Tuesday, June 4, 2019

పది రోజుల్లోనే ఇన్ని దాడులా?

పది రోజుల్లోనే ఇన్ని దాడులా?
05-06-2019 03:28:57

టీడీపీ కార్యకర్తలపై దౌర్జన్యాలు బాధాకరం
రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
ప్రభుత్వ నిర్ణయాలపై కొంత కాలం వేచి చూద్దాం
చంద్రబాబు నివాసంలో టీడీపీ నేతల భేటీ
ఎన్నికల ఫలితాలపై ఆత్మపరిశీలన
అమరావతి, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి గత పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తమ కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు చోటు చేసుకోవడం బాధాకరమని తెలుగుదేశం పార్టీ వ్యాఖ్యానించింది. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసంలో మంగళవారం మధ్యాహ్నం పార్టీ నేతలు సమావేశమై వర్తమాన రాజకీయ అంశాలు, ఎన్నికల తర్వాతి పరిణామాలపై చర్చించారు. అనంతరం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఫలితాలు వెలువడ్డాక పలుచోట్ల టీడీపీ కార్యకర్తలపై దాడులు చేయడాన్ని, ఆస్తులు ధ్వంసం చేయడాన్ని ఖండిస్తున్నాం. గత 37 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ అనేక ఎన్నికలను చూసింది. ఒకసారి మేం గెలిస్తే మరోసారి మరో పార్టీ గెలిచింది. కానీ ఎప్పుడూ ఎన్నికలు కాగానే ఇలా దాడులు, దౌర్జన్యాలు జరగలేదు. గత పది రోజుల్లోనే అనేక చోట్ల ఇవి జరగడం బాధాకరం. శిలా ఫలకాలు ధ్వంసం చేయడం, జెండా దిమ్మలు, స్వాగత ద్వారాలు పగలగొట్టడం సరైంది కాదు. తగిన రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం’ అని టీడీపీ ఆ ప్రకటనలో పేర్కొంది. ఎక్కడ ఎలాంటి దాడులు, దౌర్జన్యాలు జరిగినా వెంటనే పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తెలపాలని శ్రేణులకు సూచించింది. అన్ని విధాలా కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని తెలిపింది. పార్టీ కార్యకర్తలు కూడా సంయమనంతో వ్యవహరించాలని, రెచ్చగొట్టాలని చూసేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సంస్థాగతంగా బలోపేతం చేసి పార్టీకి కొత్త రూపు ఇవ్వడంపై సమావేశంలో చర్చించారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యవర్గాల ఏర్పాటుపై కొంత చర్చ జరిగింది.

అప్పుడే తొందరొద్దు..
మంత్రివర్గం ఏర్పాటై ప్రభుత్వ నిర్ణయాలు అధికారికంగా వెల్లడైన తర్వాత ఆయా అంశాలపై అవసరమైన పక్షంలో స్పందించాలని, ప్రజలకు తాను ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని టీడీపీ సమావేశం నిశ్చయించింది. ఎన్నికల ఫలితాలపై కొంత ఆత్మ పరిశీలన జరిగింది. ‘పట్టిసీమ ప్రాజెక్టు అవసరం కాదేమోనని నేనూ అపోహ పడ్డాను. కానీ దానివల్లే కృష్ణా డెల్టాలో పన్నెండు లక్షల ఎకరాలకు ఇప్పుడు సాగునీరు అందుతోంది. అనంతపురం జిల్లాలో కియా కార్ల ఫ్యాక్టరీ తెచ్చాం. ఇలా మంచి ఫలితం చూపించిన చోట కూడా మనం ఓడిపోయాం. దీనికి కారణమేంటో అన్ని స్థాయుల్లో సమీక్షించుకోవడం అవసరం’ అని విజయవాడ ఎంపీ కేశినేని నాని అభిప్రాయపడ్డారు. ప్రకాశం జిల్లా ప్రజలకు మొక్కాలని, రాజధాని జిల్లాలతో పోలిస్తే నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నా ఆ జిల్లాలో నాలుగు సీట్లు గెలిపించారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అన్నారు. సోషల్‌ ఇంజనీరింగ్‌లో కొంత విఫలమైనట్లు అనిపిస్తోందని, సంప్రదాయకంగా టీడీపీకి వెన్నెముకగా నిలిచే బీసీలు, దళితుల్లో మాదిగలు ఈసారి కొంత దూరం అయ్యారని.. ఆ లోపం సవరించుకోవాలని నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర యాదవ్‌ అన్నారు. ‘కొత్త ప్రభుత్వం వచ్చీ రాగానే అనేక అంశాల్లో టీడీపీ పాలనపై వ్యతిరేక ప్రచారం నడుపుతోంది. మనపై అనుమాన బీజాలు నాటే ప్రయత్నం జరుగుతోంది.

ఆయా అంశాలపై మనం ఎప్పటికప్పుడు స్పందించి వాస్తవాలు చెప్పకపోతే అవే నిజమని ప్రజలు అనుకునే ప్రమాదం ఉంది. కొత్త ప్రభుత్వానికి కొంత సమయమివ్వాలనే ఆలోచన మంచిదే. కానీ మనపై జరుగుతున్న చెడు ప్రచారాన్ని అడ్డుకోవడం రాజకీయంగా మన విధి’ అని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. అవసరమైనప్పుడు స్పందిద్దామని, ఇప్పుడే అంత తొందర అవసరం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

షెడ్యూల్‌ సంస్థల విభజన సంగతేంటి?
హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తూ జరిగిన నిర్ణయంపై కొంత చర్చ జరిగింది. రాజ్యాంగంలోని 9, 10 షెడ్యూళ్లలోని సంస్థలు, వాటి ఆస్తుల విభజన రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉండిపోవడం వల్ల వాటితో పాటు కలిపి భవనాల అప్పగింతపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకేసారి తుది నిర్ణయం తీసుకోవాలని అనుకున్నామని అప్పట్లో మంత్రులుగా ఉన్నవారు వివరించారు. ఇప్పుడు కేవలం ఆంధ్ర భవనాల అప్పగింతపై మాత్రమే నిర్ణయం జరిగిందని వార్తలు వస్తున్నాయని, ఏం జరుగుతుందో కొన్ని రోజులు వేచి చూడాలని నిర్ణయించారు.

రేపు విదేశాలకు చంద్రబాబు
కుటుంబంతో కలిసి చంద్రబాబు గురువారం విదేశీ పర్యటనకు వెళ్తున్నట్లు సమాచారం. బుధవారం రాత్రి ఆయన ఇక్కడి నుంచి హైదరాబాద్‌ వెళ్లారు. గురువారం రాత్రి అక్కడి నుంచి బయల్దేరతారు. ఈ నెల 13న తిరిగి వస్తారు.

No comments:

Post a Comment