Saturday, May 30, 2020

సర్వం రద్దుల పర్వం.. ఏడాది పాలనలో పాత పథకాలన్నీ పక్కకే..

సర్వం రద్దుల పర్వం.. ఏడాది పాలనలో పాత పథకాలన్నీ పక్కకే..
ప్రజోపయోగ పథకాలను రద్దు చేసిన వైసీపీ ప్రభుత్వం

‘చింతలపూడి ఎత్తిపోతల’ను ఎండబెట్టారు

ADVERTISEMENT


POWERED BY PLAYSTREAM


గ్రామ, వార్డు సచివాలయాలుగా మారిన ‘అన్న క్యాంటీన్లు’

భూధార్‌ స్థానంలో భూముల ‘స్వచ్ఛీకరణ’

‘పాత’రేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలన

వైసీపీ సర్కారు ఏడాది పాలనపై విశ్లేషణ



విజయవాడ, ఆంద్రజ్యోతి: ఒక్క అవకాశం ఇచ్చి చూడమంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ఏడాది పాలనా కాలాన్ని పూర్తి చేసుకుంది. ప్రజల ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తామంటూ అధికారంలోకి వచ్చిననాడు ఇచ్చిన హామీ అమలు మాట ఎలా ఉన్నా.. పాత ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రజా ప్రయోజన పథకాలను పక్కకు నెట్టేసింది. మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే చింతలపూడి ఎత్తిపోతలను కన్నెత్తి చూడడం లేదు. ‘అన్న’ క్యాంటీన్లు కష్టకాలంలో అన్నార్తులకు అక్కరకు రాకుండాపోయాయి. రక్షిత మంచినీటి పథకం రద్దయిపోయింది. భూ వివాదాలకు శాశ్వతంగా చెక్‌ పెట్టే ‘భూధార్‌’ స్థానంలో భూముల ‘స్వచ్చీకరణ’ను తీసుకు వచ్చారు. ఏడాది కాలంలో జిల్లావ్యాప్తంగా సంక్షేమ పథకాల ద్వారా ‘అది చేశాం.. ఇది చేశాం..’ అని చెబుతున్న పాలకులు గత పాలకులు ప్రవేశపెట్టిన ప్రజోపయోగ సంక్షేమ పథకాలను పక్కన పెట్టేయడం ద్వారా సాధించిందేమిటో ఆలోచించాలి. వైసీపీ అధికారంలోకి వచ్చి, ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం రద్దు చేసిన పథకాలపై ప్రత్యేక కథనం..



రాజకీయ క్షేత్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు వస్తుంటాయి. పోతుంటాయి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజలే పరమావధి కావాలి. ప్రజా సంక్షేమం కోసమే పరితపించాలి. ఆ ప్రభుత్వం పథకాన్ని అమలు చేయటమేమిటని ఈ ప్రభుత్వం భావించి వాటిని రద్దుచేస్తే పాలన ఇంకేం ముందుకెళ్తుంది. ఏడాది పరిపాలనపై జిల్లావ్యాప్తంగా సంక్షేమ పథకాల అమల్లో ‘అది చేశాం.. ఇది చేశాం..’ అని చెబుతున్న పాలకులు వాస్తవ పరిస్థితిని మాత్రం దాస్తున్నారు. అంతకుముందు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు తిలోదకాలు ఇచ్చేశారు. మనజిల్లాలో అలాంటి పరిస్థితులు కోకొల్లలు. ప్రస్తుత ప్రభుత్వ ఏడాది పాలనలో మనజిల్లాలో రద్దయిన కీలకమైన ప్రాజెక్టులు ఇవీ..


అన్నం లేక అవస్థలు

అభాగ్యులు, కూలీలు, కార్మికుల కడుపు నింపడానికి టీడీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మొత్తం 38 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. వీటిలో రోజుకు 18వేల మంది పేదలు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం చేసేవారు. నిర్వహణ అక్షయపాత్రకు అందజేశారు. కేవలం రూ.5 ఉంటే అల్పాహారం లేదా భోజనం ఆరగించేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వాటిని మూసేసింది. వీటి స్థానంలో రాజన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని ప్రకటించారు. వాటికి సంబంధించిన నకిలీ నమూనాలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయినా ఎలాంటి క్యాంటీన్లు లేవు. ఈ రెండు జిల్లాల్లోని 38 క్యాంటీన్లలో కొన్నింటిని గ్రామ, వార్డు సచివాలయాలుగా మార్చేశారు. మరికొన్ని నిరుపయోగంగానే ఉన్నాయి. కూలీలు, కార్మికులకు కడుపు నింపుకోవడం కష్టంగా మారింది.


