Thursday, April 16, 2020

‘ఆంగ్లమయం’ చెల్లదు! - జగన్‌ ప్రభుత్వానికి హైకోర్టు షాక్‌

‘ఆంగ్లమయం’ చెల్లదు! - జగన్‌ ప్రభుత్వానికి హైకోర్టు షాక్‌

81, 85 జీవోలు రద్దు

ప్రాథమిక దశలో మాధ్యమాన్ని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేనేలేదు. మాతృభాషలో బోధనతో భయాందోళనలు దూరం. పిల్లలు స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తీకరిస్తారు. ఆంగ్ల మాధ్యమంలో చదవాలని నిర్బంధించడం భావ వ్యక్తీకరణ, ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే.

- హైకోర్టు ధర్మాసనం

ఇంగ్లీషు మీడియం జీవోలు రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధం
19(1)జీ అధికరణ ఉల్లంఘనే.. విద్యాహక్కు చట్టానికి కట్టుబడాల్సిందే
మాధ్యమం ఎంపిక విద్యార్థి హక్కు.. ఆ హక్కు తల్లిదండ్రులకూ ఉంది
రాష్ట్ర విద్యా చట్టం ప్రకారం మాతృభాషలోనే విద్యాబోధన
బిల్లును రాష్ట్రపతి ఆమోదించకముందే ఉత్తర్వులు సరికాదు: హైకోర్టు

అమరావతి, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి):  తెలుగు మీడియం ఎత్తివేసి ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలనుకున్న జగన్‌ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పూర్తిగా ఆంగ్లమాధ్యమం అమలు చేయాలన్న నిర్ణయాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. తాము తీసుకొచ్చిన విద్యాహక్కు చట్ట నిబంధనలకు రాష్ట్రప్రభుత్వాలు కట్టుబడి ఉండాల్సిందేనని, కానీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందన్న కేంద్రప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. అన్ని విద్యాలయాల్లో ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టి, తెలుగు మాధ్యమంలో చదువుకోవాలని భావించే విద్యార్థుల కోసం మండలానికొక పాఠశాల ఏర్పాటు చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనతో హైకోర్టు ఏమాత్రం సంతృప్తి చెందలేదు.

ఆంగ్ల మాధ్యమం అమలుతో రాష్ట్రంలో సామాజిక న్యాయం జరుగుతుందంటూ కొంతమంది పిటిషనర్లు చేసిన వాదనను సైతం తోసిపుచ్చింది. ఇంగ్లీషు మీడియంలోనే విద్యాభ్యాసం చేయాలంటూ విద్యార్థుల్ని నిర్బంధించలేరని తేల్చి చెప్పింది. అలా చేయడమంటే విద్యాహక్కు చట్ట నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా వ్యవహరించడమేనని విస్పష్టంగా ప్రకటించింది. ప్రభుత్వం జారీచేసిన 81, 85 నంబరు జీవోలు రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. ఈ జీవోలు జారీ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పింది. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 1-6 వరకు ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేసేందుకు అనువుగా రాష్ట్రప్రభుత్వం గత నవంబరులో తీసుకొచ్చిన ఈ జీవోలను కొట్టివేసింది.

ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.జయసూర్యలతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలు బాలల హక్కుల్ని హరించేలా ఉన్నాయని.. వాటిని రద్దు చేయాలని అభ్యర్థిస్తూ తూర్పు గోదావరి జిల్లా రావిపాడుకు చెందిన బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి సుధీష్‌ రాంభొట్ల, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గుంటుపల్లి శ్రీనివాస్‌ వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం ఇరువైపుల వాదనలు ఆలకించి.. గత ఫిబ్రవరి 14వ తేదీన తీర్పును రిజర్వు చేసింది. 92 పేజీల తీర్పును బుధవారం వెల్లడించింది.

మహనీయుల అభిప్రాయాలు..

