Thursday, August 22, 2019

పిచ్చా?.. రాష్ట్రానికి పట్టిన శనా? అర్థం కావట్లేదు: చంద్రబాబు

పిచ్చా?.. రాష్ట్రానికి పట్టిన శనా? అర్థం కావట్లేదు: చంద్రబాబు
22-08-2019 13:19:56

అమరావతి: పోలవరంపై ప్రభుత్వం ఇప్పుడు ఏం చెబుతుందని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది ఇక్కడితో ఆగదని, జాప్యం ప్రభావం ప్రాజెక్టుపై పడుతుందన్నారు. ప్రభుత్వానికి పిచ్చి అనుకోవాలా? లేదంటే రాష్ట్రానికి పట్టిన శని అనుకోవాలో అర్థం కావడం లేదన్నారు. పోలవరంతో ప్రయోగాలు వద్దని తాము ముందు నుంచి చెబుతున్నామన్నారు.

సీఎం జగన్ మూర్ఖంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. పోలవరం రివర్స్ టెండరింగ్‌ వల్ల ప్రాజెక్టుకు నష్టం వాటిల్లుతుందన్నారు. కేంద్రం చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి అర్థం కావడం లేదని విమర్శించారు. పోలవరంలో లేని అవినీతిని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. టెండర్ల విషయంలో గడ్కరీ ఎన్నో సార్లు వద్దు అని చెప్పారని.. ఒక్కసారి న్యాయ వివాదం మొదలైతే ప్రాజెక్ట్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.

Tuesday, August 20, 2019

బాబుపై కోపంతో ఊళ్లను ముంచారు

బాబుపై కోపంతో ఊళ్లను ముంచారు
20-08-2019 02:53:07

సీమకు వరద నీటిని ఇవ్వలేకపోయారు
గవర్నర్‌కు టీడీపీ నేతల ఫిర్యాదు
అధికారులతో మాట్లాడతా... గవర్నర్‌ హామీ
అమరావతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కోపంతో ప్రభుత్వ పెద్దలు కృష్ణా వరదల్లో ఊళ్ళను ముంచారని తెలుగుదేశం పార్టీ నేతలు రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ విశ్వ భూషణ్‌ హరి చందన్‌ను టీడీపీ బృందం కలిసి ఒక వినతిపత్రం సమర్పించింది. ఈ బృందంలో టీడీపీ పార్లమెంటరీ పక్ష నేత గల్లా జయదేవ్‌, విజయవాడ ఎంపీ కేశినేని నాని, రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్‌, సీతారామలక్ష్మి, శాసనసభాపక్ష ఉప నేతలు కింజరాపు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహనరావు, మద్దాలి గిరి, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వర ప్రసాద్‌, పి.అశోక్‌ బాబు, తెలుగునాడు విద్యార్ధి విభాగం అధ్యక్షుడు బ్రహ్మం తదితరులు ఉన్నారు.

గవర్నర్‌తో భేటీ అనంతరం టీడీఎల్పీ ఉప నేతలు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, రామానాయుడు రాజ్‌భవన్‌ బయట విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రభుత్వానికి, ప్రభుత్వ అధినేతకు పిచ్చి పట్టింది. ఈ వరదల సమయంలో అది పరాకాష్ఠకు చేరింది. వరదలపై కేంద్ర ప్రభుత్వ విభాగాలు అప్రమత్తం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం కావాలనే మౌనంగా ఊరుకొంది. వరదల్లో చంద్రబాబు ఉంటున్న ఇల్లు, అమరావతి రాజధాని ప్రాంతం మునిగిపోవాలని కోరుకున్నారు. అందుకనే వరద నీటిని సకాలంలో కిందకు వదలకుండా కూర్చున్నారు’’ అని అచ్చెన్న తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీనివల్ల అనేక గ్రామాల్లోకి వరద నీరు ప్రవేశించి ప్రజలు నానా కష్టాలు పడ్డారని అన్నారు.

