Sunday, December 4, 2022

Maharashtra and Karnataka : బెల్గావి మహా వివాదం

 Maharashtra and Karnataka : మహా వివాదం

ABN , First Publish Date - 2022-12-05T04:21:07+05:30 IST


ఏటా డిసెంబరులో దేశం మొత్తానికీ చలికాలం వస్తే.. మహారాష్ట్ర, కర్ణాటక నడుమ మాత్రం సరిహద్దు తగాదాల సెగ రేగుతుంది! మాటలు తూటాల్లా పేలుతుంటాయి! పౌరుషాలు, ఆత్మగౌరవాల కత్తులు పరస్పరం దూసుకుంటాయి! ఆ వాగ్వాదాలు.. భౌతిక నిరసనలకు దారితీస్తుంటాయ్‌!! బస్సులు తగలబెట్టడం..


Maharashtra and Karnataka : మహా వివాదం


బెళగావి సహా 4 జిల్లాల్లోని 865 గ్రామాలు/పట్టణాలపై


కర్ణాటక, మహారాష్ట్ర మధ్య రగులుతున్న సరిహద్దు గొడవ


చల్లారకుండా చేసి చలికాచుకుంటున్న రాజకీయ నేతలు


2004లో సుప్రీం కోర్టును ఆశ్రయించిన మహారాష్ట్ర సర్కారు


18 ఏళ్ల తర్వాత.. దానిపై వచ్చేవారం జరగనున్న విచారణ


ఒకవైపు మరాఠా పౌరుషం.. మరోవైపు కన్నడ ఆత్మగౌరవం! రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న బెళగావి సహా నాలుగు జిల్లాల్లోని 865 పట్టణాలు/గ్రామాలు తమవంటే తమవని తగువు! కర్ణాటక, మహారాష్ట్ర నడుమ దశాబ్దాలుగా రగులుతున్న ఈ సరిహద్దు వివాదాన్ని చల్లారకుండా చేసి చలికాచుకుంటున్నది మాత్రం రాజకీయ నేతలే!! కర్ణాటక రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి మొదలై సుదీర్ఘంగా కొనసాగుతున్న ఈ వివాదంపై వచ్చేవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది!


(బెంగళూరు-ఆంధ్రజ్యోతి)


ఏటా డిసెంబరులో దేశం మొత్తానికీ చలికాలం వస్తే.. మహారాష్ట్ర, కర్ణాటక నడుమ మాత్రం సరిహద్దు తగాదాల సెగ రేగుతుంది! మాటలు తూటాల్లా పేలుతుంటాయి! పౌరుషాలు, ఆత్మగౌరవాల కత్తులు పరస్పరం దూసుకుంటాయి! ఆ వాగ్వాదాలు.. భౌతిక నిరసనలకు దారితీస్తుంటాయ్‌!! బస్సులు తగలబెట్టడం.. ఒకరి జాతి ప్రతీకలను మరొకరు అవమానించడం.. ఇదిలాగ కొన్నిరోజులపాటు సాగి క్రమంగా పరిస్థితి సద్దుమణుగుతుంది. మళ్లీ డిసెంబరులో మామూలే. ఈ సెగలో రాజకీయ పార్టీలు చలికాచుకుంటుంటాయి. ఇంతకీ ఏటా డిసెంబరు నెలలో సరిహద్దు వివాదం ఎందుకు రేగుతుందంటే.. మహారాష్ట్ర ప్రభుత్వం తమ శాసనసభ శీతాకాల సమావేశాలను బెళగావి జిల్లాలోని సువర్ణ విధాన సౌధలో నిర్వహించడమే అందుకు కారణం. బెల్గావితోపాటు ఒకప్పుడు బొంబాయి రాష్ట్రంలో భాగమైన బీజాపూర్‌, ధార్వాడ్‌, ఉత్తర కెనరా జిల్లాలను.. 1956లో భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన మైసూరులో కలపడమే ఈ వివాదానికి మూలం. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చే సమయానికే బెళగావి జిల్లా నాటి బొంబాయి ప్రెసిడెన్సీలో ఉండేది. స్వాతంత్య్రం వచ్చాక దాన్ని బొంబాయి రాష్ట్రంలో భాగంగా గుర్తించారు. 1948లో.. బెళగావి సిటీ కౌన్సిల్‌ ఆ జిల్లాను ప్రతిపాదిత ‘సంయుక్త మహారాష్ట్ర’లో విలీనం చేయాలని తీర్మానం చేసింది. ఇదే డిమాండ్‌తో 1948లోనే ‘మహారాష్ట్ర ఏకీకరణ్‌ సమితి (ఎంఈఎస్‌)’ కూడా ఏర్పాటైంది. అయితే.. 1953లో ఏర్పాటు చేసిన ఫజల్‌ అలీ కమిషన్‌.. ఆ నాలుగు జిల్లాలపై మైసూరు రాష్ట్రానిదే పూర్తి అధికారం అని నివేదిక సమర్పించింది. ఈమేరకు 1956లో బొంబాయి రాష్ట్రం నుంచి ఆ నాలుగు జిల్లాలతోపాటు.. ఆంధ్ర రాష్ట్రంనుంచి బళ్లారి, మద్రాసు రాష్ట్రం నుంచి దక్షిణ కెనరా.. హైదరాబాద్‌ రాష్ట్రం నుంచి కొప్పల్‌, రాయ్‌చూర్‌, కలబుర్గి, బీదర్‌ జిల్లాలను, కూర్గు స్టేట్‌ను ఒక జిల్లాగాను చేసి.. మైసూరు రాష్ట్రంలో కలిపారు. వీటిలో.. బొంబాయి రాష్ట్రం నుంచి కలిపిన నాలుగు జిల్లాలపైనే ప్రస్తుత వివాదం సా...గుతూ వస్తోంది. ఆ నాలుగు జిల్లాల్లోని మొత్తం 865 పట్టణాలు/గ్రామాలు తమకే చెందుతాయని మహారాష్ట్ర వాదిస్తోంది. ఫజల్‌ అలీ కమిషన్‌ నివేదికను మహారాష్ట్ర అంగీకరించట్లేదు. గతంలో పలుమార్లు ఇదే అంశంపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది. 1966లో సుప్రీం కోర్టు సూచన మేరకు జస్టిస్‌ మెహర్‌చంద్‌ మహాజన్‌ సారథ్యంలో కమిషన్‌ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌ సమర్పించిన నివేదిక కూడా కర్ణాటకకు అనుకూలంగా వచ్చింది. అనంతరం 2004లో మహారాష్ట్ర దీన్ని సవాల్‌ చేస్తూ మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. 18 ఏళ్ల తర్వాత.. దానిపై తుది విచారణ వచ్చే వారం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఉభయ రాష్ట్రాల్లో, ప్రత్యేకించి సరిహద్దులో మరింత తీవ్ర ఉత్కంఠ, ఉద్రిక్తత నెలకొన్నాయి.


