Thursday, January 20, 2022

PRC issue

 

శక్తికి మించి చేశాం..

Perni Nani Comments about Government employees  - Sakshi

సమాచార శాఖ మంత్రి పేర్ని నాని  

జీతాలు తగ్గితే ప్రభుత్వంపై జీతాల భారం ఎందుకు పెరిగింది? 

వాస్తవ పరిస్థితులను ఉద్యోగులు గమనించాలి.. ఉద్యోగుల పట్ల సీఎం జగన్‌కు ఎంతో ప్రేమ

అందుకే సీఎం అయిన వారం లోపే 27 శాతం ఐఆర్‌  

కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, హోంగార్డులు, ఎంఎన్‌ఓల జీతాల పెంపు

కోవిడ్‌ వల్ల ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారాయి 

అయినప్పటికీ ప్రభుత్వం ఎన్నో సానుకూల నిర్ణయాలు తీసుకుంది 

ఇవన్నీ గమనించకుండా భ్రమలు కల్పిస్తూ వక్రీకరణలు తగవు 

నేతల పనులతో ఉద్యోగుల భవిష్యత్‌కు ఇబ్బంది కలిగే పరిస్థితి  

ఉద్యోగులు ఎప్పుడైనా చర్చలకు ముందుకు రావొచ్చు  

సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేయాలన్న తపనతో ముందుకు వెళుతున్న ప్రభుత్వమిదని, భావోద్వేగ పరిస్థితుల్లో కాకుండా వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలని ఉద్యోగులను కోరుతున్నామని సమాచార, పౌర సంబ«ంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ప్రేమ, సానుభూతి ఉంది కాబట్టే అధికారంలోకి వచ్చిన వారంలోనే 27% మధ్యంతర భృతి (ఐఆర్‌) ప్రకటించారని చెప్పారు. ఆనాడు నిజానికి ఉద్యోగులు కూడా అడగలేదన్న విషయం వాస్తవమా కాదా అన్నది నిండు మనసుతో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులకు శక్తికి మంచి చేశామని, పరిస్థితి అర్థం చేసుకోవాలని కోరారు.

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. కోవిడ్‌ వల్ల ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారాయని తెలిపారు. ఆదాయాలు పూర్తిగా పడిపోయాయని, వ్యయం పెరిగిందని చెప్పారు. అందువల్ల కొంత మంది వక్రీకరణలను గమనించి, సానుభూతితో ఆలోచించాలని కోరుతున్నామన్నారు. ఉద్యోగులు ఎప్పుడైనా చర్చలకు ముందుకు రావొచ్చని, అందుకు ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. నాడు ఉద్యోగులను వేధించిన వారు ఇవాళ నీతులు చెబుతూ మేకతోలు, ఆవుతోలు కప్పుకున్న తోడేళ్లలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వారి ట్రాప్‌లో ఉద్యోగులు పడకూడదని, ఇది ముమ్మాటికీ మీ ప్రభుత్వం అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రి ఇంకా ఏం చెప్పారంటే..

ఉద్యోగులు మనసు పెట్టి ఆలోచించాలి 
► సీఎంగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఉద్యోగులను ప్రభుత్వం కన్నబిడ్డల్లా చూసుకుంటోంది. ఉద్యోగులు ఆశించిన మేరకు వేతన సవరణ చేయలేక పోవడానికి గత్యంతరం లేని ఆర్థిక పరిస్థితులే కారణం. ఉద్యోగుల భావోద్వేగాలను గోతి కాడ నక్కల్లా సొమ్ము చేసుకోవాలని కొందరు చూస్తున్నారు. 
► కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ ఇవ్వడం, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు మేలు చేసే విధంగా ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అనుమానాలు నివృత్తి చేస్తాం.

