రాజ్యాంగ వ్యవస్థలపై రంకెలు!
Jan 23 2021
ఎస్‌ఈసీపై సర్కారు ధిక్కారం
హైకోర్టు తీర్పునకు తిరస్కారం
కోర్టు ఆదేశించినా సహాయ నిరాకరణ
సుప్రీంకోర్టుకు వెళ్లామంటూ సాకులు
ఎన్నికలపై ఎస్‌ఈసీ ఆదేశాలే అంతిమం
పట్టించుకునేందుకు సిద్ధంగా లేని ప్రభుత్వం
అధికారుల బదిలీ ఆదేశాలు అమలయ్యేనా?
నేడు తొలి విడత పోలింగ్‌కు నోటిఫికేషన్
కలెక్టర్లు తమ నోటీస్‌లు జారీ చేస్తారా?
ఎస్‌ఈసీని పట్టించుకోకుంటే జరిగేదేంటి?
రాజ్యాంగ సంక్షోభం, ప్రతిష్టంభన తప్పవా?
రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ అంటే లెక్కలేదు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పునకే దిక్కులేదు. ‘మా ఇష్టం. మేం చెప్పిందే జరగాలి’ అనే మొండితనమే తప్ప... రాజ్యాంగ వ్యవస్థలకు విలువే లేదు. ఇదీ... ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి. ఏది ఏమైనా పంచాయతీ ఎన్నికలు జరపాలని ఎస్‌ఈసీ! ఎట్టి పరిస్థితుల్లోనూ అందుకు సహకరించవద్దని సర్కారు పెద్దలు! ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సహకరించాలన్న హైకోర్టు ఆదేశాలనూ పట్టించుకోవడం లేదు. ‘సుప్రీంకోర్టుకు వెళ్లాం’ అనే నెపంతో ధిక్కారం ప్రదర్శిస్తున్నారు. ఇది ఏకకాలంలో రెండు రాజ్యాంగ వ్యవస్థలతో సర్కారు చేస్తున్న యుద్ధం! రాష్ట్ర చరిత్రలోనే కాదు... బహుశా దేశంలో ఎక్కడా, ఎప్పుడూ తలెత్తని సంక్షోభం! ఇదే పరిస్థితి కొనసాగితే... ఏం జరుగుతుంది? రాజ్యాంగ సంక్షోభం తలెత్తుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం తెలియక న్యాయ నిపుణులు, విశ్లేషకులే తలలు పట్టుకుంటున్నారు.
(అమరావతి - ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో స్థానిక ఎన్నికల వాయిదాతో మొదలైన సమరం ఇప్పుడు తారస్థాయికి చేరుకుంది. ఎస్‌ఈసీతో రాష్ట్ర ప్రభుత్వం ‘ఢీ అంటే ఢీ’ అంటున్న సందర్భం తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఆవిష్కృతమవుతోంది. అదే సమయంలో... హైకోర్టు ఇచ్చిన తీర్పునూ గౌరవించకుండా సర్కారు తన ధిక్కార ధోరణి ప్రదర్శిస్తోంది. ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీతో సహకరించాలని హైకోర్టు ధర్మాసనం గురువారం స్పష్టమైన తీర్పు చెప్పింది. ‘టీకా, ఎన్నికలూ... రెండూ ముఖ్యమే. సమన్వయంతో రెండింటినీ విజయవంతం చేయండి’ అని స్వయంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. దీనిని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ‘మేం సుప్రీం కోర్టును ఆశ్రయించాం. అక్కడ తీర్పు ఎలా వస్తుందో చూసి... దానిని బట్టి సహకరిస్తాం’ అని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.