ముఖ్యమంత్రి అమెరికాలో విహార యాత్ర చేస్తుంటే ఇక్కడ మంత్రులు అబద్ధాల ప్రచారంలో మునిగి తేలుతున్నారని దుయ్యబట్టారు. ప్రకాశం బ్యారేజి వద్ద 40 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చన్న మంత్రి అనిల్‌ యాదవ్‌ మాటల ధోరణి చూసి ప్రజలు అసహ్యించుకొంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి వైపు నుంచి ఒక్క సమీక్ష లేదని, మంత్రులు వరద ప్రాంతాలను వదిలివేసి చంద్రబాబు నివాసం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారని విమర్శించారు.

ప్రకాశం బ్యారేజి వద్ద మూడు టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉంటే నాలుగున్నర టీఎంసీల నీటిని నిల్వ చేశారని బుచ్చయ్య చౌదరి విమర్శించారు. 2009లో ప్రకాశం బ్యారేజి వద్దకు 11 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు కూడా వాటిల్లని నష్టం ఇప్పుడు కేవలం ఆరేడు లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తేనే చోటు చేసుకుందన్నారు. సకాలంలో స్పందించకపోవడం వల్ల రాయలసీమలో వాడుకోవడానికి అవకాశం ఉన్న 80 టీఎంసీల నీటిని వాడుకోలేకపోయారన్నారు. ‘‘పోతిరెడ్డిపాడు కాల్వ నుంచి నీటిని సీమకు పంపలేకపోయిందని అందరూ బాధపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వమేమో... అక్కడ నుంచి నీటిని ఎక్కువ తీసుకొన్నామంటూ కృష్ణా నదీ బోర్డుకు ఫిర్యాదు చేసింది.

అటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని నమ్మి అక్కడ ఉమ్మడి ప్రాజెక్టులు కడతామనే సీఎం జగన్‌ తెలివితేటలను ఏం అనాలో అర్థం కావడం లేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. వరద ప్రాంతాల్లో ప్రజలు మంచినీరు దొరక్క అల్లాడుతుంటే మంత్రులు మినరల్‌ వాటర్‌కు వెంపర్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో సగం జిల్లాలు ముంపులో ఉంటే సగం జిల్లాలు కరువులో ఉన్నాయని రామానాయుడు పేర్కొన్నారు.

సాగునీటి అధికారుల్లో సగం మంది తెలంగాణతో ఉమ్మడి ప్రాజెక్టు పనిపై హైదరాబాద్‌లో కూర్చుంటే... మిగిలిన సగం మంది రివర్స్‌ టెండరింగ్‌ పనుల్లో తిరుగుతున్నారని ఆయన విమర్శించారు. కృష్ణా, గోదావరి వరదల్లో వేల ఇళ్ళు మునిగిపోతే ఇళ్ళుఖాళీ చేయాలని వారికి ఎవరికీ నోటీసులు ఇవ్వకుండా కేవలం చంద్రబాబు ఒక్కరికే ఇచ్చారని అన్నారు. ఈ పరిస్థితులన్నీ గవర్నర్‌కు వివరించామన్నారు. సావధానంగా విన్న గవర్నర్‌ దీనిపై అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారన్నారు.

Wednesday, July 31, 2019

కేసీఆర్‌కు చెప్పి సస్పెండ్ చేయిస్తా: పోలీసులకు వైసీపీ ఎమ్మెల్యే భార్య వార్నింగ్

కేసీఆర్‌కు చెప్పి సస్పెండ్ చేయిస్తా: పోలీసులకు వైసీపీ ఎమ్మెల్యే భార్య వార్నింగ్
31-07-2019 13:26:30

