Thursday, May 7, 2020

విషవాయువు బాధితులను ఆదుకోండి టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు

విషవాయువు బాధితులను ఆదుకోండి
టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు

అధికారులకు సాయపడాలని సూచన

సహాయ చర్యలపై కేంద్ర మంత్రి పీయూష్కు లేఖ



అమరావతి, మే 7 (ఆంధ్రజ్యోతి): విశాఖ గ్యాస్‌ లీక్‌ ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం హుటాహుటిన స్పందించారు. విశాఖ కలెక్టర్‌ వినయ్‌చంద్‌కు ఫోన్‌ చేసి దుర్ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. విశాఖలోని టీడీపీ నేతలకు ఫోన్‌ చేసి బాధితులకు సహాయ చర్యలపై వారిని అప్రమత్తం చేశారు. దుర్ఘటన స్థలానికి వెంటనే వెళ్లి బాధితులను తరలించడంలో అధికారులకు సహాయపడాలని.. బాధితులను కలిసి ఊరడించాలని సూచించారు. స్ధానిక టీడీపీ ఎమ్మెల్యే గణబాబు తెల్లవారుజామునే బాధిత ప్రాంతానికి వెళ్లి సహాయ చర్యల్లో నిమగ్నం కావడంతో చంద్రబాబు ఆయన్ను అభినందించారు. ఉదయమంతా ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉండి పరిస్ధితిని పర్యవేక్షించారు. తర్వాత విశాఖ జిల్లా పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.



సందర్శనకు అనుమతి కోసం కేంద్రానికి లేఖ

విశాఖ దుర్ఘటన అసాధారణమైంది కావడంతో ఆ ప్రాంతాన్ని సందర్శించి బాధితుల పరామర్శ కోసం అనుమతి ఇవ్వాలని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లాక్‌డౌన్‌ దృష్ట్యా ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఆయన విశాఖ వెళ్లాలంటే ప్రత్యేక విమానంలో మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ఆయన అద్దెకు తీసుకోదలచిన విమానం ముంబైలో ఉంది. ఆ విమానం హైదరాబాద్‌ వచ్చి.. అక్కడి నుంచి విశాఖ వెళ్లి.. తిరిగి హైదరాబాద్‌ మీదుగా ముంబై చేరుకోవాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. దీంతో ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పి.కె.మిశ్రాకు ఆయన లేఖ రాశారు.



కానీ గురువారం సాయంత్రం వరకూ దీనిపై కేంద్రం స్పందించలేదు. ప్రస్తుతం విశాఖలో సహాయ చర్యలు కొనసాగుతున్నందున శుక్రవారం లేదా శనివారం ఆయనకు అనుమతి ఇవ్వొచ్చని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, స్టైరిన్‌ ఘటనకు సంబంధించి కొన్ని నిర్దిష్ట సూచనలతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌కు చంద్రబాబు లేఖ రాశారు. ‘ఈ సంఘటనలో మరణాలు తక్కువగా ఉన్నా గ్యాస్‌ లీకేజితో అస్వస్ధతకు గురైన వారు రెండు వేల మంది వరకూ ఉన్నారు. గ్యాస్‌ లీకేజీ బాధితులకు వైద్య సేవలు అందించడానికి విశాఖలో ప్రత్యేక వైద్య నిపుణులు లేరు.



అందువల్ల జాతీయ స్థాయిలో నిపుణులను గుర్తించి.. అలాగే విదేశాల నుంచి కూడా కొందరిని సమకూర్చుకుని వైద్య బృందాన్ని విశాఖకు పంపాలని నా వినతి. కరోనా బాధితులకు ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ రావడానికి.. వ్యాధి నిరోధక శక్తి క్షీణించడానికి ఈ గ్యాస్‌ వల్ల ఆస్కారం ఏర్పడుతుంది. ప్రభుత్వం అందించే వైద్య సహాయం కరోనా వైరస్‌, స్టైరిన్‌ గ్యాస్‌ రెంటినీ దృష్టిలో ఉంచుకుని ఇవ్వాలి’ అని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనకు కారణమైన ఎల్‌జీ పాలిమర్స్‌ను వెంటనే మూసివేసి సమగ్ర విచారణకు విచారణ కమిటీని నియమించాలని డిమాండ్‌ చేశారు. ఈ పాలిమర్‌ యూనిట్‌ను జనావాసాలకు దూరంగా ఉన్న విశాఖ ప్రత్యేక ఆర్ధిక మండలికి తరలించాలని సూచించారు.

No comments:

Post a Comment