శుక్రవారం ఇదే వైఖరి కనబరిచారు. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో సోమవారం విచారణకు రానుంది. ఎస్‌ఈసీ కూడా కేవియట్ వేసినందున... తన వాదనలు కూడా వినాల్సిందే! ఈ విషయం ఒక్కరోజులో తేలవచ్చు, తేలకపోవచ్చు. ఆ సంగతి పక్కనపెడితే... సుప్రీం కోర్టులో ఎలాంటి నిర్ణయం రానంత వరకు, హైకోర్టు ఆదేశాలు అమలులో ఉన్నట్లే. దీని ప్రకారం ఎస్‌ఈసీకి అధికారులు సహకరించాల్సిందే. ఒకవేళ సుప్రీం కోర్టు ఆదేశాలు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే... ఎన్నికలు ఆగిపోతాయి. అప్పటిదాకా, హైకోర్టు ఆదేశాలే అమలులో ఉంటాయి. ఈ విషయం స్పష్టంగా తెలిసినప్పటికీ... ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు. ‘సుప్రీం కోర్టులో ఏదో జరుగుతుంది’ అనే ఒక వూహాజనిత కారణంతో హైకోర్టు ఆదేశాలనూ తుంగలో తొక్కేయడం కనీవినీ ఎరుగని పరిణామనని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
ఎస్‌ఈసీతో యుద్ధం
కరోనా నేపథ్యంలో స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని ఇటీవల కేరళ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అదేం కుదరదని, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలో నిర్ణయించే అధికారం ఎస్‌ఈసీదే అని కోర్టు స్పష్టం చేసింది. దీంతో కేరళ సర్కారు ఎస్‌ఈసీకి సంపూర్ణంగా సహకరించింది. ఇప్పుడు... ఏపీలో ఆ పరిస్థితులు కనిపించడంలేదు. ఏదిఏమైనా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హయాంలో ఎన్నికలు నిర్వహించరాదని సర్కారు భావిస్తోంది. దాదాపు 9 నెలలుగా ఎస్‌ఈసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ‘గొడవ’ నడుస్తోంది. ఎస్‌ఈసీ ఆదేశాలు, సూచనలేవీ ప్రభుత్వం పాటించలేదు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వ్యవహారం కోర్టుల్లో ఉన్నందున... ఎలాంటి వివాదాల్లేని పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఎస్‌ఈసీ భావించింది. కరోనా అని ఒకసారి, టీకా అని మలిసారి... సర్కారు సహాయ నిరాకరణ చేస్తోంది. ఎన్నికల నిర్వహణకు హైకోర్టు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. శుక్రవారం ఒకవైపు ఎస్‌ఈసీ రమేశ్ కుమార్ తన కార్యాలయంలో ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తుండగా... అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ‘ఎన్నికలను ఆపడం ఎలా’ అనే ప్రతివ్యూహాలు సిద్ధం చేయడంలో నిమగ్నమయ్యారు.
‘ఆయన ఏం చెప్పినా వినొద్దు’ అనే సంకేతాలను అధికార యంత్రాంగానికి పంపించారు. ఈ క్రమంలో భేటీకి రావాలని పిలిచినా... పంచాయతీరాజ్ శాఖ ముఖ్య అధికారులు ఎస్‌ఈసీకి ముఖం చాటేశారు. ఇది ఎస్‌ఈసీతోపాటు, హైకోర్టునూ ధిక్కరించడమే అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. సర్కారు పెద్దల ‘మూడ్’ గమనించిన ఎస్‌ఈసీ... శుక్రవారం సాయంత్రం సంచలన నిర్ణయం తీసుకుంది. గత ఏడాది స్థానిక ఎన్నికల సమయంలో అధికారిక విధులు సక్రమంగా నిర్వహించడంలో విఫలమయ్యారంటూ... రెండు జిల్లాల కలెక్టర్లు, ఒక ఎస్పీసహా 9 మందిని ఎన్నికల విధుల నుంచి తప్పించారు. కానీ... ఈ ఆదేశాలను అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. ఎస్‌ఈసీ ఆదేశాలను సర్కారు బుట్ట దాఖలు చేస్తే ఏం చేయాలి? ఈ బదిలీలు అమలులో ఉన్నట్టా, లేనట్టా? రాజ్యాంగ వ్యవస్థను ధిక్కరిస్తే ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం లేదు. ఎందుకంటే... ఇలాంటి సందర్భం ఎప్పుడూ తలెత్తలేదు. ఈ క్రమంలోనే ఎస్‌ఈసీ రమేశ్ కుమార్ శుక్రవారం గవర్నర్‌ను కలిసి పరిస్థితి వివరించినట్లు తెలిసింది.
