Thursday, July 4, 2019

ఒకే విషయాన్ని చాలాసార్లు ప్రస్తావించిన చంద్రబాబు (చిత్తూరు కుప్పం పర్యటనలో)

ఒకే విషయాన్ని చాలాసార్లు ప్రస్తావించిన చంద్రబాబు (చిత్తూరు కుప్పం పర్యటనలో)
7/4/2019 9:53:06 AM

- ‘స్థానిక’ సమర సన్నాహం!
- దాడులకు తెగబడే ప్రతిపక్షానికి హెచ్చరికలు
- భిన్న రీతిలో సాగిన చంద్రబాబు పర్యటన
కుప్పం, జూలై 3: మాజీ ముఖ్యమంత్రి, కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు రెండురోజుల కుప్పం పర్యటన పలు విశేషాలతో సాగింది. రాష్ట్రంలో కొనసాగుతున్న దాడుల నేపథ్యంలో ఒకవైపు కార్యకర్తలకు భరోసా కల్పిస్తూనే, మరోవైపు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తానంటూ ప్రజలకు నమ్మకం కలిగించడానికి ప్రయత్నించారు. ఓటమితో కుంగిపోయి, ఇక్కడే ఆగిపోరాదని, పోరాడుతూ పోతే.. భవిష్యత్తు మనదేనని భరోసా కల్పించారు. ఓటమి షాక్‌నుంచి కోలుకోలేక, ఘోరమైన ఓటమిని జీర్ణించుకోలేక వలవలా ఏడ్చేసిన పార్టీ వీరాభిమానులను భుజం తట్టి ఓదార్చారు.

తన సహజశైలికి భిన్నంగా, ఏమాత్రం ఆవేశం లేకుండా ఎక్కడ ఏది ఎంతదాకా మాట్లాడాలో అంతదాకానే మాట్లాడుతూ ముందుకు సాగారు. కేవలం నాలుగంటే నాలుగే సమావేశాలు.. అది కూడా రెండు బహిరంగ సభలు, మరో రెండు కార్యకర్తల మీటింగులు పెట్టి వారినీ, వీరినీ పలకరించి తనను కుప్పం నుంచి గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. నాయకుల వ్యవహారశైలిపై ఫిర్యాదులు చేయబోయిన కార్యకర్తలను సమాధానపరిచి ప్రతిపక్షంలో ఉన్నపుడు నిందలు వేసుకుంటూ పోతే పనికాదని, అందరం కలిసి పార్టీ పటిష్ఠానికి కృషి చేస్తేనే ఎవ్వరికైనా మనుగడ ఉంటుందని ఉద్బోధించారు. మొత్తంమీద త్వరలోనే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమరంవైపుగా సమాయత్తం చేశారు చంద్రబాబు.

ఎన్నికలు ముగిసిన తర్వాత కుప్పం నుంచే ప్రజా క్షేత్రంలోకి అడుగు పెట్టిన చంద్రబాబు కుప్పం సమస్యలతో మొదలు పెట్టి దేశ, రాష్ట్ర పరిణామాలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులు ,తానందించిన సుపరిపాలన వంటి అంశాలనన్నింటినీ తన ప్రసంగాల్లో స్పృశించారు. పార్టీని బలోపేతం చేసుకోకుంటే మనుగడ లేదని, ప్రజలకు సైతం సుపరిపాలన అందించే మనసు, నీతి నిజాయితీలు తనకున్నాయని నమ్మబలికారు. ఎప్పుడూ ఎక్కడా తాను తప్పు చేయలేదని, కమిటీలు, ప్రజావేదిక, ఇళ్ల కూల్చివేతల వంటి వేధింపులు ఏమీ చేయలేవని దీటుగా చాటారు. ఇకమీదట ప్రజల్లోనే ఉంటానంటూ సొంత నియోజకవర్గమైన కుప్పం నుంచి ప్రకటించడం ద్వారా తాను ఎవరికీ భయపడేది లేదని, పార్టీ శ్రేణులు కూడా ధైర్యంగా ముందుకు సాగాలన్న సందేశాన్నిచ్చారు.

ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ఇంకా సమయముందంటూనే కార్యకర్తలపై దారుణమైన దాడులు జరుగుతుండడం, ఆరుగురు కార్యకర్తలను చంపేయడం వంటి అంశాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఎక్కడా పోరాటమనే మాట వాడకున్నా ప్రజల్లో చైతన్యం తేవడం ద్వారా అనుకున్న కార్యాన్ని వారే సాధించేలా ప్రజల్లోకి దూసుకుపోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆటు ప్రజలకు, ఇటు కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఎక్కడికైనా వచ్చి వారికి అండగా నిలబడతానంటూ ధైర్యం నూరిపోయడానికి ప్రయత్నించారు.

కుప్పంలో చంద్రబాబుకు 1989 తర్వాత మొన్న జరిగిన ఎన్నికల్లోనే అతి తక్కువ మెజారిటీ వచ్చింది. ఈ అంశాన్ని తన ప్రసంగాల్లో చాలాసార్లు ప్రస్తావించిన ఆయన.. ఇటు ప్రజలపైన, అటు స్థానిక నాయకులపైన నిష్టూరపోయారు. అయితే ఎప్పటిలా.. దానికి కారకులంటూ ఎవరిపైనా నిందలు వేయలేదు. జరగాల్సింది జరిగిపోయిందన్నారు. రాష్ట్రంలోనే ఘోర ఓటమి చెందాల్సి వచ్చిందంటూ, ఇప్పుడు నిందలు వేయడానికి రాలేదని, ఎవరికివారే ఎక్క డ తప్పు జరిగిందో తెలుసుకుని సరిదిద్దుకోవాలని హితవు పలికారు.

ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత అధైర్యపడిపోయిన పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చిన చంద్రబాబు, త్వరలోనే జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు వారిని సమాయత్తపరిచారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు గెలుపు గుర్రాలను రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబెట్టి గ్రామస్థాయిలో గట్టి పునాది వేసుకోవాలన్నారు. అందుకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలన్నారు.

No comments:

Post a Comment