Wednesday, April 15, 2020

’ఆంగ్ల మాధ్యమం’పై ఆద్యంతం సర్కారు తీరు

ఎవరేమన్నా డోన్ట్‌కేర్‌!
నా మాటే వేదం.. కాదంటే ఎదురుదాడే!
’ఆంగ్ల మాధ్యమం’పై ఆద్యంతం సర్కారు తీరు

అమరావతి, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టే విషయంలో నా మాటే వేదం.. మరో మాటకు తావులేదు.. అది సర్వోన్నత న్యాయస్థానం తీర్పయినా.. విద్యా హక్కు చట్టం తాలూకు సిపారసు అయినా.. డోన్ట్‌ కేర్‌! కాదంటే ఎదురు దాడేనన్నట్లుగా ముఖ్యమంత్రి వై.ఎ్‌స.జగన్‌ ప్రభుత్వ ధోరణి ఉందని.. ఈ నేపథ్యంలో బుధవారం రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు సర్కారుకు చెంపపెట్టేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం.. ప్రాథమిక విద్య బోధన మాతృభాషలోనే జరగాలి. 8వ తరగతి వరకు పిల్లలకు స్థానిక మాతృభాషలోనే బోధించాలని జాతీయ నూతన విద్యా విధానం కూడా చెబుతోంది. 1968, 1986 సంవత్సరాల్లో రూపొందించిన విధానాల్లోనూ ఇదే విషయం చెప్పారు. ఆంగ్ల మాధ్యమంతో పాటు సమాంతరంగా తెలుగు మాధ్యమం.. అంటే రెండూ ఉండాలని రాజకీయ పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయల ఎమ్మెల్సీలు సూచించారు.



ADVERTISEMENT

Learn More
POWERED BY PLAYSTREAM


ఇప్పటి వరకు తెలుగులో చదివిన విద్యార్థులను ఒకేసారి ఆంగ్ల మాధ్యమంలోకి మారిస్తే విద్యా ప్రమాణాలు పడిపోతాయని, పేద పిల్లలు బడి మానేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు భాషావేత్తలు, విద్యావేత్తలు, శాస్త్ర వేత్తలు సైతం మాధ్యమాన్ని పిల్లలే ఎంచుకునే  అవకాశం ఉండాలని సూచించారు. కానీ ఇవేమీ ప్రభుత్వం పట్టించుకోలేదు. సరి కదా .. ఎదురు దాడే చేసింది. మీ పిల్లలు ఏ మీడియంలో చదివారంటూ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఇలా అందరిపైనా స్వయంగా జగన్‌ ఎదురుదాడి చేయడం గమనార్హం. అసెంబ్లీలోనూ ఇదే వైఖరి. పేద పిల్లలకు ఇంగ్లీష్‌ చదువులు అవసరం లేదా అని కూడా ప్రశ్నించారు. ఆంగ్ల మాధ్యమానికి టీడీపీ వ్యతిరేకమని కూడా ఆరోపించారు. బిల్లు పెట్టి శాసనసభలో ఆమోదించుకున్నారు.



శాసనమండలిలో చుక్కెదురైనా పట్టించుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మాతృ భాషాభిమానులు, సంస్థలు నిరసనలు తెలిపినా.. వారి అభిప్రాయాలు తెలుసుకోవడానికి కనీసం వారితో చర్చలు కూడా నిర్వహించలేదు. పైగా ఆంగ్ల మాధ్యమమే కావాలంటూ పాఠశాలల తల్లిదండ్రుల కమిటీలతో బలవంతంగా తీర్మానాలు చేయించి ప్రభుత్వానికి పంపించేలా చేశారు. ఆయా తీర్మానాలను జిల్లాల వారీగా పెట్టెల్లో జమ చేసి హైకోర్టుకు చూపించారు. ఒకేసారి అన్ని పాఠశాలల్లోనూ ఆంగ్ల మాధ్యమాన్ని ఎలా ప్రవేశ పెడతారంటూ హైకోర్టు ప్రశ్నించడంతో.. ప్రతి మండలంలోనూ ఒక పాఠశాలలో తెలుగు మాధ్యమం ఉండేలా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.



కోట్ల రూపాయల వ్యయం

ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం స్థానంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలన్న ఉత్తర్వులు .. తమ ఆదేశాలకు లోబడి ఉంటాయని 2019 డిసెంబరు 20న హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఆంగ్ల మాధ్యమం అమల్లో భాగంగా ఉపాధ్యాయులకు శిక్షణ, ఆంగ్ల మాధ్యమంలో పాఠ్యపుస్తకాల ముద్రణ తదితర చర్యలకు ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేస్తే బాధ్యులైన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించింది. అంతేగాక ఆ సొమ్మును వారి నుంచే రాబడతామని కూడా తేల్చిచెప్పింది. ప్రభుత్వం వద్ద డబ్బులేని పరిస్థితిలో సొమ్ము వృధా చేయడమెందుకని కూడా నిలదీసింది. ఈ విషయమై విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌, సర్వశిక్షా అభియాన్‌ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌లకు నోటీసులు జారీచేసింది.

ప్రాథమికంగా చూస్తే ప్రభుత్వ ఉత్తర్వులు విద్యా హక్కు చట్టానికి , సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. విచారణ పూర్తి కాకుండానే ఎస్‌సీఈఆర్‌టీ కేంద్రంగా 1-6 తరగతుల పాఠ్యపుస్తకాలన్నీ ఆంగ్ల మాధ్యమంలోనే రూపకల్పన చేశారు. ముద్రణకు అంతా సిద్ధం చేశారు.ఇందుకోసం రూ.లక్షల్లో ఖర్చు చేశారు. కోర్టు సూచనల్ని బేఖాతర్‌ చేశారు.  ఉపాధ్యాయులకు శిక్షణ వద్దని చెప్పినా పట్టించుకోలేదు. అయితే టీచర్లకు శిక్షణ పేరును ‘లెర్నింగ్‌ ఎన్‌హేన్సింగ్‌ ప్రోగ్రామ్‌’ అని మార్చారు. ప్రతి జిల్లాకు 20-25 మందికి, ప్రతి మండలానికి నలుగురు ఉపాధ్యాయులకు తొలుత ఆంగ్ల మాధ్యమంలో మూడు బ్యాచ్‌ల వారీగా చేసి శిక్షణ ఇచ్చారు. మాడ్యూల్స్‌, వర్క్‌ షీట్‌లను తయారుచేసి అందజేశారు. సుమారు 80 వేల మంది టీచర్లకు ఇప్పటివరకు శిక్షణ ఇచ్చినట్లు సమాచారం. శిక్షణ ఇచ్చిన వారికి, శిక్షణ తీసుకున్న వారికి కలిపి దాదాపు రూ.2.5 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. 

No comments:

Post a Comment