భూధార్‌.. చేజార్‌..

టీడీపీ అధికారంలో ఉండగా, భూ వివాదాలకు సంబంధించి భూధార్‌ వంటి ప్రయోగాత్మక పథకానికి శ్రీకారం చుట్టింది. ఆధార్‌ కార్డులా ప్రతి భూ యజయానికి భూ ఆధార్‌లా  దీన్ని తీసుకొచ్చారు. మన జిల్లా పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక కాగా, జగ్గయ్యపేట మండలంలో తాత్కాలికంగా భూధార్‌ ప్రక్రియను నిర్వహించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సర్వే సంస్థతో భూముల హద్దులను నిర్ణయించి తాత్కాలికంగా భూధార్‌లను రూపొందించారు. ఇది విజయవంతం కావటంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయటానికి శ్రీకారం చుట్టింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పక్కన పడేసింది. ఇదే సందర్భంలో భూముల స్వచ్ఛీకరణ పేరుతో ఒక కార్యక్రమాన్ని తెచ్చింది. భూ వివాదాలకు పరిష్కారం లభించలేదు. స్పందన కార్యక్రమంలో రెవెన్యూకు సంబంధించి భూ వివాదాల అర్జీలే ఎక్కువ వస్తున్నాయి. దీనిని  బట్టి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.



రక్షిత మంచినీటి పథకం రద్దు

గ్రామీణ నీటి సరఫరా సంస్థ (ఆర్‌డబ్ల్యూఎస్‌) నేతృత్వంలో నూరుశాతం రక్షిత మంచినీటి సరఫరా పథకానికి గత టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పైలెట్‌ ప్రాజెక్టులో తొలిదశలో మనజిల్లాకు అవకాశం కల్పించారు. మొత్తం 970 గ్రామ పంచాయతీల్లో తలసరి మంచినీటి సరఫరాను 40 శాతం నుంచి 70 శాతానికి తీసుకెళ్లాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో నీటి వనరుల లభ్యత, నీటి కొరతను ఎదుర్కొనే ప్రాంతాలను గుర్తించి నీటి వనరుల సద్వినియోగానికి మౌలిక సదుపాయాలపరంగా ఏమేమి చేపట్టాలన్న దానిపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను తయారుచేశారు. మెగా సంస్థ ఈ కాంట్రాక్టును దక్కించుకుంది. పనులు కూడా ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పనులు ప్రారంభించారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం జిల్లాలో పనులు జరుగుతున్న రక్షిత మంచినీటి ప్రాజెక్టును రద్దు చేసింది. దీని స్థానంలో గ్రామీణ ప్రాంతాలతో పాటు మునిసిపాలిటీలు, పారిశ్రామిక సంస్థల నీటి అవసరాలను తీర్చేలా డీపీఆర్‌ తయారు చేయాల్సిందిగా నిర్దేశించింది. దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన తరువాత రెండో ఫేజ్‌లో పెట్టారు. మొదటి ఫేజ్‌లో మన జిల్లాకు అవకాశం దక్కలేదు.



