Thursday, June 20, 2019

బీజేపీ గూటికి ఏపీ టీడీపీ ఎంపీలు?

బీజేపీ గూటికి ఏపీ టీడీపీ ఎంపీలు?
Jun 20, 2019, 03:53 IST
 TDP MPs Have Been In Touch With BJP Supremo Says Sources - Sakshi
పార్టీని వీడేందుకు ఐదుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు సిద్ధం

అదే దారిలో లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని కూడా..

రాం మాధవ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిలతో సంప్రదింపులు పూర్తి

రాజ్యసభలో బలం పెంచుకునే వ్యూహంతో సరేనన్న కమలనాథులు

నిట్టనిలువుగా చీలనున్న టీడీపీపీ

హస్తిన కేంద్రంగా మారుతున్న రాజకీయ సమీకరణలు

సాక్షి, ఢిల్లీ / అమరావతి: ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై తిరుగుబాటు జెండా ఎగురవేసేందుకు ఆ పార్టీ మెజార్టీ రాజ్యసభ సభ్యులు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే చంద్రబాబు, టీడీపీ నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా వారితో జట్టు కట్టనున్నారా? అనే ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు టీడీపీ ఎంపీలు కొద్ది రోజులుగా బీజేపీ అధిష్టానం ప్రతినిధులతో టచ్‌లో ఉన్నారు. పార్టీని వీడి వీరంతా మూకుమ్మడిగా బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికల్లో మట్టి కరిచిన టీడీపీపై చంద్రబాబు దాదాపుగా పట్టుకోల్పోయినట్టు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

రాష్ట్రంలో టీడీపీకి ఇక భవిష్యత్తు లేదనే నిర్ధారణకు వచ్చిన ఆ పార్టీ ఎంపీలు తిరుగుబాటుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు  సమాచారం. ఢిల్లీ కేంద్రంగా ఇందుకు సన్నాహాలు దాదాపుగా పూర్తయ్యాయి. ఈమేరకు టీడీపీ పార్లమెంటరీ పార్టీ త్వరలో చీలిపోనుందని తెలుస్తోంది. టీడీపీకి ప్రస్తుతం ఉన్న ఆరుగురు రాజ్యసభ సభ్యుల్లో ఒక్కరు మినహా మిగిలిన ఐదుగురు  కొద్ది రోజులుగా బీజేపీ అధిష్టానం ప్రతినిధులతో చర్చలు జరుపుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహనరావు, తోట సీతారామలక్ష్మి టీడీపీని వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వారితో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయని సమాచారం. టీడీపీ రాజ్యసభ సభ్యుల్లో ప్రస్తుతానికి ఒక్క రవీంద్రకుమార్‌ మినహా మిగిలిన వారందరూ బీజేపీలో చేరాలని మూకుమ్మడిగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

దారి చూపించిన ఎంపీ కేశినేని
టీడీపీలో చీలికకు విజయవాడ ఎంపీ కేశినేని నాని దారి చూపించారని తెలుస్తోంది. ఎన్నికల్లో టీడీపీ దారుణ పరాజయం చెందిన వెంటనే కేశినేని నాని పార్టీ అధినేత చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అప్పటికే ఆయన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కారీని కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన ఎక్కడా తగ్గకుండా చంద్రబాబుపై విమర్శల జోరు పెంచారు. తద్వారా పార్టీలోని మెజార్టీ నేతల అభిప్రాయాన్ని బహిర్గతం చేశారు. చంద్రబాబుతోపాటు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులపై ఆయన సూటిగా చేసిన విమర్శలు సరైనవేనని టీడీపీ శ్రేణులు సైతం అభిప్రాయపడ్డాయి. ఎంపీ కేశినేని నాని విమర్శలను టీడీపీ రాజ్యసభ సభ్యులు ఎవరూ ఖండించకపోవడం గమనార్హం. అంటే పక్కా ప్రణాళికతోనే టీడీపీ మెజార్టీ ఎంపీలు చంద్రబాబుపై తిరుగుబాటుకు సన్నద్ధమయ్యారని తెలుస్తోంది. ఐదుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులతోపాటు కేశినేని నాని కూడా బీజేపీలో చేరతారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.


