీని ప్రకారం... ఫిబ్రవరి 5వ తేదీన జరిగే తొలి విడత పోలింగ్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను శనివారం ఉదయం విడుదల చేయనున్నారు. దీని మేరకు సోమవారం (25వ తేదీ) ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్లు నోటీసులు జారీ చేయాలి. ఆ తర్వాతే రిటర్నింగ్‌ అధికారులు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ సుప్రీంకోర్టు ముందుకు సోమవారం ఉదయం 10.30 గంటల తర్వాతే వస్తుంది. అంటే... ఈలోపే కలెక్టర్లు నోటీసులు జారీ చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో... ఆ అవకాశం ఎంతమాత్రం కనిపించడంలేదు. సర్కారు పెద్దల నుంచి ఆ మేరకు స్పష్టమైన సంకేతాలు వెళ్లినట్లు తెలుస్తోంది. అప్పుడు పరిస్థితి ఏమిటి? హైకోర్టు తీర్పునకు, ఎస్‌ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్‌కు విలువలేకపోతే.. రాజ్యాగ సంక్షోభం తలెత్తదా? అటు... ఈ వివాదంలో గవర్నర్‌ కూడా మౌనం పాటిస్తున్నట్లు తెలుస్తోంది. అప్పుడు ఎస్‌ఈసీ ఏం చేస్తారు? మళ్లీ మళ్లీ కోర్టును ఆశ్రయించాల్సిందేనా? ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోని సర్కారు, ఇకముందైనా ఆ పని చేస్తుందా? అప్పటిదాకా... పరిస్థితి ఏమిటి? ఎస్‌ఈసీ జారీ చేసిన ఆదేశాలపై ప్రతిష్టంభన తప్పదా? ఇది రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తుందా? వేచి చూడాల్సిందే!




ఏర్పడింది ఇలా... 


గతంలో స్థానిక ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరిగేవి. ఈ ప్రక్రియను పంచాయతీరాజ్‌ కమిషనర్‌ నడిపించేవారు. అయితే... ఎన్నికల నిర్వహణ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడేది. ఉమ్మడి రాష్ట్రంలో ఒక సందర్భంలో పదేళ్లపాటు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపలేదు. పలు ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో... కేంద్ర ఎన్నికల కమిషన్‌ తరహాలో పూర్తి స్వయంప్రతిపత్తితో రాష్ట్రాల స్థాయిలో ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎస్‌ఈసీ విధులు, అధికారాలను రాజ్యాంగంలోని 243(కె) అధికరణలో పొందుపరిచారు. కేంద్రంలో ఈసీఐ ఎంతో... రాష్ట్రంలో ఎస్‌ఈసీ  అంతే! ఏపీలో 1994 సెప్టెంబరులో కాశీ పాండ్యన్‌ తొలి ఎస్‌ఈసీగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కాకి మాధవరావు, ఏవీఎస్‌ రెడ్డి, రమాకాంత్‌ రెడ్డి ఎస్‌ఈసీలుగా ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత... నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఎస్‌ఈసీగా నియమితులయ్యారు.