Thursday, July 4, 2019

నన్ను వెంటాడడమే పని! - బాబు

నన్ను వెంటాడడమే పని!
05-07-2019 03:43:18


అదే జగన్‌ ధ్యేయం.. టీడీపీ నేతలపై కక్ష సాధింపులు
గుంటూరు ఆఫీసుకూ నోటీసులిచ్చే యత్నం
చేతగాక ప్రతిదీ మాకు అంటకడతారా?
చెప్పిందల్లా నమ్మడానికి ప్రజలు అమాయకులు కాదు
ఐదేళ్లలో విత్తన సమస్య రాలేదు.. మళ్లీ విద్యుత్‌ కోతలు
ప్రజావేదిక కూల్చివేతతో వైసీపీ పతనం.. బాబు ఆగ్రహం
గుంటూరు/ఒంగోలు/అమరావతి, జూలై 4 (ఆంధ్రజ్యోతి): తనను వెంటాడడమే ధ్యేయంగా సీఎం జగన్‌ వ్యవహరిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. తమ పార్టీ నేతలపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. పాలన చేతగాక ప్రతి సమస్యను గత ప్రభుత్వానికి అంటగట్టాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రజావేదిక కూల్చివేతతోనే వైసీపీ పతనం ప్రారంభమైందని.. ఇప్పుడు గుంటూరు టీడీపీ కార్యాలయానికి నోటీసులు ఇవ్వాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. గురువారం గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సీనియర్‌ నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.

టీడీపీ కేడర్‌ను టార్గెట్‌ చేయడమే పనిగా పెట్టుకున్నారని.. ప్రశాంతంగా ఉండే కుప్పంలో కూడా బ్యానర్లపై రగడ చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వైసీపీ నేతలు ఏది చెబితే అది నమ్మడానికి ప్రజలు అమాయకులు కాదన్నారు. తమ హయాంలో ఒక్కసారి కూడా విత్తనాలు, ఎరువుల సమస్యల లేకుండా చూశామన్నారు. రైతులు రోడ్డెక్కడానికి టీడీపీ ప్రభుత్వమే కారణమని మంత్రులు, వైసీపీ నాయకులు అనడం విడ్డూరంగా ఉందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లో విద్యుత్‌ కోతలు లేకుండా చేశామని.. వైసీపీ వచ్చిన నెల రోజుల్లో కరెంటు కోతలు పునఃప్రారంభమయ్యాయని విమర్శించారు. సమస్యల్లో ఉన్న రైతులకు సంఘీభావం తెలిపాలని నిర్ణయించామని.. రైతుల సమస్యలపై మాజీ మంత్రి సోమిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ తరఫున ప్రత్యేక కమిటీని నియమించినట్లు చంద్రబాబు తెలిపారు. విత్తనాల కొరత, విద్యుత్‌, సాగునీటి కొరత, కరువు పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో కమిటీ పర్యటిస్తుందన్నారు. రైతు సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు.

నేడు రుద్రమాంబపురానికి బాబు
దాడులకు గురైన కార్యకర్తలకు నేతలు అండగా ఉండాలని చంద్రబాబు పిలుపిచ్చారు. శుక్రవారం ప్రకాశం జిల్లాకు, 9న అనంతపురం వెళ్లి దాడులకు గురైన కార్యకర్తలను పరామర్శిస్తానన్నారు. గతనెల 25న ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం చినగంజాం మండలం రుద్రమాంబపురంలో వైసీపీ వర్గీయుల దాడితో మనస్తాపంచెంది టీడీపీ క్రియాశీల కార్యకర్త బసంగారి పద్మ ఆత్మహత్య చేసుకుంది. ఆ కుటుంబాన్ని పరామర్శించి జిల్లాలో టీడీపీ కార్యకర్తలకు భరోసా కల్పించేందుకు ఆయన జిల్లాకు వస్తున్నారు. ఆయన రాక నేపథ్యంలో టీడీపీ చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం గురువారం రుద్రమాంబపురం సందర్శించి స్థానిక టీడీపీ కార్యకర్తలతో మాట్లాడారు.

No comments:

Post a Comment