Friday, April 26, 2019

పసుపు - కుంకుమ ఏది?

పసుపు - కుంకుమ ఏది?
4/27/2019 2:24:27 AM
పంపిణీలో అధికారుల నిర్లక్ష్యం
నగరంలో 35 శాతం మందికి నేటికీ అందని చెక్కులు
రెండు నెలలుగా చెక్కుల పంపిణీని పట్టించుకోని సీవోలు, సోషల్‌ వర్కర్లు
కమీషన్ల కోసమే చెక్కులు దాచారంటూ ఆరోపణలు
సమాచారం లేదంటున్న యూసీడీ అధికారులు
అసహనం వ్యక్తం చేస్తున్న మహిళలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేసిన పసుపు-కుంకుమ మహిళలకు వరంగా మారగా కొందరికి మాత్రం చేదు అనుభవాన్ని మిగులుస్తోంది. రెండు నెలల క్రితం ఇచ్చిన చెక్కులు నేటికీ కొంతమంది డ్వాక్వా గ్రూపు మహిళలకు అందలేదు. అదేమని కార్పొరేషన్‌ అధికారులను అడిగితే కుంటి సాకులు చెపుతున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు.

ఆంధ్రజ్యోతి, విజయవాడ : విజయవాడలో 35 శాతం డ్వాక్వా గ్రూపు మహిళలకు పసుపు కుంకుమ చెక్కులు అందలేదన్న వార్త ఇపుడు కలకలం రేపుతోంది. రోజూ ఎక్కే గుమ్మం దిగే గుమ్మమే తప్ప చెక్కులు ఇవ్వడం లేదని డ్వాక్వా మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటుండగా.. అలాంటి వాళ్ల వివరాలు తమకివ్వాలని యూసీడీ (అర్బన్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌) పీవో (ప్రాజెక్టు ఆఫీసర్‌) అంటున్నారు. ఉదాహరణకు 49వ డివిజన్లోనే సుమారు 7 నుంచి 10 గ్రూపులకు చెక్కులు అందలేదని ఆయా గ్రూపు మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కమీషన్లకు కక్కుర్తి పడుతూ పలువురు అధికారులు తమ చెక్కులను దాచిపెడుతున్నారని వారి ఆరోపణ. ఈ విషయమై స్థానిక కమ్యూనిటీ ఆఫీసర్‌ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ సదరు వ్యవహారాన్ని నేటికీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకపోవడం గమనార్హం.

ఫిబ్రవరిలో పసుపు-కుంకుమ పథకం కింద గ్రూపులోని ఒక్కో మహిళకు రూ.పది వేల చొప్పున పది మంది మహిళలకూ కలిపి రూ.లక్ష మూడు దశల్లో బ్యాంకుల ద్వారా మంజూరయ్యేలా చెక్కులను తేదీలతో రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. కానీ కొన్ని వందల చెక్కులు నేటికీ స్థానిక సోషల్‌ వర్కర్లు, కమ్యూనిటీ ఆఫీసర్ల వద్దే మగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకివ్వలేక పోతున్నారన్న ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం లేదు. ఽస్థానిక కార్పొరేటర్లను అడిగితే బ్యాంకులు మారిన కారణంగా, గ్రూపులు యాక్టివ్‌గా లేని కారణంగానే చెక్కులు రాలేదని చెబుతున్నారు.

గ్రూపులు యాక్టివ్‌గా లేకపోతే వచ్చాయి.. వచ్చేస్తున్నాయన్న సమాధానాలతో స్థానిక సోషల్‌ వర్కర్లు ఎందుకు మభ్యపెడుతున్నారన్నది ప్రశ్నగా మారింది. మూడు నెలల క్రితం జరిగిన పంపిణీ వివరాలు నేటికీ అందలేదని యూసీడీ విభాగం వారు సమాధానం చెబుతున్నారు.

నగరంలో ఎన్ని గ్రూపులున్నాయి, ఆయా గ్రూపుల్లోని మహిళల పేర్లు కూడా యూసీడీ విభాగం సిద్ధం చేయించుకోలేక పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే డ్వాక్వా గ్రూపు మహిళలకు సమాచారం చెప్పాల్సిన ఒక సోషల్‌ వర్కర్‌ (49వ డివిజన్‌) అందు బాటులో ఉండక పోగా కనీసం ఫోన్లకు కూడా దొరకడంలేదని ఆ డివిజన్‌ డ్వాక్వా గ్రూపు మహిళలు ఆరోపిస్తున్నారు.