మాతృభాషపై స్వామి వివేకానంద, మహాత్మాగాంధీ, రవీంద్రనాధ్‌ ఠాగూర్‌, బాలగంగాధర్‌ తిలక్‌, గోపాలకృష్ణ గోఖలే, డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌, నెల్సన్‌ మండేలా తదితరులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను ధర్మాసనం తన తీర్పులో ప్రస్తావించింది. ‘సమాచారం, ఆలోచనలు, జ్ఞాన మార్పిడికి మాతృభాష ఉత్తమ మాధ్యమం. మాతృభాషలో భావనను సులభంగా గ్రహించడంతో పాటు వ్యక్తీకరించవచ్చు. మాతృభాషలో బోధన.. జ్ఞానసముపార్జనకు సత్ఫలితాలను ఇస్తుంది. మాతృభాషలో పిల్లవాడు సులభంగా గ్రహించగలడు. మాతృభాషలో కాకుండా ఇతర భాషలో విద్యాబోధన పాపం. ఇది వారి మానసిక వికాసంపైనా ప్రభావం చూపుతుంది’ అంటూ ప్రఖ్యాత వ్యక్తులు చెప్పిన మాటలను ఽగుర్తు చేసింది. భారత రాజ్యాంగంలోని అధికరణ 19(1) ప్రకారం వాక్‌ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ ఉందని.. ఆ మేరకు బోధనా మాధ్యమంగా మాతృభాష.. లేదా మరెందులోనైనా ఎంపిక చేసుకునే హక్కుందని పేర్కొంది. అదే విధంగా విద్యార్థికి ప్రాథమిక విద్యాభ్యాసంలో మాధ్యమాన్ని ఎంపిక చేసుకునే హక్కుందని తేల్చిచెప్పింది. అంతేగాక వృత్తిని, వ్యాపారాన్ని ఎంచుకునే హక్కును రాజ్యాంగం కల్పిస్తోందని, అయితే ప్రభుత్వ జీవోలతో అన్ని పాఠశాలల యాజమాన్యాలు మాధ్యమాన్ని ఆంగ్లంలోకి మార్చాలనడం అధికరణ 19(1)జీని ఉల్లంఘించడమేనని పేర్కొంది. విద్యా సంస్థల ఏర్పాటు హక్కు, దానిని నిర్వహించుకునే హక్కును భాష, మతం పేరుతో తీసేయడానికి ఏమాత్రం వీల్లేదని పేర్కొంది. సిలబస్‌, మాధ్యమాన్ని నిర్ణయించే అధికారం ఏపీ విద్యా చట్టం-1982 ప్రకారం ఎన్‌సీఈఆర్‌టీకే ఉంటుందని తెలిపింది. అందులోని సెక్షన్‌ 7 (3) (4) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా విద్యను మాతృభాషలోనే అందించాల్సిందేనని పేర్కొంది. ప్రాథమిక దశలో పాఠశాల బోధనా మాధ్యమాన్ని మార్చే అధికారం రాష్ట్రప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పింది. ‘ఏపీ విద్యాహక్కు చట్ట నిబంధనలకు సవరణలు ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది.

ఒకటి నుంచి 6వ తరగతి వరకు తెలుగు నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని మార్చడానికి జీవో జారీ చేసింది. అయితే జీవో జారీ చేశాక 2019 డిసెంబరు 16వ తేదీన 1982 చట్టానికి సవరణ ప్రతిపాదించారు. ఆ సవరణకు రాష్ట్రపతి నుంచి ఇప్పటి వరకూ ఆమోదం రాలేదు. బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపకముందే జీవో జారీ చేయడం సరికాదు. అందువల్ల ఆ సవరణ.. చట్టంలో భాగం కాదు. ఏదైనా నిబంధన సవరణకు సంబంధించి రాష్ట్రపతి అనుమతి వచ్చే వరకు మునుపటి చట్టమే అమలులో ఉంటుంది. ఆ మేరకు విద్యాహక్కు చట్టం ప్రకారం బోధనా మాధ్యమం మాతృభాషలోనే ఉండాలి’ అని తెలిపింది.

రాష్ట్రాలు కట్టుబడాల్సిందే..