ఆదాయం దారుణంగా తగ్గింది 
► వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యే నాటికి, అంటే 2018 –19లో ప్రభుత్వ సొంత ఆదాయం రూ.62,473 కోట్లు. ఏడాది తర్వాత 2019–20లో ప్రభుత్వ ఆదాయం రూ.60,933 కోట్లు. నిజానికి అప్పుడు రూ.71,844 కోట్లు ఆదాయం రావాల్సి ఉండింది. దాదాపు రూ.2 వేల కోట్ల ఆదాయం తగ్గింది.
► 2020–21లో ప్రభుత్వ ఆదాయం రూ.82,620 కోట్లుగా అంచనా వేస్తే, రూ.60,688 కోట్లు మాత్రమే వచ్చింది. కోవిడ్‌ వల్ల దాదాపు రూ.21 వేల కోట్ల ఆదాయం కోల్పోయాం. కోవిడ్‌ వల్ల ప్రజలను కాపాడుకోవడం కోసం రూ.30 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో వ్యాపారాలు సాగలేదు. దీంతో ఒకవైపు ఆదాయం తగ్గగా, మరో వైపు ఖర్చులు పెరిగాయి. మరో వైపు కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు సక్రమంగా రాలేదు. జీఎస్టీ, ఆదాయం పన్ను పూర్తిగా రాలేదు. 
► 2018–19లో కేంద్రం నుంచి మనకు రూ.32,722 కోట్లు రాగా, 2019–20లో రూ.28,221 కోట్లకు, ఆ తర్వాత ఏడాది 2020–21లో రూ.24,441 కోట్లకు అది తగ్గిపోయింది. ఉద్యోగుల జీతభత్యాల కింద ఇప్పుడు రూ.60,177 కోట్లు చెల్లిస్తుండగా, కొత్త పీఆర్సీ అమలు చేస్తే రూ.70,424 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అయినా ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడడం లేదు.
► పరిస్థితులు ఈ విధంగా ఉన్నప్పుడు ఉద్యోగులు అర్థం చేసుకోవాలి. ఉద్యోగుల కోర్కెలన్నీ తీర్చలేనందుకు సీఎం జగన్‌ కూడా బాధ పడుతున్నారు. సీపీఎస్‌ రద్దు కోసం గతంలో ఉద్యోగులు ఆందోళన చేస్తే, చంద్రబాబు వారిపై కేసులు పెట్టి అరెస్టు చేయించారు.
► ఉద్యోగులపై కేసులను సీఎం జగన్‌ 2020 జూలై 30న జీఓ నెం.731 ద్వారా ఎత్తివేయడం వాస్తవం కాదా? నాడు కేసులు పెట్టిన వారు ఇవాళ ఉద్యోగుల గురించి మొసలి కన్నీరు కారుస్తున్నారు. యూపీ, గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వమే ఉంది. అక్కడ హెచ్‌ఆర్‌ఏ ఎలా ఇస్తున్నారు? బీజేపీ నేతలు తెలుసుకొని మాట్లాడాలి.   

ఐఆర్‌పై వక్రీకరణలు తగునా?
► ఐఆర్‌ అంటే మధ్యంతర భృతి. ఒక ఉద్యోగికి ప్రభుత్వం మధ్యంతరంగా ఇచ్చే డబ్బు అని అర్థం. పీఆర్సీ ఇవ్వాలి కాబట్టి, ఆలోగా ఈ డబ్బును తీసుకోండి అని ప్రభుత్వం ఇస్తుంది. తర్వాత ఈ డబ్బు పీఆర్సీ సర్దుబాటుకు లోబడే ఉంటుంది. గతంలో ఎప్పుడు ఐఆర్‌ ఇచ్చినా, తర్వాత ప్రకటించిన పీఆర్సీని పరిగణలోకి తీసుకుని సర్దుబాటు చేసి, జీతాలను ఖరారు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో నైనా ఇదే విధానాన్ని మొదట నుంచి అనుసరిస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా అంతే. 
► ఈ విషయం ఉద్యోగ సంఘాల నాయకులకు తెలిసీ కూడా ఐఆర్‌ను జీతంలో భాగంగా పరిగణిస్తూ వక్రీకరణ చేస్తున్నారు. ఉద్యోగులను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేస్తున్నారు. వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ఏర్పాటైన వారం రోజుల్లోనే ఎవరూ అడక్కపోయినా 27 శాతం ఐఆర్‌ ప్రకటించారు. 
► 7,55,075 మంది ఉద్యోగులకు ఐఆర్‌ కింద రూ.17,918 కోట్లు ఈ ప్రభుత్వం చెల్లించిన మాట వాస్తవం కాదా? హెచ్‌ఆర్‌ఏ అన్నది జీతభత్యాల్లో ఒక అంశం కాదా? హెచ్‌ఆర్‌ఏ అన్నది మనకు అందుతున్న గ్రాస్‌ శాలరీలో ఒక సబ్‌ కాంపొనెంట్‌. ఇదే హెచ్‌ఆర్‌ఏను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైన రైల్వే, కేంద్రీయ విద్యాలయాల టీచర్లు, ఆల్‌ఇండియా ఆఫీసర్స్, పోస్టల్‌ ఉద్యోగులకూ ఇస్తున్నది వాస్తవం కాదా?