ఎన్నికల కోడ్‌ వచ్చిందట!
కళ్లు మూసి తెరిచేంతలోనే ఎన్నికల కోడ్‌ వచ్చేసిందని, అందుకే చెక్కుల పంపిణీకి, పరిశీలనకు ఆలస్యమైందని వీఎంసీ అధికారులు మాట దాటేస్తున్నారు. నిజానికి పసుపు- కుంకుమ పథకం చెక్కుల పంపిణీ ముగిసిన తరువాతే ఎన్నికల కోడ్‌ను, తేదీని కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. ఏప్రిల్‌ 11న ఎన్నికలు ముగిశాక మరో మూడు రోజుల పాటు ఎలక్షన్‌ పనులు కొనసాగగా.. అనంతరం ఎవరి విధుల్లోకి ఆయాశాఖాధికారులు చేరుకున్నారు. కానీ దాదాపు 49 రోజులు పసుపు-కుంకుమ పథకంపై పనిచేసిన యూసీడీ విభాగం చెక్కుల పంపిణీ పూర్తి చేయకపోగా, కనీసం ఎవరెవరకి అందించాలన్న జాబితాలను కూడా సిద్ధం చేసుకోలేక చతికిల పడింది. ఎన్నికలు ముగిసినా నేటికీ ఎన్నికల కోడ్‌ (రిలాక్స్‌ మూడ్‌) నుంచి బయట పడని చాలా మంది అధికారుల్లాగే యూసీడీ అధికారులు కూడా సాకులు చెప్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

యూసీడీ ఎందుకు చర్యలు తీసుకోలేదు
చెక్కులు చాలా మందికి అందలేదన్న విషయం తెలిసి కూడా యూసీడీ విభాగం చర్యలను ఎందుకు వేగవంతం చేయ లేదు. డ్వాక్వా మహిళల ఇబ్బందులపై స్పందిస్తూ ఇప్పటికే ప్రకటన చేసి బాధితులు కార్పొరేషన్‌కు రావాలనో, లేదా కమిషనర్‌ను సంప్రదించాలనో కనీస ప్రకటన కూడా ఎందుకు చేయలేదో అధికారులే సమాధానం చెప్పాలి.

ఆ వివరాలేమన్నా ఉంటే ఇవ్వండి
నగరంలో చాలా గ్రూపులకు ఇంకా చెక్కులు అందలేదని తెలుస్తోంది. కానీ ఎవరూ మా దగ్గరకు రావడం లేదు. ఆయా సమస్యలపై స్థానిక సీవో, సోషల్‌ వర్కర్లు కూడా చెప్పలేదు. చెక్కులు అందకపోతే కార్యాలయానికి వచ్చి వివరాలు తెలియజేస్తే సమస్యను పరిశీలించి పరిష్కరిస్తాం. -ప్రకాశరావు, యూసీడీ ప్రాజెక్టు ఆఫీసర్‌






ముఖ్యమంత్రికి అధికారాల్లేవా?