హైదరాబాద్: కృష్ణాజిల్లా, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కుటుంబసభ్యులు మాదాపూర్‌ ట్రాఫిక్ పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో వైసీపీ ఎమ్మెల్యే సతీమణి విమలా భానుతోపాటు కుమార్తె, అల్లుడు ఉన్నారు. మహిళలను నెట్టడం సరికాదని.. సీఎం కేసీఆర్‌తో చెప్పి సస్పెండ్ చేయిస్తానని ట్రాఫిక్ పోలీసులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాదాపూర్ ఖానామిట్ట వద్ద ట్రాఫిక్ పోలీసులు విధినిర్వహణలో ఉన్నప్పుడు కొన్ని వాహనాలను ఆపారు. ఆ వాహనాల్లో ఎమ్మెల్యే ఉదయభాను కుమారుడు ప్రసాద్ వాహనం కూడా ఉంది. పోలీసులు తమ వాహనాన్ని అన్యాయంగా ఎక్కువసేపు ఆపారంటూ ప్రసాద్ పోలీసులతో గొడవపడ్డారు. దీంతో పోలీసులు సర్దిచెప్పడానికి ప్రయత్నించినప్పటికీ ప్రసాద్ వినకుండా ఘర్షణకు దిగుతూ.. విధుల్లో ఉన్న ట్రిఫిక్ ఎస్ఐపై దాడి చేసి కాలితో తన్నారు. ఎస్ఐ పిర్యాదు మేరకు ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని మాదాపూర్ పీఎస్‌కు తరలించారు. ఇది జరిగిన కొద్ది నిముషాలకే ఎమ్మెల్యే ఉదయభాను కుటుంబసభ్యులు వచ్చి ఎస్ఐ రాజగోపాల్ రెడ్డితో గొడవకు దిగారు. వారిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Monday, July 22, 2019

World Bank ‘అమరావతి రుణం’ మరో ప్రాజెక్టుకు!

World Bank ‘అమరావతి రుణం’ మరో ప్రాజెక్టుకు!
Jul 21, 2019, 03:09 IST
 World Bank officials informed the state government about funding - Sakshi
300 మిలియన్‌ డాలర్ల రుణం ఇస్తాం

అవసరమైతే సాయాన్ని మరింత పెంచుతాం

ప్రాధామ్యాలను నిర్ణయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంకు సమాచారం

నవరత్నాలకు చేయూత అందిస్తాం

ప్రజల జీవన ప్రమాణాలను పెంచే పథకాలకు సాయపడతామన్న బ్యాంకు

గత సర్కారు నిబంధనలను ఉల్లంఘించటం వల్లే రుణంపై వెనక్కి తగ్గిన వైనం

అమరావతి రహదారుల టెండర్లలో అక్రమాలపై తనిఖీ బృందాలతో ఆరా

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణానికి రుణం మంజూరు నుంచి తాము వైదొలిగినప్పటికీ ఇతర ఏ పట్టణ ప్రాజెక్టుకైనా సరే రుణం మంజూరు చేస్తామని, ప్రాధామ్యాల ఆధారంగా దీనిపై నిర్ణయించుకోవాలని ప్రపంచ బ్యాంకు అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. మరో ప్రాజెక్టును సూచిస్తే 300 మిలియన్‌ డాలర్ల రుణాన్ని అందిస్తామని ప్రపంచ బ్యాంకు ప్రతిపాదించినట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అవసరమైతే సాయాన్ని మరింత పెంచుతామని కూడా హామీ ఇచ్చింది. అమరావతి ప్రాజెక్టుకు రుణం మంజూరు నుంచి తప్పుకోవడంపై ప్రపంచ బ్యాంకు అధికారులు ఈమేరకు స్పందించినట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలకు చేయూత అందిస్తామని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచే పథకాలకు సాయం అందిస్తామని ప్రపంచబ్యాంకు వర్గాలు పేర్కొన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