మనదారి మనం చూసుకుందాం..
ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ ఎంపీలు ఇటీవల ఢిల్లీలో సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో టీడీపీ ఘోర వైఫల్యానికి చంద్రబాబు వైఖరే కారణమని పార్టీ ఎంపీలు కుండబద్ధలు కొడుతున్నారు. విచ్చలవిడి అవినీతి, ఒంటెత్తు పోకడలతో ఐదేళ్లు నిరంకుశంగా వ్యవహరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయి వాస్తవాలను చెప్పాలని తామెంత ప్రయత్నించినప్పటికీ ఆయన వినిపించుకోలేదని ఎంపీలు అంతర్గత సంభాషణల్లో దుయ్యబడుతున్నారు. కేవలం తన కుమారుడు లోకేశ్‌ను భావి నేతగా తీర్చిదిద్దాలన్న స్వార్థంతో పార్టీ పుట్టి ముంచారని ధ్వజమెత్తుతున్నారు. తిరుగులేని మాస్‌ లీడర్‌గా ఆవిర్భవించిన వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొనే వ్యూహలే లేకుండా పోయాయని పేర్కొంటున్నారు.

ఇక కోలుకోవడం అసాధ్యమే
వైఎస్‌ జగన్‌ అంతటి ప్రజాదరణ ఉన్న నేత టీడీపీలో లేనందున కనీసం ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుందామన్నా చంద్రబాబు వినిపించుకోలేదని ఎంపీలు విమర్శిస్తున్నారు. బీజేపీతో తెగదెంపులు, పవన్‌ కల్యాణ్‌తో లోపాయికారీ పొత్తు రాజకీయంగా టీడీపీని దెబ్బతీశాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఇక కోలుకోవడం అసాధ్యమని ఎంపీలు నిర్ధారణకు వచ్చారు. చంద్రబాబుకు వయోభారం, లోకేశ్‌ అసమర్థత టీడీపీకి ప్రతికూల అంశాలని విశ్లేషిస్తున్నారు. టీడీపీలో ఇంకా కొనసాగడం రాజకీయంగా ఆత్మహత్యా సదృశ్యమని మెజార్టీ ఎంపీలు అభిప్రాయపడ్డారు. బీజేపీ నుంచి సానుకూల సంకేతాలు ఉన్నందున ఆ పార్టీలో చేరడం ఉత్తమమనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బీజేపీలో చేరిక అంశంపై టీడీపీ రాజ్యసభ సభ్యుడు ఒకరిని ‘సాక్షి’ సంప్రదించగా ఆయన స్పందించేందుకు నిరాకరించడం గమనార్హం.

రాజ్యసభ ఎంపీలతో పాటే కేశినేని నాని కూడా..?
20-06-2019 15:30:56

https://www.andhrajyothy.com/artical?SID=824520

న్యూఢిల్లీ: చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగా టీడీపీలో నెలకొన్న రెండు పరిణామాలు ఆ పార్టీ శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. నలుగురు రాజ్యసభ సభ్యులు కమలం గూటికి చేరడానికి మార్గం సుగమం చేసుకోగా... వారి బాటలోనే మాజీ ఎమ్మెల్యేలు కూడా క్యూ కట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. కాకినాడలో టీడీపీ కాపు నేతలంతా సమావేశమై బీజేపీలో చేరే అంశంపై చర్చిస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా మిగిలిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు కనకమేడల, సీతామహాలక్ష్మీని కూడా బీజేపీలోకి చేర్చేందుకు సుజనా, సీఎం రమేష్ మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. రాజ్యసభ ఎంపీలతో పాటు లోక్‌సభ ఎంపీలను కూడా లాక్కునేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆ పార్టీతో టచ్‌లోకి వచ్చినట్లు సమాచారం. ఇటీవల కేంద్రమంత్రి నితిన్ గడ్కరిని ఆయన కలిసొచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే నాని కమలం గూటికి చేరడం ఖాయమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బుధవారమే కుటుంబ సభ్యులతో చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లారు.


టీడీపీలో భారీ సంక్షోభం!
Jun 20, 2019, 14:25 IST
 Four TDP MPs Ready to Join BJP - Sakshi
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీలో ముసలం మొదలైంది. నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీకి వీడనున్నారని ఢిల్లీ నుంచి తాజా సమాచారం. బీజేపీలో చేరే యోచనలో ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహనరావు రాజ్యసభలో తమను ప్రత్యేక బృందంగా గుర్తించాలని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడిని స్వయంగా కలిసి కోరనున్నారు. దీనిపై ఈ సాయంత్రానికి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. తోట సీతారామలక్ష్మి కూడా టీడీపీని వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. టీడీపీ రాజ్యసభ సభ్యుల్లో రవీంద్రకుమార్‌ మినహా మిగిలిన వారందరూ బీజేపీలో చేరాలని నిర్ణయించినట్లు సమాచారం. విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా బీజేపీలో చేరతారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు రహస్యంగా సమావేశమయ్యారు. దాదాపు 20 మంది మాజీ ఎమ్మెల్యేలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో దేని గురించి చర్చించారనేది వెల్లడి కాలేదు. (చదవండి: నిట్టనిలువుగా చీలనున్న టీడీపీపీ)


No comments:

Post a Comment