ముఖ్యమంత్రికి అధికారాల్లేవా?
27-04-2019 02:41:59

వివరణ ఇవ్వండి!
మీ భాష అభ్యంతరకరం
నిజంగానే అలా మాట్లాడారా!
సీఎస్‌కు ముఖ్యమంత్రి లేఖ
ఆంగ్ల పత్రిక క్లిప్పింగ్‌ జత
అమరావతి, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): ‘అధికారాలు లేని ముఖ్యమంత్రి’ అంటూ ఈసీ నియమించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా శుక్రవారం ఆయనకు లేఖ రాశారు. ఒక ఆంగ్ల పత్రికలో ప్రముఖంగా ప్రచురితమైన ఆ వార్తా కథనాన్ని కూడా తన లేఖకు జత చేశారు. ‘‘ఒక ముఖ్యమంత్రి పట్ల మీరు వాడిన భాష అభ్యంతరకంగా ఉంది. అఖిల భారత సర్వీసు అధికారుల ప్రవర్తనా నియమావళిని కూడా ఉల్లంఘించినట్లుగా ఉంది. మీరు హుందా, గౌరవాన్ని పాటించలేదు. ఈ వార్తలో ప్రచురితమైనట్లుగా ఉన్న వ్యాఖ్యలు మీరు చేశారా! దీనిపై మీ వివరణ ఏమిటి?’’ అని ఎల్వీ సుబ్రమణ్యంను ముఖ్యమంత్రి చంద్రబాబు తన లేఖలో ప్రశ్నించారు. సీఎస్‌ వ్యాఖ్యలు అభ్యంతరకంగా ఉన్నాయని, చాలా తీవ్రమైనవని కొందరు సీనియర్‌ మంత్రులు, అధికారులు అభిప్రాయపడ్డారు. దీనిపై ముఖ్యమంత్రి వద్ద కూడా కొంత చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఎల్వీ వివరణ కోరుతూ ముఖ్యమంత్రి లేఖ రాశారు.


‘‘ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి నియమిస్తారు. తన విధులు, బాధ్యతల నిర్వహణలో ప్రధాన కార్యదర్శి సంబంధిత అంశాలను సీఎంకు నివేదిస్తారు. ప్రభుత్వ అధిపతి ముఖ్యమంత్రి. ఆయనకు అధికారాలు ఉన్నాయో లేవో వ్యాఖ్యానించే అధికారం ప్రధాన కార్యదర్శికి లేదు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో సీఎంకు ఏ మేరకు అధికారాలుంటాయో భాష్యం చెప్పే పని సీఎ్‌సది కాదు. ఆ విషయంలో ఏదైనా సందిగ్ధత ఉంటే ఎన్నికల కమిషన్‌ తన వివరణ ఇస్తుంది తప్ప సీఎస్‌ కాదు’’ అని సీఎం వద్ద జరిగిన చర్చలో అభిప్రాయపడ్డారు. ఎల్వీ తన పరిధిని అతిక్రమించారన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో నేరుగా ఆయనకు దీనిపై లేఖ రాయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ప్రధాన కార్యదర్శిని సంజాయిషీ కోరుతున్నట్లు కాకుండా వివరణ కోరుతున్నట్లుగా రాసినట్లు సమాచారం.

‘‘ముఖ్యమంత్రికి అధికారాలు లేవని మీరు చెప్పినట్లుగా ఒక పత్రికలో వచ్చిన మీ ఇంటర్వ్యూ చూశాను. మీ వ్యాఖ్యలు నాకు బాధ కలిగించాయి. ప్రజాస్వామిక ప్రభుత్వాలు కొన్ని నియమ నిబంధనలు, రాజ్యాంగ సంప్రదాయాల ప్రకారం పనిచేస్తాయి. ఎన్నికల కోడ్‌ ఈ ఒక్క రాష్ట్రంలోనే కాకుండా మొత్తం దేశమంతా అమల్లో ఉంది. అన్ని చోట్లా ఒకటే కోడ్‌ అమల్లో ఉంటుంది తప్ప రాష్ట్రానికో రకంగా ఉండదు. మరే రాష్ట్రంలోనూ అధికారులు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం లేదు. ఇక్కడ మీరిలా ఎందుకు మాట్లాడారో వివరణ ఇవ్వండి’’ అని ఆ లేఖలో సీఎం కోరినట్లు చెబుతున్నారు.

రద్దు చేసినప్పుడూ సాఫీగానే...
గతంలో అసెంబ్లీని రద్దు చేసినప్పుడు కూడా తమకు ఇలాంటి అనుభవాలు ఎదురు కాలేదని, ఇప్పుడే చూస్తున్నామని కొందరు మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. ‘2003లో మేం అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాం. ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు రాజీనామా చేశారు. పలు కారణాలతో వెంటనే ఎన్నికలు రాలేదు. ఆరు నెలలపాటు ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు కూడా ప్రభుత్వం మామూలుగానే పనిచేసింది.