‘కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన విద్యాహక్కు చట్ట నిబంధనలకు రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉండాల్సిందే. విద్యాహక్కు చట్టంలో కనీసం 8వ తరగతి వరకైనా మాతృభాషలోనే విద్యాభ్యాసం జరగాలని ఉంది. తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా తొలగించి ఆంగ్ల మాధ్యమాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టడం విద్యాహక్కు చట్ట నిబంధనలకు విరుద్ధంగా నడచుకోవడమే. సిలబస్‌, మాధ్యమ బోధన గురించి నిర్ణయించాల్సింది అకడమిక్‌ అథారిటీ. ఆ అథారిటీతో సంబంధం లేని పాఠశాల విద్యా కమిషనర్‌ ప్రతిపాదన ఆధారంగా ఆంగ్ల మాధ్యమం ఎలా అమలు చేస్తారు? జాతీయ విద్యావిధానం, విద్యాహక్కు నిబంధనలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రప్రభుత్వ జీవోల చట్టబద్ధతను తేల్చాల్సి ఉంది. తెలుగు అధికారభాషగా ఉన్న రాష్ట్రంలో తెలుగు మాధ్యమం లేకుండా చేయడం సరి కాదు’ అన్న కేంద్రప్రభుత్వ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. ‘1982 చట్ట నిబంధనలు మార్చడానికి వీల్లేదని, ఆ ఆధికారం తమకు లేదని రాష్ట్ర ప్రభుత్వానికి బాగా తెలుసు. అందుకే వారు ఆ చట్టంలోని సెక్షన్‌ 7 (3)(4), సెక్షన్‌ 99లకు సవరణ ప్రతిపాదించారు. అన్నీ తెలిసే ఉద్దేశపూర్వకంగా తెలుగు మాధ్యమాన్ని ఆంగ్లంలోకి మారుస్తూ 2019 నవంబరు 20వ తేదీన ప్రభుత్వం జీవో జారీ చేసింది. అందువల్ల తెలుగు నుంచి ఆంగ్లమాధ్యమానికి మార్పును.. చట్టప్రకారం గుర్తించడం కుదరదు. క్లాజ్‌ 3 మేరకు తమ పిల్లల విద్యా విధానాన్ని ఎన్నుకునే హక్కు తల్లిదండ్రులకు ఉంది. పిల్లలకు మాతృభాషలో బోధన.. భయం, ఆందోళన లేకుండా చేస్తుంది. వారు స్వేచ్ఛగా అభిప్రాయాలను వ్యక్తీకరించగలరు.



ఆంగ్ల మాధ్యమంలో చదవాల్సిందేనని నిర్బంధించడం.. మాట్లాడే స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది. రాజ్యాంగం కల్పించిన ఈ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం తీసివేయలేదు’ అని స్పష్టం చేసింది. పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీల అభ్యర్థనల మేరకే ఆంగ్లమాధ్యమాన్ని తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతోందని, అయితే తల్లిదండ్రుల సంఘం తీర్మానంపైనో, తల్లిదండ్రుల ఆకాంక్ష మేరకో ఆధారపడి బోధనా మాధ్యమం మార్పు ఉండదని ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు కారుమంచి ఇంద్రనీల్‌బాబు, అనూప్‌ కౌశిక్‌,  వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. కేంద్రం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ కృష్ణమోహన్‌ వాదనలు వినిపించారు.



ప్రభుత్వం ఏం చెప్పిందంటే?..

‘నిబంధనల మేరకే ఆంగ్లమాధ్యమంపై జీవోలు జారీ చేశాం. అయినా, మాతృభాషకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మైనారిటీ భాషలైన తమిళం, కన్నడం, ఉర్దూ, ఒరియాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. లింగ్విస్టిక్‌ మైనారిటీ పాఠశాలల్లో ఆయా మాధ్యమాలు యథాతథంగా కొనసాగుతాయి. తెలుగు మాధ్యమంలో చదువుకోవాలని భావించే విద్యార్థులకోసం కనీసం మండలానికొక పాఠశాల ఏర్పాటు చేస్తాం. సదరు పాఠశాల సమీపంలో లేనట్లయితే విద్యార్థులు ఆ పాఠశాలకు వెళ్లివచ్చేందుకు ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తాం. ప్రాథమిక దశలో బోధనా మాధ్యమం మాతృభాషలోనే తప్పనిసరిగా ఉండాలని విద్యాహక్కు చట్టం చెబుతోందన్న పిటిషనర్‌ వాదన వాస్తవ విరుద్ధం. ఆచరణ సాధ్యం మేరకు మాతృభాషలో అని మాత్రమే పేర్కొన్నారు. పాఠశాల మేనేజ్‌మెంట్‌ కమిటీల నుంచి సుమారు 48 వేల తీర్మానాలు రాగా.. అందులో 97 శాతం ఆంగ్లమాధ్యమం కావాలని అభ్యర్థనలు ఉన్నాయి. రాష్ట్ర విద్యాచట్టంలో సవరణ చేస్తూ బిల్లు పంపించాం. రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాం’ అని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం వాదనలు వినిపించారు.

No comments:

Post a Comment