రుణం రాకముందే రోడ్ల టెండర్లా?
అమరావతి ప్రాజెక్టుకు రుణం మంజూరు నుంచి ప్రపంచ బ్యాంకు వైదొలగడానికి చంద్రబాబు సర్కారు వైఫల్యాలతోపాటు బ్యాంకు నియమ నిబంధనలను ఉల్లంఘించడమే ప్రధాన కారణాలు. ప్రపంచ బ్యాంకు రుణం మంజూరు చేయకముందే గత సర్కారు రహదారుల పనులకు టెండర్లను ఆహ్వానించడమే కాకుండా ఖరారు కూడా చేసింది. అనంతరం టెండర్ల వివరాలను పరిశీలించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఇందులో కాంట్రాక్టు సంస్థలు కుమ్మక్కు అయినట్లు స్పష్టం అవుతోందని, దీనిపై వివరణ ఇవ్వాలని సీఆర్‌డీఏను కోరారు. ఈ నేపథ్యంలో ల్యాండ్‌ పూలింగ్‌లో అక్రమాలు, వ్యవసాయ భూములను పెద్ద ఎత్తున సేకరించి ఇతర అవసరాలకు వినియోగించడం, రైతు కూలీలు జీవనోపాధి కోల్పోవడం, పర్యావరణ విపత్తులు, రాజధానిలో కృష్ణా నది వరదల ప్రభావం తదితర అంశాలపై ప్రపంచ బ్యాంకు క్షేత్రస్థాయి తనిఖీలను నిర్వహించడంతో పాటు విచారణ జరిపించింది. చంద్రబాబు సర్కారు వాస్తవాలను కప్పిపుచ్చినట్లు గుర్తించిన ప్రపంచ బ్యాంకు తనిఖీల కోసం బృందాన్ని అమరావతికి పంపింది. రుణం మంజూరు కూడా కాకముందే ప్రపంచ బ్యాంకు బృందం అమరావతి ప్రాజెక్టుపై విచారణ చేయడం పట్ల కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం విస్మయం వ్యక్తం చేసింది.