కొత్తగా విధాన నిర్ణయాలు తీసుకోకుండా రోజువారీ బాధ్యతలు నిర్వర్తించింది. ఇప్పుడు అసెంబ్లీ రద్దు కాలేదు. ప్రభుత్వానికి గడువూ ముగియలేదు. అయినా ముఖ్యమంత్రికి ఏ అధికారాలూ లేవన్న రీతిలో కొందరు అధికారులు ప్రవర్తిస్తున్నారు. ఈ నెల రోజులూ అధికారం అనుభవించాలన్న కోరికేమీ మాకు లేదు. కానీ ప్రాజెక్టుల నిర్మాణాలకు ఈ వేసవి కీలకమైన సమయం. వాటిని పరిగెత్తించకపోతే వర్షాకాలంలో పనులు చేయలేం. ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్షించి వెంటపడితేనే ఆ పనులు వేగంగా జరుగుతాయి. దానికి అడ్డుపడుతున్నారనే మా బాధ’ అని ఒక సీనియర్‌ మంత్రి వ్యాఖ్యానించారు.

సీఎస్‌తో ఘర్షణ వద్దు..
వాస్తవానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఘర్షణ వైఖరికి వెళ్లవద్దని కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి తన కార్యాలయ అధికారులు, మంత్రులకు సూచించారు. రెండు మూడు అంశాలపై సీఎం సమీక్షలు జరిపినప్పుడు వాటికి వెళ్లవద్దని అధికారులకు సీఎస్‌ నుంచి మౌఖిక ఆదేశాలు అందాయి. అనవసరంగా మధ్యలో అధికారులు నలిగిపోతున్నారన్న అభిప్రాయంతో సీఎం కూడా సమీక్షలు విరమించారు. చేసి తీరతానని పట్టుదలకు వెళ్లలేదు. ఈసీ వైఖరిని తప్పుబట్టారు తప్ప సీఎస్‌ విషయంలో ఏ వ్యాఖ్యా చేయకుండా సంయమనం పాటించారు. ఆర్థిక శాఖ అధికారులతో జరిపిన సమీక్షలో మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను సుబ్రమణ్యం ప్రశ్నించారని వార్తలు వచ్చాయి. దానిపైనా ముఖ్యమంత్రి స్పందించలేదు. కానీ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రికి అధికారాలు లేవని సీఎస్‌ వ్యాఖ్యానించడం వేడి పుట్టించింది. ఆయన వివరణ కోరుతూ ముఖ్యమంత్రి లేఖ రాయడానికి అదే కారణమైంది.

ఇతర రాష్ట్రాల గురించి నాకు అనవసరం

ఇతర రాష్ట్రాల గురించి నాకు అనవసరం
27-04-2019 02:39:16

పుస్తకాల్లో ఉన్నదే పాటిస్తున్నాను
ముఖ్యమంత్రి లేఖపై నో కామెంట్‌
కలెక్టర్లు, ఎస్పీలు నేను చెప్పినా వింటారు
సీఎస్‌, డీజీపీ చెబితే మరింత బాధ్యతతో ఉంటారు : సీఈవో ద్వివేది
అమరావతి, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): ఇతర రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల కమిషన్‌ (సీఈసీ) నిబంధనలు అనుసరిస్తున్నారో లేదో తనకు అనవసరమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్‌ తనకిచ్చిన పుస్తకాల్లో ఉన్న నిబంధనలే అనుసరిస్తున్నానని..ఎక్కడా వ్యక్తిగత ఎజెండాతో తాను నడుచుకోవడంలేదని స్పష్టం చేశారు. శుక్రవారం తనను కలిసిన విలేకరులతో ద్వివేది ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. సీఎం చంద్రబాబు సీఈసీకి రాసిన లేఖపై ‘నో కామెంట్‌’ అని వ్యాఖ్యానించారు.

దానిపై కమిషన్‌ నుంచి వచ్చే స్పందనను అనుసరించి తాను వ్యవహరిస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళికి సంబంధించిన పుస్తకాలను పార్టీలు, అధికారులందరికీ ఇచ్చామని.. ఆ పుస్తకాల్లో ఏది ఉంటే అదే తాను అనుసరిస్తున్నానని తెలిపారు. ‘కలెక్టర్లు, ఎస్పీలు నేను చెప్పినా వింటారు. సీఎస్‌, డీజీపీలు కూడా చెప్పడంవల్ల మరింత బాధ్యతగా విధులు నిర్వర్తిస్తారు. గతంలో సీఎస్‌గా పునేఠా ఉన్నప్పుడు కూడా ఎన్నికలపై 3సార్లు సమీక్షలు చేశారు’ అని తెలిపారు.