ఆరనివ్వని రాజకీయాలు..


కర్ణాటకలో ప్రస్తుతం అధికారంలో ఉన్నది బీజేపీ. మహారాష్ట్రలోనూ చీలిక శివసేనతో కలిసి అధికారంలో ఉన్నది బీజేపీనే. ఇలా రెండు రాష్ట్రాల్లో ఒకే పార్టీ అధికారంలో ఉంటే సమస్య తీవ్రం కాకుండా సంయమనం పాటించడం కద్దు. ఈ వివాదం మొదలైన తొలినాళ్లలో రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ ప్రయోజనాలను ఆశించి కాంగ్రెస్‌ పార్టీ అదే రీతిలో వ్యవహరించేది. కానీ, మహారాష్ట్ర ఏకీకరణ్‌ సమితి మాత్రం అప్పట్నుంచీ ఈ వివాదం చల్లారకుండా చూస్తూ వస్తోంది. 1957లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నుంచి.. 2018 దాకా ఆ జిల్లాలో ఒకటి, అంతకు మించి సీట్లను సాధిస్తూ వస్తూనే ఉంది. డిసెంబరులో శీతాకాల సమావేశాలను బెళగావిలో నిర్వహిస్తున్నప్పుడు.. దానికి పోటీగా ‘మరాఠీ మహావేలవ’ను నిర్వహిస్తోంది. అలాగే.. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలంటే కన్నడ పరీక్షలో ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి చేస్తూ 1986లో నాటి కర్ణాటక సీఎం రామకృష్ణ హెగ్డే తీసుకున్న నిర్ణయం ఈ వివాదాన్ని మరింత తీవ్రతరం చేసింది. కాలక్రమంలో ఇరు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలూ తమ ప్రయోజనాల కోసం ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజల మనోభావాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తూ అగ్నికి ఆజ్యం పోసినట్టు వ్యవహరిస్తున్నారు. ఇటీవలికాలంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు, వివిధ పార్టీల నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ఆ కోవలోనివే. కర్ణాటకలోని సరిహద్దు పట్టణాలు, గ్రామాల్లో పరిస్థితిని అధ్యయనం చేసేందుకు ఇద్దరు మంత్రులను పంపాలని మహారాష్ట్ర సర్కారు నిర్ణయించడం.. వారు వస్తే అడ్డుకుంటామని కర్ణాటక రక్షణ వేదిక, కన్నడ సంఘాల సమాఖ్య తదితర సంఘాలు ప్రకటించడం.. కర్ణాటకకు వచ్చి ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తే సహించేది లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై చేసిన హెచ్చరికలతో రెండు రాష్ట్రాల సరిహద్దులో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. బెళగావిలో కేఎస్‌ ఆర్టీసీ బస్సులకు మసిపూయడం, కన్నడ పతాకాన్ని ప్రదర్శించిన యవకుడిపై దాడి చేయడం వంటి ఘటనలు ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. కాగా.. వచ్చే వారం సుప్రీంకోర్టులో విచారణకు రానున్న ఈ కేసుపై బసవరాజ్‌ బొమ్మై ప్రత్యేకంగా దృష్టిసారించారు. స్వయంగా ఢిల్లీకి వెళ్లి ఈ కేసును వాదిస్తున్న సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రొహతగి బృందంతో సుదీర్ఘ సమాలోచనలు జరిపారు. గతంలో రెండు కమిషన్ల నివేదికల సిఫారసులను సుప్రీంకోర్టులో బలంగా వినిపించాలని కోరారు. సుప్రీం కోర్టు నిర్ణయం రాష్ట్రానికి అనుకూలంగా ఉంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment