Tuesday, August 20, 2019

బాబుపై కోపంతో ఊళ్లను ముంచారు

బాబుపై కోపంతో ఊళ్లను ముంచారు
20-08-2019 02:53:07

సీమకు వరద నీటిని ఇవ్వలేకపోయారు
గవర్నర్‌కు టీడీపీ నేతల ఫిర్యాదు
అధికారులతో మాట్లాడతా... గవర్నర్‌ హామీ
అమరావతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కోపంతో ప్రభుత్వ పెద్దలు కృష్ణా వరదల్లో ఊళ్ళను ముంచారని తెలుగుదేశం పార్టీ నేతలు రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ విశ్వ భూషణ్‌ హరి చందన్‌ను టీడీపీ బృందం కలిసి ఒక వినతిపత్రం సమర్పించింది. ఈ బృందంలో టీడీపీ పార్లమెంటరీ పక్ష నేత గల్లా జయదేవ్‌, విజయవాడ ఎంపీ కేశినేని నాని, రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్‌, సీతారామలక్ష్మి, శాసనసభాపక్ష ఉప నేతలు కింజరాపు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహనరావు, మద్దాలి గిరి, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వర ప్రసాద్‌, పి.అశోక్‌ బాబు, తెలుగునాడు విద్యార్ధి విభాగం అధ్యక్షుడు బ్రహ్మం తదితరులు ఉన్నారు.

గవర్నర్‌తో భేటీ అనంతరం టీడీఎల్పీ ఉప నేతలు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, రామానాయుడు రాజ్‌భవన్‌ బయట విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రభుత్వానికి, ప్రభుత్వ అధినేతకు పిచ్చి పట్టింది. ఈ వరదల సమయంలో అది పరాకాష్ఠకు చేరింది. వరదలపై కేంద్ర ప్రభుత్వ విభాగాలు అప్రమత్తం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం కావాలనే మౌనంగా ఊరుకొంది. వరదల్లో చంద్రబాబు ఉంటున్న ఇల్లు, అమరావతి రాజధాని ప్రాంతం మునిగిపోవాలని కోరుకున్నారు. అందుకనే వరద నీటిని సకాలంలో కిందకు వదలకుండా కూర్చున్నారు’’ అని అచ్చెన్న తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీనివల్ల అనేక గ్రామాల్లోకి వరద నీరు ప్రవేశించి ప్రజలు నానా కష్టాలు పడ్డారని అన్నారు.

ముఖ్యమంత్రి అమెరికాలో విహార యాత్ర చేస్తుంటే ఇక్కడ మంత్రులు అబద్ధాల ప్రచారంలో మునిగి తేలుతున్నారని దుయ్యబట్టారు. ప్రకాశం బ్యారేజి వద్ద 40 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చన్న మంత్రి అనిల్‌ యాదవ్‌ మాటల ధోరణి చూసి ప్రజలు అసహ్యించుకొంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి వైపు నుంచి ఒక్క సమీక్ష లేదని, మంత్రులు వరద ప్రాంతాలను వదిలివేసి చంద్రబాబు నివాసం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారని విమర్శించారు.

ప్రకాశం బ్యారేజి వద్ద మూడు టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉంటే నాలుగున్నర టీఎంసీల నీటిని నిల్వ చేశారని బుచ్చయ్య చౌదరి విమర్శించారు. 2009లో ప్రకాశం బ్యారేజి వద్దకు 11 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు కూడా వాటిల్లని నష్టం ఇప్పుడు కేవలం ఆరేడు లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తేనే చోటు చేసుకుందన్నారు. సకాలంలో స్పందించకపోవడం వల్ల రాయలసీమలో వాడుకోవడానికి అవకాశం ఉన్న 80 టీఎంసీల నీటిని వాడుకోలేకపోయారన్నారు. ‘‘పోతిరెడ్డిపాడు కాల్వ నుంచి నీటిని సీమకు పంపలేకపోయిందని అందరూ బాధపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వమేమో... అక్కడ నుంచి నీటిని ఎక్కువ తీసుకొన్నామంటూ కృష్ణా నదీ బోర్డుకు ఫిర్యాదు చేసింది.

అటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని నమ్మి అక్కడ ఉమ్మడి ప్రాజెక్టులు కడతామనే సీఎం జగన్‌ తెలివితేటలను ఏం అనాలో అర్థం కావడం లేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. వరద ప్రాంతాల్లో ప్రజలు మంచినీరు దొరక్క అల్లాడుతుంటే మంత్రులు మినరల్‌ వాటర్‌కు వెంపర్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో సగం జిల్లాలు ముంపులో ఉంటే సగం జిల్లాలు కరువులో ఉన్నాయని రామానాయుడు పేర్కొన్నారు.

సాగునీటి అధికారుల్లో సగం మంది తెలంగాణతో ఉమ్మడి ప్రాజెక్టు పనిపై హైదరాబాద్‌లో కూర్చుంటే... మిగిలిన సగం మంది రివర్స్‌ టెండరింగ్‌ పనుల్లో తిరుగుతున్నారని ఆయన విమర్శించారు. కృష్ణా, గోదావరి వరదల్లో వేల ఇళ్ళు మునిగిపోతే ఇళ్ళుఖాళీ చేయాలని వారికి ఎవరికీ నోటీసులు ఇవ్వకుండా కేవలం చంద్రబాబు ఒక్కరికే ఇచ్చారని అన్నారు. ఈ పరిస్థితులన్నీ గవర్నర్‌కు వివరించామన్నారు. సావధానంగా విన్న గవర్నర్‌ దీనిపై అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారన్నారు.

No comments:

Post a Comment