సంధికాలమే అపోహలకు కారణమా?
పోలింగ్‌కు.. కౌంటింగ్‌కు మధ్య వ్యవధి ఎక్కువగా ఉండడమే అపోహలకు, అనుమానాలకు కారణమవుతోందని ఈసీ వర్గాలు అంటున్నాయి. గతంలో ఎప్పుడూ ఎన్నికల నిర్వహణపై ఇంత పెద్దఎత్తున అనుమానాలు, అపోహలు ప్రజల్లోను, రాజకీయవర్గాల్లోను చూడలేదని ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు అధికారులు అంటున్నారు. ఈ సారి ఏపీలో తొలి విడతలోనే ఎన్నికలు జరగడం, పోలింగ్‌కు, కౌంటింగ్‌కు మధ్య నెలన్నర వ్యవధి ఉండడంతోనే అనుమానాలు రేకెత్తుతున్నాయని అభిప్రాయపడుతున్నారు.

పాలనకు ఆటంకం కలుగుతోందని, ప్రజలకు అత్యవసరమైనవీ కోడ్‌ వల్ల ప్రభుత్వం అందించలేకపోతుందనే వాదన ప్రభుత్వం, ప్రజల నుంచీ వాదనలు వినపడుతున్నాయి. దేశంలో ఎన్నికలు ముగిసిన ఇతర రాష్ట్రాల్లో కూడా పోలింగ్‌కు, కౌంటింగ్‌కు మధ్య వ్యవధి అధికంగా ఉండడంతో, పాలనకు ఎన్నికల కోడ్‌ శాపంగా మారిందని ఆయా రాష్ట్రాలు ఆవేదనతో ఉన్నాయని అంటున్నారు. పోలింగ్‌ ముగిసి పోయినందున కోడ్‌ నిబంధనలను సడలించాలని సీఈసీని కోరే అవకాశం లేకపోలేదు. ‘పోలింగ్‌ అయిపోయాక ఓటర్లను ప్రభావితం చేసేది ఏం ఉంటుంది? సీఈసీ సవరించాలనుకుంటే నిబంధనలు సడలించవచ్చు’ అని ఓ ఉన్నతాధికారి వ్యక్తిగతంగా అభిప్రాయపడ్డారు.

ఎల్వీఎస్‌ నిందితుడే!

ఎల్వీఎస్‌ నిందితుడే!
27-04-2019 02:34:01

ఆయనపై కేసు కొట్టివేత చెల్లదు
ఎమ్మార్‌ కుట్రలో ఆయన భాగస్వామి
లీజు, మినహాయింపులు, భూమి ధరలో
ప్రభుత్వానికి నష్టం చేసేలా నిర్ణయాలు
విస్పష్ట డాక్యుమెంట్‌ ఆధారాలున్నాయి
విచారణకు కేంద్రం అనుమతీ ఉంది
ఆ తర్వాతే క్వాష్‌ పిటిషన్‌ వేశారు
ఆయనకు విముక్తి కల్పించడం చెల్లదు
హైకోర్టు ఆదేశాలపై వెంటనే స్టే ఇవ్వాలి
సుప్రీం కోర్టులో సీబీఐ పిటిషన్‌
(అమరావతి - ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంపై సీబీఐ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. వైఎస్‌ జగన్‌ అక్రమాస్తులకు సంబంధించిన ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కేసు నుంచి ఎల్వీని తప్పిస్తూ ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపి వేయాలని కోరింది. ఈ కుట్రలో ఎల్వీ సుబ్రమణ్యం భాగస్వామి అని నిరూపించేందుకు స్పష్టమైన డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలున్నాయని తెలిపింది. ఆయన చర్యలతో ఏపీఐఐసీపై తీవ్ర ఆర్థికభారం పడిందని సీబీఐ పేర్కొంది. అవినీతి నిరోధక చట్టం-1998 కింద ఆయనను విచారించేందుకు కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నామని, ఎమ్మార్‌ కుట్రలో ఆయన పాత్రను నిరూపించే స్పష్టమైన ఆధారాలను కోర్టులో సమర్పించిన తర్వాత హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారని వివరించింది. ఈ కేసు నుంచి ఎల్వీని తప్పించడం న్యాయ విరుద్ధమని సీబీఐ తెలిపింది.


