Friday, January 22, 2021

ఎన్నికలు నిర్వహించలేం! CS of AP to SEC

ఎన్నికలు నిర్వహించలేం!

Jan 23 2021



ఏకకాలంలో వ్యాక్సినేషన్‌, ఎన్నికలు అసాధ్యం

మీరు తొలగించిన అధికారులు టీకా విధుల్లో బిజీ 

సుప్రీం ఆదేశాలు వచ్చేవరకూ ప్రక్రియను ఆపండి  

ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు సీఎస్‌ ఆదిత్యనాథ్‌ లేఖ

2 డోసులు వేసేవరకు ఆపాలి.. ఉద్యోగ నేతలు



అమరావతి, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాక్సినేషన్‌, స్థానిక సంస్థల ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించడం అసాధ్యమని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. వైద్య, ఆరోగ్యశాఖ, పోలీసుశాఖతో సహా ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది వంటి ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు మొదటి, రెండోదశ వ్యాక్సినేషన్‌ చేపట్టేందుకు 60రోజులు పడుతుందని, అప్పటి వరకూ ఎన్నికలు నిర్వహించడం వీలుకాదని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు స్పష్టం చేసింది. వాక్సినేషన్‌ను నిర్వహిస్తూనే, స్థానిక ఎన్నికలను సజావుగా పూర్తిచేయాలంటూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును విభేదిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించామని వెల్లడించింది. సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడే వరకూ ఎన్నికల ప్రక్రియపై ముందడుగు వేయవద్దని ఎస్‌ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ప్రస్తుత తరుణంలో ఎన్నికల నిర్వహణ సాధ్యంకాదని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు శుక్రవారం రాసిన మూడు పేజీల లేఖలో సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌ స్పష్టం చేశారు.




కనీసం ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు వ్యాక్సినేషన్‌ పూర్తిచేయకుండా ఎన్నికలు నిర్వహించలేమన్నారు. ఎన్నికలపై హైకోర్టు గురువారం తీర్పు వెలువరించిన మరుక్షణమే కోడ్‌ అమలులోకి వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. పాలనా విధానాలు పాటించకుండానే కొంతమంది అధికారులను తొలగిస్తూ ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకుందని, అయితే వారంతా ఇప్పటికే వ్యాక్సినేషన్‌ బాధ్యతల్లో బిజీగా ఉన్నారని ఆ లేఖలో సీఎస్‌ స్పష్టం చేశారు. కరోనా నివారణ కోసం వ్యాక్సినేషన్‌ చేపడుతూనే, స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిచేయాలని హైకోర్టు ఆదేశించిందని గుర్తుచేశారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించకముందే జిల్లా యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగంతో ఎస్‌ఈసీ సమావేశాన్ని నిర్వహించి ఎన్నికల సన్నాహకాల గురించి తెలుసుకోవడాన్ని సీఎస్‌ స్వాగతించారు. ఎస్‌ఈసీ పట్ల సీనియర్‌ అధికారులు అసభ్యకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై స్పందించిన సీఎస్‌.. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అంటే ప్రభుత్వానికి అత్యంత గౌరవం ఉందని వెల్లడించారు. జాతీయ స్థాయిలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమంపై జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఈ నెల 14న మార్గదర్శకాలను జారీ చేసిందని వివరించారు. తొలిదశ, రెండోదశ వ్యాక్సినేషన్‌ పూర్తిచేసేందుకు 60 రోజులు పడుతుందన్నారు.




ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకూ ఎన్నికల షెడ్యూల్‌ను వాయిదా వేసుకోవడమే మంచిదని సీఎస్‌ సూచించారు. వ్యాక్సినేషన్‌, ఎన్నికలూ రెండూ ఎలాంటి ఆటంకాలూ లేకుండా సుజావుగా పూర్తికావాల్సి ఉందన్నారు. అందువల్ల కొత్తగా స్థానిక సంస్థల షెడ్యూల్‌ను విడుదల చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాక్సినేషన్‌ను నిర్వహిస్తున్నామని, అందుకే సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను దాఖలు చేశామన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే వరకూ ఎన్నికల షెడ్యూల్‌ను వాయిదా వేయాలన్నారు.






 

No comments:

Post a Comment