తనిఖీల తరువాతే బ్యాంకు నిర్ణయం..
– రాజధాని అమరావతి ప్రాజెక్టుకు రుణం కోరుతూ 2016 అక్టోబరు 8న చంద్రబాబు సర్కారు కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగానికి ప్రతిపాదనలు పంపింది. 2017 జూన్‌ 12న ఈ ప్రతిపాదన రిజిస్టర్‌ అయింది.
– మొత్తం ప్రాజెక్టు విలువ 715 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు కాగా దీని విలువ మన రూపాయల్లో ఇంచుమించు రూ.5 వేల కోట్లు.
– ఇందులో వరల్డ్‌ బ్యాంకు వాటా రూ.2100 కోట్లు, ఏసియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు వాటా రూ.1,400 కోట్లు కాగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వాటా రూ.1500 కోట్లు.
– ప్రపంచ బ్యాంకు నుంచి రుణం మంజూరు కాకముందే 2017–2018లో రాజధానిలో రహదారి నిర్మాణ పనులను హడావుడిగా కాంట్రాక్టర్లకు అప్పగించేశారు.
– 92 కిలోమీటర్ల మేర రోడ్లు వేయడానికి రూ.1,872 కోట్లు, ముంపు నివారణకు కాలువలు, రిజర్వాయర్‌ పేరిట రూ. 947 కోట్ల విలువైన పనులు అప్పగించారు.
– టీడీపీ ప్రభుత్వం అప్పగించిన వాటిల్లో 7 పనులు రెట్రోయాక్టివ్‌ ఫైనాన్సింగ్‌ విధానానికి విరుద్ధంగా ఉన్నాయని ప్రపంచబ్యాంకు అభ్యంతరం తెలిపింది. అయినా సరే చంద్రబాబు సర్కారు దీన్ని పట్టించుకోకుండా చాలా పనులు కాంట్రాక్టర్లకు కట్టబెట్టింది.
– రాజధాని ప్రాంతంలో చంద్రబాబు సర్కారు తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడుతోందని, అన్ని రకాల చట్టాలను ఉల్లంఘిస్తోందని ప్రపంచ బ్యాంకుకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ఇలా ఫిర్యాదు చేసిన వారిలో గత సర్కారు బాధితులు, రైతులు, స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలున్నారు.
– దీనిపై వాస్తవాలను నిర్థారించుకునేందుకు ప్రపంచ బ్యాంకుకు చెందిన ఐఏఎం, ఇండిపెండెంట్‌ అకౌంటబులిటీ మెకానిజం 2017 సెప్టెంబరు 13 నుంచి 17 వరకు రాజధాని ప్రాంతంలో పర్యటించింది. అమరావతి ప్రాజెక్టు డిజైన్, పర్యావరణం, రాజధానిలో నివసిస్తున్న బడుగు, బలహీనవర్గాల స్థితిగతుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న అంశాలపై పరిశీలన, తనిఖీలు జరిపింది. తొలుత 2017 సెప్టెంబరు 27న నివేదిక ఇవ్వగా అనంతరం అదే ఏడాది నవంబర్‌ 27న సవరించింది. ఆ తరువాత 2018 జూన్‌ 26న మరోసారి సవరించగా చివరగా ఈ ఏడాది మార్చి 29న నివేదికను ఖరారు చేసింది.
– ప్రపంచబ్యాంకుకు చెందిన ఐదు విభిన్న బృందాలు తమకు అందిన ఫిర్యాదులపై  క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి భారీగా సమాచారాన్ని సేకరించాయి. ఇందులో ఇద్దరు ప్రతినిధులు చాలా ఘాటుగా ప్రపంచబ్యాంకుకు నివేదిక ఇచ్చారు. రాజధాని రైతులు జీవనోపాధి కోల్పోతున్నారని, కౌలు రైతులను పట్టించుకోలేదని, నిరుద్యోగాన్ని సృష్టించారని, వ్యవసాయం దెబ్బతిందని, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని సృష్టించారని, పర్యావరణం మీద తీవ్రమైన ప్రభావం చూపుతోందని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, తనిఖీ బృందాలు వ్యక్తం చేసిన అభ్యంతరాలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. వీటిపై సరైన వివరణలు కూడా ఇవ్వలేదు. దీంతో పూర్తిస్థాయి బృందంతో విచారణ చేయాలని తనిఖీ బృందం ప్రపంచబ్యాంకుకు సిఫార్సు చేసింది. ప్రాజెక్టు మంజూరు కాకముందే ఇలాంటి విచారణకు ఆదేశించడం గతంలో దేశంలో ఎప్పుడూ, ఎక్కడా జరగకపోవడం గమనార్హం.

