Friday, January 22, 2021

ఎన్నికల విధులు నిర్వర్తించలేం NGO Association

 ఎన్నికల విధులు నిర్వర్తించలేం

Jan 23, 2021, 03:24 IST

Amravati Employees JAC And AP Govt Employees Federation Request to CS - Sakshi

బందరురోడ్డులోని సీఎస్‌ క్యాంపు కార్యాలయంలో సీఎస్‌కు వినతి పత్రాన్ని అందజేస్తున్న ఏపీజేఏసీ అమరావతి స్టేట్‌ టీం సభ్యులు


వ్యాక్సిన్‌ ఇచ్చే వరకు వాయిదా వేయాలి


ప్రతి ఉద్యోగికి రెండు డోసులు ఇచ్చాకే ఎన్నికలు జరపాలి


సీఎస్‌కు అమరావతి ఉద్యోగుల జేఏసీ, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య వినతి  


సాక్షి, అమరావతి: కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చేవరకు ఎన్నికల విధులు నిర్వహించలేమని అమరావతి ఉద్యోగుల జేఏసీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కి తెలిపాయి. వ్యాక్సిన్‌ ఇచ్చేవరకూ పంచాయతీ ఎన్నికలు తాత్కాలికంగా నిలుపుదల చేయాలని కోరాయి. ఈ మేరకు శుక్రవారం వేర్వేరుగా సీఎస్‌ను కలిసి వినతిపత్రాలు ఇచ్చాయి. జేఏసీ చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్, ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షుడు వైవీ రావు, కోశాధికారి, పంచాయతీరాజ్‌ ఇంజనీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.వి.మురళీకృష్ణనాయుడు, టీచర్ల సంఘాల జేఏసీ చైర్మన్‌ జి.వి.నారాయణరెడ్డి, పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు, కార్యదర్శి బి.కిషోర్‌కుమార్‌ తదితరులు సీఎస్‌ను కలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి అరవ పాల్, సమాఖ్య ప్రతినిధులు సీఎస్‌తో సమావేశమయ్యారు. 



ఉద్యోగులపై ఎందుకీ కాఠిన్యం?

అనంతరం బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఉద్యోగుల అభ్యంతరాలను తొమ్మిది పేజీల లేఖలో సీఎస్‌కు తెలిపామన్నారు. ప్రతి ఉద్యోగికి రెండు డోసుల వ్యాక్సిన్‌ అందేవరకు ఎన్నికలు నిర్వహించకుండా చూడాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ప్రభుత్వ అభ్యర్థనను, ఉద్యోగుల ఆందోళనను పెడచెవినపెట్టి ఎన్నికల నిర్వహణకు సిద్ధమవడం బాధాకరమని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ ఒకరోజులో పూర్తయ్యేది కాదని, కనీసం నెలరోజులపాటు నిత్యం ఉద్యోగులతో, ఓటర్లతో మమేకం కావాల్సి ఉంటుందని తెలిపారు. 1.40 లక్షల పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించాలని, బ్యాలెట్‌ బాక్సులు, సరంజామా తీసుకోవాలని, ఈ క్రమంలో ఎక్కడైనా కరోనా బారినపడే ముప్పు ఉందని చెప్పారు. ఉద్యోగుల పట్ల ఎన్నికల కమిషనర్‌ ఎందుకు ఇంత కఠినవైఖరితో ఉన్నారో తెలియడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సొంత కార్యాలయ ఉన్నతాధికారులను సైతం వదలకుండా జాయింట్‌ డైరెక్టర్‌ స్థాయి వ్యక్తిని తొలగించారని చెప్పారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం వ్యాక్సిన్‌ పంపిణీ, ఎన్నికల నిర్వహణ రెండు ఒకేసారి చేపట్టడం ఉద్యోగులకు ఎలా సాధ్యమనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 


కరోనా భయంతో ఎన్నికల విధులంటేనే హడలిపోతున్నాం

కరోనా మహమ్మారి ముప్పు ఇంకా ప్రబలంగా ఉన్న ప్రస్తుత తరుణంలో పంచాయతీ ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు ప్రభుత్వ ఉద్యోగుల్లో అత్యధికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి అరవ పాల్, సమాఖ్య ప్రతినిధులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కి ఇచ్చిన వినతిపత్రంలో తెలిపారు. కరోనా భయంతో ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు విముఖంగా ఉన్నవారిని ఎన్నికల విధులకు కేటాయించవద్దని, సుముఖంగా ఉన్న ఉద్యోగులను.. అదీ వారికి వ్యాక్సిన్లు వేసిన తరువాతే ఎన్నికల విధుల్లో నియమించాలని కోరారు. కరోనా వైరస్‌ మ్యుటేషన్‌ చెందుతూ తీవ్రరూపు దాలుస్తున్నందున ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల విధులకు హాజరైతే కరోనా బారినపడే ప్రమాదం ఉందని కలవరపడుతున్నట్టు పేర్కొన్నారు.  



ప్రాణాలు కాపాడుకునే రాజ్యాంగ హక్కు ఉద్యోగులకూ ఉంది

Jan 23, 2021, 03:39 IST

There is a constitutional right to defend the lives of employees - Sakshi

మీడియాతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ చైర్మన్‌ వెంకట్రామిరెడ్డి


రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి 


వ్యాక్సినేషన్‌ తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి 


ఎన్నికల కమిషనర్‌ ఉద్యోగుల ప్రాణాల గురించి ఆలోచించాలి


సాక్షి, అమరావతి: ‘ఎన్నికలు నిర్వహించే హక్కు రాజ్యాంగబద్ధంగా ఎన్నికల కమిషన్‌కు ఉన్నట్టే... తమ ప్రాణాలను కాపాడుకునే రాజ్యాంగబద్ధ హక్కు ఉద్యోగులకూ ఉంది. ఎన్నికలకు మేం వ్యతిరేకం కాదు. కానీ ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌ పూర్తి చేసిన తరువాతే ఎన్నికలు నిర్వహించాలి’ అని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం వెలగపూడిలోని సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ వ్యక్తిగత పంతానికి పోకుండా ఉద్యోగుల ప్రాణాల గురించి ఆలోచించాలని కోరారు. ‘రాష్ట్రంలో లక్ష మంది పోలీసులున్నారు. వారంతా రెండు డోసుల వ్యాక్సినేషన్‌ తీసుకోకుండా ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికల విధులకు హాజరవుతారా?’ అని ప్రశ్నించారు.



కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టాయని, అది పూర్తి కాకుండా ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. 2018లోనే స్థానిక సంస్థల కాలపరిమితి ముగిసినప్పటికీ అప్పుడు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదో చెప్పాలన్నారు. ఎన్నికలు నిర్వహించే రాజ్యాంగబద్ధమైన హక్కును ఎన్నికల కమిషనర్‌ నాడు ఎందుకు వినియోగించలేదని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని 2018 అక్టోబర్‌ 23న కోర్టు ఆదేశించినా పట్టించుకోలేదన్నారు. కరోనా వ్యాక్సినేషన్‌ జరుగుతున్నప్పుడే నిమ్మగడ్డకు రాజ్యాంగబద్ధ అధికారాలు గుర్తొచ్చాయా? అని ప్రశ్నించారు.


ఎన్నికల విధులంటే వేల మందిని కలవాలి.. 

ఎన్నికలు బహిష్కరిస్తామని తాము అనలేదని, ముందుగా ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తి చేశాకే ఎన్నికలు జరపాలని వెంకట్రామిరెడ్డి డిమాండ్‌ చేశారు. ‘రాజ్యాంగ నిర్మాతలు కరోనా లాంటి విపత్కర పరిస్థితులను ఊహించలేదు. ఎన్నికల కమిషనర్‌ తన విచక్షణాధికారాలను ఉపయోగించి ఉద్యోగుల ప్రాణాలు కాపాడేందుకు వ్యాక్సినేషన్‌ పూర్తి అయ్యేవరకు ఎన్నికలను వాయిదా వేయాలి’ అని కోరారు. కరోనా కారణంగా న్యాయస్థానాలు సైతం ఆన్‌లైన్‌ ద్వారానే వాదనలు వింటున్నాయని గుర్తు చేశారు. ఎన్నికల విధుల్లో వేలాదిమందిని కలవాల్సిన ఉద్యోగులకు కరోనా ముప్పు ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. ఈ అంశంపై సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశామని, తీర్పు ఎలా వచ్చినా ఉద్యోగుల అభిప్రాయం మాత్రం ఇదేనన్నారు. వ్యాక్సినేషన్‌ పూర్తి కాకుండా ఎన్నికల విధులకు హాజరు కావాలని ఉద్యోగులను ఒత్తిడి చేయొద్దని ఎన్నికల కమిషనర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరతామన్నారు. కరోనా వ్యాక్సినేషన్‌ పూర్తయ్యే వరకు ఎన్నికలు వాయిదా వేయాలని ప్రభుత్వం కోరుతోందని, తాము మాత్రం ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌ పూర్తి చేసిన తరువాత ఎన్నికలు నిర్వహించాలని అడుగుతున్నామని వివరించారు. 



No comments:

Post a Comment