నోటిఫికేషన్ ఇచ్చినా...
హైకోర్టు ఆదేశించినప్పటికీ... ఎస్‌ఈసీతో కనీసం భేటీకి కూడా సర్కారు ఇష్టపడటంలేదు. అటు ఉద్యోగ సంఘాలూ ‘ఎన్నికలకు మేం సహకరించం’ అని తేల్చి చెబుతున్నాయి. అయినా సరే... ఎస్‌ఈసీ తన పని తాను చేసుకుపోవాలనే భావిస్తున్నారు. దీని ప్రకారం... ఫిబ్రవరి 5వ తేదీన జరిగే తొలి విడత పోలింగ్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను శనివారం ఉదయం విడుదల చేయనున్నారు. దీని మేరకు సోమవారం (25వ తేదీ) ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్లు నోటీసులు జారీ చేయాలి. ఆ తర్వాతే రిటర్నింగ్ అధికారులు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు ముందుకు సోమవారం ఉదయం 10.30 గంటల తర్వాతే వస్తుంది. అంటే... ఈలోపే కలెక్టర్లు నోటీసులు జారీ చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో... ఆ అవకాశం ఎంతమాత్రం కనిపించడంలేదు. సర్కారు పెద్దల నుంచి ఆ మేరకు స్పష్టమైన సంకేతాలు వెళ్లినట్లు తెలుస్తోంది. అప్పుడు పరిస్థితి ఏమిటి? హైకోర్టు తీర్పునకు, ఎస్‌ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్‌కు విలువలేకపోతే.. రాజ్యాగ సంక్షోభం తలెత్తదా? అటు... ఈ వివాదంలో గవర్నర్ కూడా మౌనం పాటిస్తున్నట్లు తెలుస్తోంది. అప్పుడు ఎస్‌ఈసీ ఏం చేస్తారు? మళ్లీ మళ్లీ కోర్టును ఆశ్రయించాల్సిందేనా? ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోని సర్కారు, ఇకముందైనా ఆ పని చేస్తుందా? అప్పటిదాకా... పరిస్థితి ఏమిటి? ఎస్‌ఈసీ జారీ చేసిన ఆదేశాలపై ప్రతిష్టంభన తప్పదా? ఇది రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తుందా? వేచి చూడాల్సిందే!
ఏర్పడింది ఇలా...
గతంలో స్థానిక ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరిగేవి. ఈ ప్రక్రియను పంచాయతీరాజ్ కమిషనర్ నడిపించేవారు. అయితే... ఎన్నికల నిర్వహణ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడేది. ఉమ్మడి రాష్ట్రంలో ఒక సందర్భంలో పదేళ్లపాటు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపలేదు. పలు ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో... కేంద్ర ఎన్నికల కమిషన్ తరహాలో పూర్తి స్వయంప్రతిపత్తితో రాష్ట్రాల స్థాయిలో ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎస్‌ఈసీ విధులు, అధికారాలను రాజ్యాంగంలోని 243(కె) అధికరణలో పొందుపరిచారు. కేంద్రంలో ఈసీఐ ఎంతో... రాష్ట్రంలో ఎస్‌ఈసీ అంతే! ఏపీలో 1994 సెప్టెంబరులో కాశీ పాండ్యన్ తొలి ఎస్‌ఈసీగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కాకి మాధవరావు, ఏవీఎస్ రెడ్డి, రమాకాంత్ రెడ్డి ఎస్‌ఈసీలుగా ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత... నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎస్‌ఈసీగా నియమితులయ్యారు.
No comments:
Post a Comment