ఏమిటీ ఈ కేసు
ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్‌ ఉన్నప్పుడు... 2003 సెప్టెంబరు నుంచి 2005 మే దాకా ఎల్వీ సుబ్రమణ్యం పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ) వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో హైదరాబాద్‌ కేంద్రంగా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో భారీ ప్రాజెక్టును చేపట్టారు. ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కంపెనీతోపాటు మరి కొన్ని సంస్థలతో కలిసి ఏపీఐఐసీ దీన్ని చేపట్టేలా విధివిధానాలు రూపొందించారు. ఇదో భారీ హౌసింగ్‌ ప్రాజెక్టు. ప్లాట్లు, విల్లాలు, గోల్ఫ్‌కోర్సు, కన్వెన్షన్‌ సెంటర్ల నిర్మాణం వంటివి ఎన్నో ఇందులో భాగం. దీనికోసం స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పీవీ) ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు అవసరమైన ప్రైవేటు భూమి సేకరణ ధర ఖరారు నుంచి ఒప్పందాలు, లీజు ఫీజుల నిర్ణయం, వాటాల ఖరారు, ఇతర నిబంధనల అమల్లో అనేక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపింది.

ఇంటిగ్రేటెడ్‌ ప్రాజెక్టులో ఏపీఐఐసీని దగా చేశారని... ప్రైవేటు భాగస్వాములకు కోట్లరూపాయలు లాభం వచ్చేలా వ్యవహరించారని, ఇదంతా రహస్య నేరపూరిత కుట్ర మేరకు జరిగిందని సీబీఐ నిర్ధారించింది. 2011 ఆగస్టు 10న సీబీఐ కేసు నమోదు చేసిది.. ఇందులో ఎల్వీని 11వ నిందితుడిగా (ఏ-11) చేర్చింది. 2011 ఫిబ్రవరి ఒకటి నుంచి వరసగా చార్జిషీట్లు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టం-1988 కింద ఎల్వీని విచారించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంది. అయితే, ఎల్వీ 2017లో హైకోర్టును ఆశ్రయించారు. తనపై సీఐబీ నమోదు చేసిన కేసునుంచి విముక్తి కల్పించాలని క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు గత ఏడాది జనవరి 4న ఎల్వీకి ఈ కేసు నుంచి విముక్తి కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

సీబీఐ ప్రస్తావించిన అంశాలు...
1) ఏపీఐఐసీ వైస్‌ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఎల్వీ సుబ్రమణ్యం ఉండగా ఇంటిగ్రేటెడ్‌ ప్రాజెక్టు ముందుకొచ్చింది. దీని అమలుకు సంబంధించిన విధివిధానాలు, ఒప్పందాలు ఎలా ఉండాలో ఏపీఐఐసీయే సూచించింది. దీనిని సర్కారు ఆమోదించింది. ఎమ్మార్‌తోపాటు, మరో రెండు ప్రైవేటు కంపెనీలతో ఏపీఐఐసీ జతకలిసి దీన్ని చేపట్టేలా రూపొందించారు. ఇందుకోసం భూమిని సేకరించాల్సి వచ్చింది. ఎకరాకు రూ.29 లక్షల నంచి రూ.40 లక్షల మేర ధర ఉండాలని ఏపీఐఐసీ మేనేజర్‌ సిఫారసు చేశారు. అయితే, దీన్ని ఎల్వీ పట్టించుకోలేదు. ఎమ్మార్‌ ప్రాపర్టీ్‌సకు అనుకూలంగా, ముందుగా ఖరారు చేసిన ధర అంటే ఎకరాకు రూ.29 లక్షలు ఉండాలన్న దానికి కట్టుబడి ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదన లు పంపించారు. దీని వల్ల ప్రభుత్వం వైపు నుంచి భరించే వ్యయం పెరగడంతోపాటు, ప్రాజెక్టు ధర విపరీతంగా పెరిగిపోయింది. అలాగే, ఈ ప్రాజెక్టులో ప్రభుత్వ వాటా కూడా తగ్గింది. వాస్తవానికి, ఏపీఐఐసీకి చెందిన ధరల నిర్ణాయక కమిటీ ఎకరా భూమికి రూ.35 లక్షలు ఉండాలని ముందుగానే నిర్ణయించింది. దీన్ని అధికారులు కూడా ఆ తర్వాత అంగీకరించారు. కాబట్టి, ఇది నేరపూరిత కుట్రలో భాగమే అవుతుంది.