Tuesday, July 9, 2019

ఖబడ్దార్‌.. దాడులు, హత్యలు, ఆస్తులు ధ్వంసం చేస్తే సహించం

ఖబడ్దార్‌.. దాడులు, హత్యలు, ఆస్తులు ధ్వంసం చేస్తే సహించం
7/10/2019 4:37:31 AM
పొలిటికల్‌ టెర్రరిజం మంచిది కాదు
ధర్మవరం ఎమ్మెల్యే అరాచకాలు మితిమీరాయి
ఎన్నికలు ఎప్పుడు పెట్టినా టీడీపీ ప్రభంజనం సృష్టిస్తుంది
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు
ధర్మవరం, జూలై 9 : రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలకు వైసీపీ నుంచి ఎటువంటి ఆపద ఎదురైనా వారిని కాపాడుకునే బాధ్యత నాదేనని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. వైసీపీ వర్గీయులు టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, హత్యలు, ఆస్తులు ధ్వంసం చేస్తే ఖబడ్దార్‌ అంటూ హెచ్చరించారు. మంగళవారం వైసీపీ నాయకుల చేతిలో హత్యకు గురైన కుటుంబాలకు భరోసా కల్పించి ఆర్థిక సాయం అందించడంలో భాగంగా చంద్రబాబు జిల్లా పర్యటనకు విచ్చేశారు. ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం పత్యాపురంలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త రాజు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందించగా, గాయపడిన మరో ఆరుగురికి రూ.50వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. బాధిత కుటుంబీకుల పిల్లలను ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు ద్వారా చదివిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ధర్మవరం పట్టణానికి చేరుకుని మృతి చెందిన చేనేత కార్మికుడు చంద్రశేఖర్‌ కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేసి, వారి పిల్లలను కూడా చదివిస్తానని హామీ ఇచ్చారు. కాగా ధర్మవరంలో కార్యకర్తల సమావేశం నిర్వహించాల్సి ఉంది. భారీ ఎత్తున కార్యకర్తలు, ప్రజలు, చేనేత కార్మికులు తరలిరావడంతో కల్యాణమండపం పట్టలేదు. దీంతో బహిరంగ సభగా మార్చాల్సి వచ్చింది.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, హత్యా రాజకీయాలు మితిమీరిపోతున్నాయన్నారు. ప్రజలను చంపే అధికారం ఎవరికీ లేదన్నారు. వైసీపీ నాయకుల దాడుల్లో నష్టపోయిన తెలుగుదేశం కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రతిపక్ష నేతగా మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తనదేనన్నారు. ధర్మవరం ఎమ్మెల్యేతో పాటు కొందరు వైసీపీ నాయకులకు ఖబడ్దార్‌, జాగ్రత్త అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. దాడులు మానుకోవాలని చంద్రబాబు హితవు పలికారు. 2009లో ఇక్కడ ఒకాయనను నియోజకవర్గ ఇన్‌చార్జిగా చేసి 2014లో మీరందరూ ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే... ఇప్పుడు నాకే నీతులు చెప్పి మిమ్మల్ని నట్టేట ముం చి వెళ్లిపోయారన్నారు. ఎవరు వెళ్లినా ఎన్టీఆర్‌ పెట్టిన పార్టీ శాశ్వతమన్నారు. ధర్మవరంలో కార్యకర్తల నాడి చూడాలని మీటింగ్‌ పెడితే బహిరంగ సభగా మార్చాల్సి వచ్చిందన్నారు. ఇంత రాత్రి పూట కూడా వేలాదిగా తరలివచ్చి తనకు మద్దతు పలకడం మరచిపోలేనిదన్నారు. ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృ ష్టిస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో దారి పొడవునా వందలాది మంది ఆశీర్వదిస్తూ మా ఓట్లు మీకే వేశాం.. అవి ఎక్కడికెళ్లా యో అడగడానికి వచ్చామని ప్రజలు పేర్కొంటున్నారన్నారు.

ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోం
ధర్మవరంలో ప్రతిపక్షమే లక్ష్యంగా చేసుకుని వైసీపీ ఆస్తులను ధ్వంసం చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని చంద్రబాబు అన్నారు. ఆక్రమణలు ఏవైనా ఉంటే మొదట మీవారి ఆక్రమణలు తొలగించిన తర్వాత మా వారివి తొలగిస్తే ప్రతి ఒక్కరూ స్వాగతిస్తారన్నారు. అలా కాకుండా ప్రతిపక్ష నాయకులను టార్గెట్‌ చేసుకుని వారిని బలహీనపరచడం కోసం ధర్మవరం వైసీపీ నాయకులు సొంత స్థలంలో ఉన్న నిర్మాణాలు సైతం తొలగించడం మంచిది కాదన్నారు. ధర్మవరానికి చెందిన దేవరకొండ రామకృష్ణ, నాగరాజు, మరికొందరు గృహాలను కూల్చివేయడంతో పాటు చీనీ చెట్లను నరికి వేయడాన్ని ఈ సందర్భంగా ఉదహరించారు. చంద్రబాబు వెంట మాజీ మంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఉమామహేశ్వరరావు, పరిటాల శ్రీరామ్‌, మాజీ మేయర్‌ స్వరూప, సబిత, చిగిచెర్ల ఓబిరెడ్డి, కమతం కాటమయ్య, గరుగు వెంగప్ప, సనత్‌, అత్తార్‌ రహీంబాషా, మాజీ జడ్పీటీసీలు విశాలాక్షి, మేకల రామాంజనేయులు ఉన్నారు.

