Thursday, January 27, 2022

రాష్ట్రంలో 26 కొత్త జిల్లాలు.. 62 రెవెన్యూ డివిజన్లు.

 పత్రికా ప్రకటన

విజయవాడ, 

తేది : 27-01-2022.

పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు

రాష్ట్రంలో 26 కొత్త జిల్లాలు.. 62 రెవెన్యూ డివిజన్లు.

గిరిజనుల అభివృద్ది కోసం రెండు గిరిజన జిల్లాలు

అసెంబ్లీ నియోజకవర్గాన్ని విడదీయకుండా కొత్త జిల్లాలు ఏర్పాటు.

విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లా ఒంగోలు.. చిన్నజిల్లా విశాఖపట్నం.. 

వివరాలను వెల్లడించిన ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌ కుమార్‌ జి. ఎస్ఆర్ కెఆర్

కొత్త జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగానే జరిగిందని.. భౌగోళిక విస్తీర్ణం, జనసాంద్రత, సాంఘిక, సంస్కృతి ప్రకారం జిల్లాలను విభజించామని ఏపీ ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌ తెలిపారు.  కొత్త జిల్లాల ఏర్పాటుపై లోతైన అధ్యయనం జరిగిందని,  పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లాల సరిహద్దులు ఎలా ఉండాలనే దానిపై అధ్యయనం చేసినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనల మేరకే గిరిజనాభివృద్దిలో భాగంగా రెండు గిరిజన జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.  కొత్త జిల్లాల ఏర్పాటుపై విజయవాడ ఎం.జీ. రోడ్డులోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ కార్యాలయంలో విజయ్‌ కుమార్‌ గురువారం మీడియా ప్రతినిధులకు వివరాలను తెలిపారు. 

ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాల స్వరూపం ఏ విధంగా ఉండాలనే అంశంపై భారీ కసరత్తు చేశామన్నారు.  పార్లమెంట్‌ నియోజకవర్గాల ప్రకారం 25 జిల్లాలు కాకుండా భౌగోళిక పరిస్థితుల ఆధారంగా 26 జిల్లాలు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించామన్నారు. విభజన ప్రక్రియలో జిల్లా కేంద్రాలు, భౌగోళిక, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలు అన్నీ పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. ప్రజలు, ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు లేకుండా జిల్లాకు కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు ఉండేలా, అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం ఒకే జిల్లాలో ఉండేలా చూశామని తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాన్ని విడదీయకుండా జిల్లాల ఏర్పాటు, జిల్లా కేంద్రాలు అందరికీ దగ్గరుండేలా చూసుకున్నామన్నారు. రాష్ట్రంలో గిరిజన ప్రాంతం విస్తృత పరిధి ఎక్కువ అని.. విస్తృతంగా ఉన్న గిరిజన ప్రాంతానికి ఒక జిల్లా ఉంటే ఇబ్బందులు ఉంటాయని, గిరిజనుల అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనల ప్రకారం రెండు జిల్లాలుగా ఏర్పాటు చేశామన్నారు. మన్యం ప్రాంతాల్లో ప్రజల అభివృద్ధి కోసం రెండు జిల్లాలు దోహదం చేస్తాయని అభిప్రాయపడ్డారు. పార్వతీపురం జిల్లాను పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు 4 నియోజకవర్గాలతోను..  అలాగే అరకు జిల్లాను అరకువ్యాలీ, పాడేరు, రంపచోడవరం 3 నియోజకవర్గాలతో కలిపి ఏర్పాటవుతాయని తెలిపారు. అందుకే రంపచోడవరం ప్రాంతం రాజమండ్రికి దగ్గరగా ఉన్నప్పటికీ  అల్లూరి సీతారామరాజు జిల్లాలో చేర్చామని తెలిపారు. 

శ్రీకాకుళం పేరున్న ఇన్‌స్టిట్యూట్‌లన్నీ ఎచ్చెర్లలో ఉన్నాయని.. అందుకే ఎచ్చెర్లను శ్రీకాకుళంలో కలిపామన్నారు. విజయనగరం విస్తీర్ణం కోసమే రాజాం, శృంగవరపుకోట నియోజకవర్గాలను ఆ జిల్లాలో కలిపామని, విజయనగరం అభివృద్ధి దెబ్బతినకుండా జిల్లా ఏర్పాటు చేశామన్నారు. అలాగే పెందుర్తిని తీసేస్తే అనకాపల్లి వెనకపడే అవకాశం ఉందన్నారు. భీమిలి గత ప్రాముఖ్యత దృష్య్టా రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేశామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం ప్రాంతాలను మూడు జిల్లాలుగా ఏర్పాటు చేశామన్నారు. కోనసీమ ప్రాంతాన్ని జిల్లాగా చేయాలని అక్కడి ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నారని, అందుకే అమలాపురం కేంద్రంగా దాన్ని ప్రతిపాదించామని తెలిపారు. నరసాపురం జిల్లాలో ఒక్క రెవిన్యూ డివిజన్ వచ్చింది కాబట్టి భీమవరం కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అవుతుందన్నారు.. బాపట్లలోని సంతనూతలపాడు నియోజకవర్గాన్ని ఒంగోలు జిల్లాకి కలుపుతామన్నారు. అలాగే నంద్యాలలోని పాణ్యం నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాకి, హిందూపూర్ లోని రాప్తాడు నియోజకవర్గాన్ని అనంతపూర్ జిల్లాకి కలుపుతామన్నారు. తిరుపతి పార్లమెంట్ లోని సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాకి కలపాలని.. తిరుపతికి చిత్తూరులోని చంద్రగిరి నియోజకవర్గం కలపాలని ప్రతిపాదించామన్నారు. రాజంపేట జిల్లాను 6 నియోజకవర్గాలతో ఏర్పాటు చేస్తూ.. పుంగనూరు నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లాకి కలపాలని ప్రతిపాదించామన్నారు. కొత్త ప్రతిపాదిత జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం సగటున జిల్లాకి 20 లక్షల వరకూ జనాభా ఉంటున్నట్లు తెలిపారు. 