2) లీజు అద్దెల విషయంలోనూ ప్రభుత్వ నిర్ణయాలకు విరుద్ధంగా ముందుకుసాగారు. 235 ఎకరాలను గోల్ఫ్‌కోర్సు ఏర్పాటుకు లీజుకు ఇవ్వాలని నిర్ణయించారు. వార్షిక స్థూల ఆదాయంపై మొదటి 33 సంవత్సరాలకు రెండు శాతం, ఆ తర్వాత 33 సంవత్సరాలకు 3 శాతం లీజు అద్దె వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికి విరుద్దంగా, మొత్తంగానే 2 శాతం లీజు అద్దె వసూలు చేయాలని నిర్ణయించారు. దీని వల్ల ఏపీఐఐసీకి న్యాయబద్ధంగా రావాల్సిన లీజు అద్దె తగ్గిపోయింది.

3) ఇజ్జత్‌నగర్‌లోని 15 ఎకరాల లీజు భూమిలో కన్వెన్షన్‌ సెంటర్‌, బిజినెస్‌ హోటల్‌ నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే, ఈ భూమికి కూడా 33 సంవత్సరాల అనంతరం లీజు అద్దె ఫీజును 2 నుంచి 3 శాతానికి పెంచాలని సిఫారసు చేయలేదు. ఇది నేరపూరిత కుట్రకు సహకరించడమే అవుతుంది.

4) 2005లో జారీ చేసిన జీఓ 14 ద్వారా ఈ ప్రాజెక్టు భూమికి.. భూ వినియోగ మార్పిడి ఫీజు (కన్వర్షన్‌ ఫీజు)ను మినహాయించారని నివేదించారు. వాస్తవానికి ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలిస్తామని మాత్రమే చెప్పింది. మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకోలేదు.

5) ఇంటిగ్రేటెడ్‌ ప్రాజెక్టుకోసం నానక్‌రామ్‌గూడ లో సేకరించాల్సిన భూమిలోనే 11.26 ఎకరాలను తప్పించారు. ఇందుకు ఎల్వీ సహకరించారు. ఇంకా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్లాట్లు, విల్లాల విక్రయం, ఒప్పందాల అమలులో నిబంధనల ఉల్లంఘన జరిగింది.

సుప్రీంకు సీబీఐ...
ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కేసు నుంచి ఎల్వీని తప్పిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆ తర్వాత సీబీఐ సుప్రీం కోర్టులో సవాల్‌ చేసింది. ‘‘ఏ కారణాలతో ఎల్వీని ఈ కేసు నుంచి తప్పించారు? ఎమ్మార్‌ కుట్రలో ఎల్వీ పాత్రను నిర్ధారించే డాక్యుమెంటరీ, ఇతర ఆధారాలను కేసును విచారిస్తున్న కోర్టుకు నివేదించాం. ఇంకా, అవినీతి నిరోధక చట్టం కింద విచారించేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకున్నాం. ఈ కేసు కోర్టు పరిశీలనలో ఉంది. ఇంతలో ఆయన హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. హైకోర్టు ఆయనకు కేసు నుంచి విముక్తి కల్పించింది. ఇది న్యాయ విరుద్ధం. ఆయన పాత్రను నిరూపించే స్పష్టమైన ఆధారాలు కోర్టు పరిధిలోనే ఉన్నాయి. కాబట్టి, ఈ కేసు నుంచి ఆయనకు విముక్తి కల్పిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేయాలి’’ అని సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసింది. కుట్రలో ఎల్వీ పాత్రను నిర్ధారించే ఫోరెన్సిక్‌ ఆధారాలున్నాయని పేర్కొంది.