Sunday, November 10, 2019

ఆంగ్లం ఆరు వరకే మీడియం ఉత్తర్వులో మార్పు

ఆంగ్లం ఆరు వరకే మీడియం ఉత్తర్వులో మార్పు

ఆరు వరకే ఆంగ్లం!
10-11-2019 03:22:36

‘మీడియం’ ఉత్తర్వులో మార్పు.. తొలిదశలో 1 నుంచి 6 వరకు
అమలుకు సీఎం ఆదేశాలు
తర్వాతి దశలపై లేని స్పష్టత
పెదవి విరుస్తున్న భాషావేత్తలు
వెనుకడుగుగా భావించబోం
మరో గందరగోళ నిర్ణయమే
టీచర్లకు శిక్షణ, ఖర్చు నుంచి
వెసులుబాటుకే క్లాసుల కుదింపు
తెలుగు సంఘాల స్పష్టీకరణ
అమరావతి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఆంగ్ల మాధ్యమంలో బోధనపై రాష్ట్రప్రభుత్వం తన నిర్ణయంలో మార్పు చేసింది. ఉత్తర్వుల్లో ఎనిమిదోతరగతి వరకు అని నిర్దేశించగా, ప్రస్తుతానికి ఆరో తరగతి వరకు వాటిని పరిమితం చేయాలని నిర్ణయించింది. మొదటి దశలో భాగంగా 1 నుంచి 6వ తరగతి వరకూ ఇంగ్లిష్‌ మీడియంలో బోధించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శనివారం ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు. ఆ తర్వాత దశల గురించి ఆయన స్పష్టత ఇవ్వలేదు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధనను తప్పనిసరి చేస్తూ ఈ నెల 5న ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వం తన నిర్ణయాన్ని పాక్షికంగా సడలించింది. అయితే, ఇది మరో గందరగోళ నిర్ణయం తప్ప మరేమీ కాదని భాషాభిమానులు అభిప్రాయపడుతున్నారు. తెలుగుకు తలెత్తిన ముప్పు తాజా సవరణతో కొంతైనా తొలగినట్టు కాదని, ఈ నిర్ణయాన్ని సర్కారు మెట్టు దిగడంలా భావించడంలేదని తెగేసి చెబుతున్నారు.

భాషోద్యమం తెచ్చిన ఒత్తిడిగా కూడా చూడటం లేదన్నారు. 7, 8 క్లాసులకే ప్రస్తుతానికి ఇంగ్లిష్‌ మీడియం అమలుచేసి, 1-6తరగతి వరకు తరువాత ఆలోచిస్తామని ఉంటే.. భాషోద్యమం కొంత ఫలితం సాధించినట్టు భావించడానికి వీలుండేదని వివరించారు. ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడానికి ముందుగా టీచర్లకు భారీఎత్తున చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లు, శిక్షణలో కొంత వెసులుబాటు పొందేందుకే ఇంగ్లిష్‌ మీడియం అమలుచేసే క్లాసులను తొలిదశలో తగ్గించిందని వివరించారు. దీనివల్ల తర్ఫీదు పొందే టీచర్లసంఖ్య, దానివల్ల ఖర్చు కూడా తగ్గుతాయని గుర్తుచేస్తున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతివరకు పిల్లలకు మాతృభాషలోనే బోధన చేయాలనేది మౌలిక సిద్ధాంతమని, ఆ మేరకు ప్రభుత్వంలో ఇంతవరకు పునరాలోచనే కనిపించడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాగా, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్‌ ల్యాబ్‌లను ‘నాడు-నేడు’ లో భాగంగా ఏర్పాటు చేయాలని ఇదే భేటీలో సీఎం ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎ్‌సఈ, ఐసీఎస్‌ఈ విధానాలను పాటించాలని సూచించారు.

బేషజానికి పోవద్దు: పీడీఎఫ్‌
నిర్బంధ ఆంగ్ల మాధ్యమాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, రెండు మాధ్యమాలనూ కొనసాగించాలి’ అని ప్రోగ్రెసివ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (పీడీఎఫ్‌)... ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ విషయంలో బేషజానికి పోరాదని, చేసిన తప్పును సరిదిద్దుకోవాలని సూచించింది. ప్రాథమిక విద్య (1- 5 తరగతులు) వరకు మాతృభాషలో బోఽధన జరగాలని అందరూ కోరుతుంటే.. అందుకు విరుద్ధంగా 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం ఎంతవరకు సమంజసమని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, కేఎస్‌ లక్ష్మణరావు, వై.శ్రీనివాసులు రెడ్డి ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ‘‘మంచి విద్యను బోధించడమంటే మాధ్యమాన్ని మార్చి చేతులు దులుపుకోవడం కాదు.

ఢిల్లీ, కేరళలో మాదిరిగా పాఠశాలల్ని, బోధన విధానాల్ని అత్యాధునికంగా తీర్చిదిద్దాలి. వివక్షను రూపుమాపడం అంటే అందరు పిల్లలూ ఒకచోట చదువుకునే కామన్‌ స్కూలు విధానం తెచ్చేలా రాజకీయ ప్రధాన అజెండాలోకి విద్యా రంగాన్ని తీసుకుని రావాలి. సగానికి సగం ప్రాథమిక పాఠశాలల్ని దాదాపు ఎస్సీ, ఎస్టీ కాలనీల స్కూళ్లను ఏకోపాధ్యాయ పాఠశాలుగా మార్చి ‘ఆంగ్లాన్ని తప్పనిసరి చేశాం.. ఇంకేం కావాలి’ అనడం విడ్డూరంగా ఉంది. ప్రభుత్వం ఈ ఉత్తర్వులను తక్షణం ఉపసంహరించుకోవాలి. రెండు మాధ్యమాలను కొనసాగించాలి. ఈ రెండు డిమాండ్లు నెరవేరే వరకు పోరాడతాం’’ అని స్పష్టం చేశారు.

No comments:

Post a Comment