వీరికి జీతాలు పెంచిన మాట వాస్తవం కాదా?
► అంగన్‌వాడీ కార్యకర్తల జీతం 2018కు ముందు ఉన్న రూ.7 వేల నుంచి రూ.11,500కు పెంచలేదా?
► మినీ అంగన్‌వాడీల జీతం రూ.4,500 నుంచి రూ.7 వేలు చేయ లేదా?
► వీఓఏ, సంఘమిత్రలు, యానిమేటర్స్‌ జీతాలు రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచలేదా?
► శానిటరీ వర్కర్ల జీతాలు రూ.8 వేల నుంచి 18 వేలకు పెంచలేదా?
► శానిటరీ సూపర్‌ వైజర్ల జీతాలను రూ.12 వేల నుంచి రూ.18 వేలకు పెంచలేదా?
► ఆశా వర్కర్ల జీతాలు 2018కు ముందు రూ.3వేల –6వేలు ఉంటే, వాటిని రూ.10 వేలకు పెంచ లేదా?
► ఎంఎన్‌ఓ జీతాలను రూ.6,700 నుంచి రూ.17,746కు పెంచలేదా?
► కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్ల జీతాలను రూ.400 నుంచి రూ.4 వేలకు పెంచ లేదా?
► హోంగార్డుల డైలీ డ్యూటీ అలవెన్స్‌లను రూ.600 నుంచి రూ.710కి పెంచ లేదా?
► కుక్‌ కం హెల్పర్ల జీతాలను రూ.1,000 నుంచి రూ.3 వేలకు పెంచలేదా?
► కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు గతంలో ఏటా జీతాల రూపంలో రూ.1100 కోట్ల చెల్లింపులు ఉంటే, ఇప్పుడు ఏడాదికి చెల్లిస్తున్నది సుమారు రూ.3 వేల కోట్లు.  ఇది మేలు కాదా?
► ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయ లేదా? ఇవన్నీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయాలు కాదా?

ఇవన్నీ నిజాలు కావా?
► ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంపు. దీనివల్ల రెండేళ్ల సర్వీసు పెరగడంతోపాటు 24 నెలల జీతం అదనంగా లభిస్తుంది. ఇది ఉద్యోగులకు లాభం కాదా? 
► నెలకు రూ.1 లక్ష జీతం అందుకునే ఉద్యోగికి రెండేళ్ల కాలంలో రూ.24 లక్షలు జీతం రూపేణా వస్తాయి. దీనివల్ల ఆయా ఉద్యోగుల కుటుంబాలకు మేలు చేసినట్టు కదా?
► రెండేళ్ల అదనపు సర్వీసుతో పాటు ఆ సమయంలో 4 డీఏలు, 2 ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి. ఇది వారికి మేలు చేసినట్టు కాదా? 
► సర్వీసు పెరగడం వల్ల పెన్షన్‌ రూపేణా ప్రభుత్వం నుంచి వాటా పెరుగుతుంది. దీనివల్ల రిటైర్మెంట్‌ తర్వాత వారికి పెన్షన్‌ పెరగదా? 
► దేశంలో ఎన్నిచోట్ల 62 సంవత్సరాల పదవీ విరమణ వయస్సు ఉంది?
► సర్వీసు కాలానికి గ్రాట్యుటీ కింద ఇదివరకు ప్రభుత్వం ఇచ్చేది రూ.12 లక్షలు. ఇప్పుడు దాన్ని ఈ ప్రభుత్వం రూ.16 లక్షలకు పెంచడం మేలు చేసే నిర్ణయం కాదా? 
► ఏ ఉద్యోగి అడగకపోయినా ఇళ్లు లేని ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తున్నది మేలు చేయడం కాదా? ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న స్మార్ట్‌ టౌన్‌ షిప్స్‌లో 10% స్థలాలను ప్రభుత్వ ఉద్యోగులకు రిజర్వ్‌ చేసిన మాట వాస్తవం కాదా? ఈ స్థలాలను 20 శాతం రిబేటుతో ఇవ్వాలన్నది మేలు చేసేది కాదా? దీనివల్ల నేరుగా రూ.10 లక్షల వరకు లబ్ధి కలగడం లభించదా?
► కోవిడ్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి జూన్‌ 30లోగా నియామకాలు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేయడం వాస్తవం కాదా?
► ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవల్లో భాగంగా ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 1.28 లక్షల మందిని శాశ్వత ఉద్యోగులుగా నియమించింది. ఈ ఉద్యోగులకు మేలు చేసేలా రెండున్నరేళ్లకే రెగ్యులరైజ్‌ చేస్తోంది. 2022 జూన్‌ 30తో వీరి ప్రొబేషన్‌ ముగుస్తోంది. జూలై 1 నుంచి రెగ్యులర్‌ స్కేలు అమల్లోకి వస్తోంది. దీనివల్ల వారికి గణనీయంగా జీతాలు పెరుగుతున్న మాట నిజం కాదా?
► కాంట్రాక్టు ఉద్యోగులకూ మినిమం టైం స్కేలు వర్తింపు చేసిన ఏకైక ప్రభుత్వం ఇది కాదా? ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను దళారీల బారి నుంచి బయట పడేయలేదా? వారికి కత్తిరింపులు లేకుండా, లంచాలకు తావివ్వకుండా పూర్తి జీతాలు అందించడం లేదా? వీరందరికీ ఈపీఎఫ్, ఈఎస్‌ఐ లాంటి సౌకర్యాలను కల్పించడం వాస్తవం కాదా? వీరికి కూడా 23 శాతం ఫిట్‌మెంట్‌ వర్తింప చేయడం మేలు చేసే నిర్ణయం కాదా? ఇలాంటి పనులు గత ప్రభుత్వాలు ఎప్పుడైనా చేశాయా?
► కేంద్ర ప్రభుత్వ కమిటీ చేసిన సిఫార్సు 14.29 శాతమే. కాని ఈ ప్రభుత్వం ఇంతటి పరిస్థితుల్లో కూడా 23 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చిన మాట నిజం కాదా? ఐఆర్‌ రూపంలో రూ.17,918 కోట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? పీఆర్సీ వల్ల ఏడాదికి రూ.10,247 కోట్ల అదనపు భారం ప్రభుత్వ ఖజానాపై పడుతున్న విషయం వాస్తవం కాదా?
► 2018–19లో రాష్ట్ర సొంత ఆదాయం రూ.62,503 కోట్లు అయితే, ఉద్యోగులకు చెల్లించిన జీతాలు రూ.52,513 కోట్లు. అంటే 84 శాతం జీతాల రూపంలో చెల్లించారనే విషయాన్ని గమనించాలి.  
► 2020–21లో రాష్ట్ర సొంత ఆదాయం రూ.60,688 కోట్లు అయితే, ఉద్యోగులకు చెల్లించిన జీతాలు రూ.67,340 కోట్లు. 111% జీతాల రూపంలో చెల్లించడం నిజం కాదా?