బొల్లినేని శ్రీనివాస్‌పై సీబీఐ దాడులు

బొల్లినేని శ్రీనివాస్‌పై సీబీఐ దాడులు
Jul 09, 2019, 19:41 IST
 CBI Attacks On Bollineni Srinivas Rao - Sakshi
జీఎస్టీ సీనియర్ అధికారి బొల్లినేనిపై అక్రమాస్తుల ఆరోపణలు

భారీగా ఆస్తులను గుర్తించిన సీబీఐ అధికారులు

ఎంపీ సుజనా చౌదరీ కేసులో ఫైళ్ల మార్పు

ఆయన భార్య బొల్లినేని శిరీషపై కూడా కేసు నమోదు

సాక్షి, హైదరాబాద్‌: జీఎస్టీ సీనియర్ అధికారి బొల్లినేని శ్రీనివాస్ గాంధీపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఏకకాలంలో విజయవాడ, హైదరాబాద్‌ కార్యాలయాలతో పాటు ఆయన నివాసంలో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్నా ఆరోపణలతో అధికారులు తొలుత ఆయనపై కేసు నమోదు చేసి.. దాడులు చేపట్టారు. రూ. 200 కోట్లు అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారని ఆయనపై అభియోగాలు మోపబడ్డాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడైన శ్రీనివాస్‌.. పదేళ్లకు పైగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లో పనిచేసిన అనుభవం ఉంది. ప్రసుత్తం ఆయన జీఎస్టీ సీనియర్ అధికారిగా పని చేస్తున్నారు. ఇప్పటి వరకు  ఆయన వద్ద నాలుగు కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. గాంధీతో పాటు ఆయన భార్య బొల్లినేని శిరీషపై కూడా కేసు నమోదు చేశారు.

రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరీకి సంబంధించిన కేసును విచారణ చేసిన గాంధీ.. చంద్రబాబు సూచనల మేరకు పలు ఫైళ్లల్లో మార్పులు చేసినట్టు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు ఆయనపై ఈడీ, కేంద్ర ఆర్థిక శాఖ, పీఎంవో  కార్యాలయం నుంచి అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో సీబీఐ అధికారులు దాడులను ముమ్మరం చేశారు. గతంలో హైదరాబాద్‌ ఈడీ కార్యాలయం నుంచి బదిలీ అయినా.. అనధికారికంగా నెలరోజుల పాటు విధుల్లో కొనసాగారని ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో అనేక మంది టీడీపీ నేతలకు అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకోడానికి సహకరించినట్లు ఆయనపై అభియోగాలు మోపబడ్డాయి.

భారీగా అక్రమాస్తుల గుర్తింపు..
ఆయనపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఐపీసీ సెక్షన్ 109,13(2),13(1బీ) ప్రకారం అధికారులు కేసు నమోదు చేశారు. హోదాను అడ్డుపెట్టుకుని అక్రమాస్తులు సంపాదించినట్లు విచారణలో తెలుస్తోంది. విజయవాడ, గుంటూరు, హైదరాబాద్‌లో భారీగా ఆస్తులు ఉన్నట్లు తెలుసింది. అధికారులు ఇ‍ప్పటి వరకు గుర్తించిన ఆస్తుల వివరాలు... కంకిపాడులో మూడు స్థలాలు, ప్రొద్దుటూరులో ఇళ్లు, కానూరులో 360 గజాల స్థలం, రంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్‌లో 300 గజాల స్థలం, మరో రెండు స్థలాలు,  మదీనా గూడలో పది కుంటలు, విజయవాడ కంకిపాడులో 43 సెంట్లు, తుళ్లూరులో 42 సెంట్ల స్థలం,  కంకిపాడులో 2.96 సెంట్ల స్థలం, బ్యాంకు ఖాతాలో భారీగా నగదును గుర్తించారు. కూకట్పల్లి యాక్సిస్ బ్యాంక్ అకౌంట్లో రూ‌‌.20 లక్షలు, బంధువులు నరసింహారావు,శ్రీలత ఖాతాలో పది‌లక్షల నగదు, కుంటుబ సభ్యులపై ఫిక్సడ్ డిపాజిట్లు చేసినట్లు తెలిసింది.

సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో 1992లో విధుల్లో చేరిన గాంధీ.. 2002లో సూపరింటెండెండ్‌గా ప్రమోషన్ రావడంతో హైదరాబాద్ కమిషనరేట్‌లో చేరారు. 2003లో డీఆర్ఐలో చేరారు. 2004 నుంచి 2017 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లో పని చేశారు. ప్రసుత్తం ఆయన జీఎస్టీ సీనియర్ అధికారిగా కొనసాగుతున్నారు. 

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వం.. తేల్చి చెప్పిన కేంద్రం

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వం.. తేల్చి చెప్పిన కేంద్రం
09-07-2019 20:36:01

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం మరోసారి తేల్చి చెప్పింది. ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక సాయం మాత్రమే చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే ఏపీకి ప్రత్యేక సాయం ప్రకటించామని కేంద్రం తెలిపింది. పార్లమెంట్‌లో ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అడిగిన ప్రశ్నకు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 14వ ఆర్థికసంఘం సిఫార్సులతో హోదా అంశం మరుగునపడిందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య పరిష్కారం కాని అంశాలపై దృష్టిపెట్టామని తెలిపారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని నిత్యానందరాయ్ ప్రకటించారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ప్రధాని మోదీని కలిసి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా కోరారు కూడా. అయినప్పటికీ కేంద్రం ఏమాత్రం సానుకూలంగా స్పందించలేదు. తొలి నుంచీ ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్న కేంద్రం.. ఇప్పుడు కూడా అదే విషయాన్ని స్పష్టం చేసింది.


సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు సత్వరమే ప్రత్యేక హోదా ప్రకటించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం లోక్‌సభలో  బడ్జెట్ పై చర్చ లో పాల్గొన్న భరత్‌ విభజిత ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీని గుర్తుచేశారు.తిరుపతిలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ఎన్నికల సభలో నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని చెప్పారు.

ఎన్డీఏ ప్రభుత్వం ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినా ఇప్పటికీ ఆ హామీని నిలబెట్టుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.వాగ్దానాలు ఆకాశాన్నిఆవరించిన మేఘంలా కనిపిస్తున్నా.. మేఘం వర్షిస్తేనే వాగ్దానాలు ఫలించినట్టు అని హిందీ కవిత చదివిన మార్గాని భరత్ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించిందని మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ సంక్షోభంలో ఉందని, ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని,గాయపడిన రాష్ట్రాన్ని ప్రధానమంత్రి ఆదుకోవాలని కోరారు.చంద్రబాబును ప్రజలు పూర్తిగా తిరస్కరించారని అన్నారు.ఏపీ విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేయడంతో పాటు రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు తక్షణమే నిధులు విడుదల  చేయాలని కోరారు.13 జిల్లాల్లో 13 భారీ పరిశ్రమలు స్థాపించాలని కోరారు. ఇక ఒలింపిక్స్ లో మన క్రీడాకారులు గోల్డ్ మెడల్ సాధించేందుకు ప్రభుత్వం వద్ద ఏమైనా రోడ్డుమ్యాప్ ఉందా అని భరత్‌ ప్రశ్నించారు.