26 జిల్లాలు.. 62 రెవెన్యూ డివిజన్లు..  

రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. జిల్లాల ఏర్పాటు పక్రియలో అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా ప్రతిపాదిత జిల్లా సరిహద్దు పరిధిలోకి రావాలని, ప్రతి జిల్లాలో కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు ఉండేలా నిబంధనలను అనుసరించామని ఆయన తెలిపారు.  పరిపాలన సౌలభ్యం కోసం ప్రస్తుతం ఉన్న 51 రెవిన్యూ డివిజన్లకు కొత్తగా 15 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని, 4 డివిజన్లను ప్రస్తుత రెవెన్యూ డివిజన్లకు కలపాలని ప్రతిపాదించామని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే రెవెన్యూ డివిజన్లలో విజయనగరం జిల్లాలో బొబ్బిలి  రెవెన్యూ డివిజన్, విశాఖపట్నం జిల్లాలో భీముని పట్నం రెవెన్యూ డివిజన్, నర్సాపురం జిల్లాలో భీమవరం రెవెన్యూ డివిజన్, విజయవాడ లో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాలో నందిగామ, తిరువూరు రెవిన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. అలాగే బాపట్ల జిల్లాలో ఒక్క రెవిన్యూ డివిజన్ కూడా లేదు కాబట్టి బాపట్ల, చీరాల డివిజన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించామన్నారు.  ఒంగోలు జిల్లాలో కనిగిరి రెవెన్యూ డివిజన్, నంద్యాల జిల్లాలో ఆత్మకూర్, డోన్ రెవెన్యూ డివిజన్లు, అనంతపూర్ జిల్లాలో గుంతకల్ రెవెన్యూ డివిజన్, హిందూపూర్ జిల్లాలో పుట్టపర్తి రెవెన్యూ డివిజన్, కడప జిల్లాలో బద్వేలు రెవెన్యూ డివిజన్, రాజంపేట (రాయచోటి) జిల్లాలో రాయచోటి రెవెన్యూ డివిజన్, చిత్తూరు జిల్లాలో పలమనేరు రెవెన్యూ డివిజన్ మొత్తం కలిపి 15 రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు వివరించారు. ఎటపాక, కుకునూరు, ధర్మవరం, కందుకూరు రెవెన్యూ డివిజన్ లలో షిఫ్ట్ చేశామన్నారు. 

భౌగోళిక విస్తీర్ణం, జనసాంద్రతను అనుసరించే విభజన జరిగిందని విజయకుమార్ స్పష్టం చేశారు.  26 జిల్లాల్లో అతి పెద్ద జిల్లాలుగా ఒంగోలు, అనంతపురం విస్తీర్ణంలో నిలిచాయన్నారు. దీనికి ప్రధాన కారణం ఈ రెండు జిల్లాల్లో నల్లమల ఫారెస్ట్ ఎక్కువ భాగం ఉందని తెలిపారు. చిన్న జిల్లాగా విశాఖపట్నం ఉందన్నారు. విస్తీర్ణం తక్కువయినా భీమవరం, రాజమండ్రి ఎక్కువ జనసాంద్రత ఉన్న జిల్లాలని, ఇక్కడ ఇరవై లక్షల మంది జనాభా ఉన్నారని తెలిపారు. చారిత్రక నేపథ్యాలను చూసి కూడా జిల్లాలను విభజించడం జరిగిందన్నారు. ప్రజల మనోభావాలను కూడా పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. అభ్యంతరాలు ఏమైనా ఉంటే ప్రభుత్వానికి తెలియచేయవచ్చని విజయకుమార్ ఈ సందర్భంగా సూచించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ డైరెక్టర్ కె. శివశంకర రావు తదితరులు పాల్గొన్నారు.

(జారీచేసిన వారు : కమిషనర్, సమాచార, పౌర సంబంధాల శాఖ, విజయవాడ)

No comments:

Post a Comment