జీతాలు ఎలా తగ్గుతాయి?
► మొత్తంగా గ్రాస్‌ శాలరీ పెరిగిందా? లేదా? అన్నది చూసుకోవాలి.  
► ఉద్యోగులకు ఇప్పటి వరకు జీతాల రూపంలో ఏటా చెల్లింపులు రూ.60,177 కోట్లు అయితే, కొత్త పీఆర్సీ ద్వారా ఇకపై రూ.70,424 కోట్లు  చెల్లింపులు ఉంటాయి. తద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఏటా భారం రూ.10,247 కోట్లు పడుతుంది. ఈ పరిస్థితిలో జీతాలు తగ్గుతాయన్న వాదనకు ఆస్కారం ఎక్కడిది?
► ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగ సంఘాల నాయకులు వాస్తవాలు చెప్పి ఉద్యోగులను మంచి దిశగా జాగృతం చేయాల్సింది పోయి వక్రీకరణలు చేయడం సబబేనా? ఉద్యోగులను పెడదోవ పట్టించడం న్యాయమేనా?
► ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు లాంటి వారి చేతిలో నాయకులు కీలు బొమ్మలు కావడం తగునా? వారికి అమ్ముడుపోయి వక్రీకరణలు చేయడం సరైనదేనా? ప్రభుత్వం ఇంత మేలు చేస్తున్నా, మేలు జరగనట్టుగా భ్రమలు కల్పించి వక్రీకరణలతో ఉద్యోగులను రెచ్చగొట్టడం కరెక్టేనా?
► ఇవాళ ఉద్యోగ సంఘాల నాయకులు చేస్తున్న పనులు ఉద్యోగుల భవిష్యత్తుకు భంగకరంగా మారదా? భవిష్యత్తులో ఏ ప్రభుత్వమైనా ఐఆర్‌ ఇవ్వడానికి ముందుకు వస్తుందా? ఉద్యోగులకు సానుకూలంగా ఉండే నిర్ణయాలు తీసుకునేలా ఉండాల్సిన పరిస్థితులను ధ్వంసం చేస్తే, దెబ్బతినేది ఉద్యోగులు కాదా? ఈ విషయాలను అందరూ గమనించాలి.  

No comments:

Post a Comment