చెత్త నుంచి సంపద సున్నా

గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య సమస్యలు లేకుండా స్వచ్ఛంగా ఉంచేందుకు గత ప్రభుత్వం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు కృషిచేసింది. ప్రస్తుతం ఈ పథకానికి సుస్తీ చేసింది. గత ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా 980 గ్రామ పంచాయతీల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను ఏర్పాటుచేసింది. గ్రామంలో ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించటం కోసం గ్రీన్‌ అంబాసిడర్లను నియమించింది. చెత్త సేకరణకు రిక్షాలు, ఆటోరిక్షాలు, పుష్‌కాట్‌లు, మినీ పొక్లెయిన్ల వంటివి స్వచ్ఛాంద్ర కార్పొరేషన్‌ నిధుల ద్వారా గత ప్రభుత్వం పెద్ద ఎత్తున కొనుగోలు చేయించింది. జిల్లావ్యాప్తంగా 980 పంచాయతీల్లో జనాభా ప్రాతిపదికన రూ.3 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు ఖర్చు చేశారు. తీరా.. నిర్వహించాల్సిన సమయంలో ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ పథకం అమల్లో నిర్లిప్తత ప్రదర్శించింది. గ్రీన్‌ అంబాసిడర్లకు వేతనాలు లేక మానివేశారు. యంత్ర సామగ్రి మూలనపడింది. వాహనాలు తుప్పుపట్టాయి. తాజాగా ప్రజల నుంచి యూజర్‌ చార్జీలు వసూలుచేసి చెత్త నిర్వహణ కేంద్రాలను నడిపించాలన్న ఆలోచన చేయాలని భావిస్తోంది. ఇప్పటికే మూలనపెట్టిన పథకాన్ని యూజర్‌ చార్జీల వసూళ్ల ద్వారా ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి.


చింత తీరలేదు

కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మెట్టప్రాంతాన్ని గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయాలని చింతలపూడి-2 ఎత్తిపోతల పథకం ప్రారంభం కాగా, నేడు అది అనాథలా మారింది. టీడీపీ హయాంలో ఈ పథకం పనులు పరుగెత్తగా, వైసీపీ ప్రభుత్వం వచ్చాక పనులు ఆగిపోయాయి. ఏడాది అవుతున్నా ఇప్పటికీ పనులు ప్రారంభించకపోవడంతో రైతులు ఆశనిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. చింతలపూడి ఫేజ్‌-1 ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. ఫేజ్‌-2కు 2017లో అప్పటి సీఎం చంద్రబాబు రూ.3,200 కోట్లతో మొద్దులపర్వ వద్ద శంకుస్థాపన చేశారు. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పథకం పూర్తికావడానికి కృషిచేశారు. 60 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లాలోని కొంతమంది రైతులు ప్రభుత్వం తమకు ప్రకటించిన నష్టపరిహారం తక్కువగా ఉందని కోర్టుకెళ్లారు. చాట్రాయి మండలంలో సుమారు 100 ఎకరాల అసైన్డ్‌ భూములను సేకరించినా, రైతులకు నష్టపరిహారం చెల్లించలేదు. ప్రస్తుతం పథకం పూర్తిచేయడానికి నాబార్డు నుంచి రూ.1,931 కోట్ల నిధులు మంజూరయ్యాయి. వీటితో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారు. ప్రభుత్వం నిర్వాసిత రైతులకు నష్టపరిహారం చెల్లిస్తేనే పనులు ప్రారంభం కావడానికి అవకాశం ఉంటుంది. ఈ పథకం వినియోగంలోకి వస్తే కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో 33 మండలాల్లోని 4.80 లక్షల ఎకరాలకు 53.50 టీఎంసీల గోదావరి నీరు అందుతుంది.



ఏడాదికే ప్రజలు విసుగెత్తిపోయారు: బుద్దా వెంకన్న, ఎమ్మెల్సీ

జగన్‌ ఏడాది పాలన.. సినిమాకు ట్రైలర్‌ లాంటిది. ఈ ట్రైలరును చూసి ప్రజలు విసుగెత్తిపోయారు. టీడీపీ హయాంలో అమలుచేసిన చంద్రన్న బీమా, పెళ్లి కానుక, రూ.5కే భోజనం పెట్టే అన్న క్యాంటీన్లు, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగ భృతి.. వంటి అనేక సంక్షేమ పథకాలను జగన్‌ ప్రభుత్వం రద్దు చేసింది.



పూర్తి వైఫల్యం: పాతూరి నాగభూషణం, బీజేపీ నాయకుడు

వైసీపీ ప్రభుత్వం ఏడాది కాలంలోనే అన్ని రంగాల్లో విఫలమైంది. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమను తీసుకువచ్చారా? ఒక్క ఇరిగేషన్‌ ప్రాజెక్టును పూర్తిచేశారా? కోర్టులు చీవాట్లు పెడుతున్నా పాలకులకు బుద్ధి రావడం లేదు. ఇదే పద్ధతి కొనసాగితే ఐదేళ్లు కాదు.. మరో ఏడాదిలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల చీత్కారాలను ఎదుర్కొనక తప్పదు.




No comments:

Post a Comment