New Districts In AP: ఉగాది నాటికి ఏపీలో కొత్త జిల్లాలు
Jan 25, 2022, 02:24 IST
New districts by Ugadi Festival In Andhra Pradesh - Sakshi
నేడో, రేపో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం
తెలుగు సంవత్సరాదిలోపు పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తికి కసరత్తు
కొత్తగా మరో 13 జిల్లాల ఏర్పాటు
దీంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాలు 26కు..
ఇక ప్రతీ లోక్‌సభ నియోజకవర్గం ఓ జిల్లా
ఒక్క అరకు పార్లమెంటు నియోజకవర్గమే 2 జిల్లాలుగా..
అత్యంత శాస్త్రీయంగా కొత్త జిల్లాలపై అధ్యయనం
కొత్త జిల్లాల్లో కలెక్టరేట్లు, ఎస్పీ ఇతర జిల్లా కార్యాలయాలూ ఎక్కడ ఏర్పాటు చేయాలో గుర్తింపు
సాక్షి, అమరావతి: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త జిల్లాలను అతిత్వరలో ఏర్పాటుచేయనుంది. దీనికి సంబంధించి నేడో రేపో నోటిఫికేషన్‌ను జారీచేయనుంది. ఉగాదిలోపు పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తిచేసి కొత్త జిల్లాలను అమల్లోకి తెచ్చేలా ప్రభుత్వం కసరత్తు పూర్తిచేసినట్లు సమాచారం. పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటుచేస్తామని ఎన్నికలకు ముందు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన మేనిఫెస్టోలో పొందుపరిచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై సుదీర్ఘ కసరత్తు జరిపారు. ఈలోపు 2021 జనాభా గణన ముందుకురావడంతో పునర్వ్యవస్థీకరణ ఆలస్యమైంది. కానీ, కరోనా నేపథ్యంలో జనాభా గణన ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో అది మొదలయ్యేలోపు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
కొత్తగా మరో 13 జిల్లాలు
రాష్ట్రంలో 25 లోక్‌సభ నియోజకవర్గాలుండగా.. ఇప్పుడున్న 13 జిల్లాలకు అదనంగా మరో 13 జిల్లాలు ఏర్పడనున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 26కు పెరగనుంది. పార్లమెంటు స్థానాన్ని ఒక నియోజకవర్గంగా చేయాలనుకున్నా అరకు లోక్‌సభ నియోజకవర్గం భౌగోళికంగా సుదీర్ఘంగా విస్తరించి ఉండడంతో దాన్ని రెండు జిల్లాలుగా చేయాలని గతంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కమిటీ ప్రతిపాదనలు తయారుచేసింది. ఆ మేరకు అరకు నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగా చేసే అవకాశాలున్నాయి. అంటే కొత్తగా రెండు గిరిజన జిల్లాలు ఏర్పడనున్నాయి. ఇవికాక.. అక్కడక్కడా భౌగోళిక పరిస్థితుల ఆధారంగా చిన్నచిన్న మార్పులు, చేర్పులు ఉండనున్నాయి. మొత్తంగా ప్రతి లోక్‌సభ నియోజకవర్గం ఒక కొత్త జిల్లాగా అవతరించనుంది. అలాగే, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం ఏదో ఒక జిల్లాలో ఉండేలా ప్రతిపాదనలు సిద్ధంచేశారు.
శాస్త్రీయంగా జిల్లాల పునర్వ్యస్థీకరణ ప్రక్రియ
జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియపై ప్రభుత్వం అత్యంత శాస్త్రీయంగా అధ్యయనం చేసింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన అధ్యయన కమిటీని నియమించింది. వివిధ అంశాలపై పలు శాఖల అధికారులతో నాలుగు సబ్ కమిటీలను, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటుచేసింది. ఈ కమిటీల్లోని అధికారులు పలుమార్లు సమావేశమై జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఎలా ఉండాలి? సరిహద్దుల నిర్ధారణకు ప్రాతిపదికగా తీసుకోవాల్సిన అంశాలేవి? దీనివల్ల ఎదురయ్యే సాంకేతిక సమస్యల పరిష్కారానికి ఏ విధానం పాటించాలి? వంటి అనేక అంశాలపై కూలంకుషంగా చర్చించి మార్గదర్శకాలు రూపొందించారు. వీటిపై విస్తృత అధ్యయనం తర్వాత 26 జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధంచేశారు. రవాణా, ఆర్ అండ్ బీ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ కొత్త జిల్లాల్లో అవసరమైన మౌలిక వసతులు, కలెక్టరేట్లు, ఎస్పీ ఇతర జిల్లా కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటుచేయాలో గుర్తించింది. ఇక కొత్త జిల్లాల ఏర్పాటువల్ల అయ్యే వ్యయాన్ని ఇతర అంశాలపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ నివేదిక ఇచ్చింది.
తొలుత ప్రాథమిక నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్య్వస్థీకరణ చట్టం ప్రకారం కొత్త జిల్లాల ఏర్పాటు కోసం రెవెన్యూ శాఖ ముందుగా ప్రాథమిక నోటిఫికేషన్‌ను జారీచేస్తుంది. దీనిపై సూచనలు, సలహాల కోసం 30 రోజుల గడువు ఇస్తారు. వచ్చిన సూచనలన్నింటినీ పరిశీలించి అవసరమైతే కొన్ని మార్పులు, చేర్పులు చేస్తారు. ఆ తర్వాత తుది నోటిఫికేషన్ ఇస్తారు. తుది నోటిఫికేషన్‌లోనే కొత్త జిల్లాలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో తెలుపుతూ అపాయింటెడ్ తేదీని పేర్కొంటారు. ఆ తేదీ నుంచి కొత్త జిల్లాలు ఏర్పడినట్లే. ఈలోపే కొత్తగా ఏర్పడిన జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర జిల్లా స్థాయి అధికారులను నియమిస్తారు. ఈ ప్రక్రియనంతటినీ ఉగాదిలోపు పూర్తిచేసి కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం సమాయమత్తమవుతోంది.
No comments:
Post a Comment