తృతీయ శక్తి అవుదాం!
‘సీఎంగా బీసీ’ ప్రతిపాదనకు నా మద్దతు: బ్రదర్ అనిల్
విశాఖలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రైస్తవ,
మైనారిటీ సంఘాలతో సుదీర్ఘ సమావేశం
మరోసారి సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ
ఏపీలో షర్మిల పార్టీని విస్తరించాలని కోరుతున్నారు
గెలిపించిన వారిని జగన్ పట్టించుకోవట్లేదు
రెండున్నరేళ్లుగా ఆయన్ని కలవలేదు
వివేకా కుటుంబానికి న్యాయం జరుగుతుంది: అనిల్
విశాఖపట్నం, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు న్యాయం చేసేందుకు రాజకీయంగా మూడో ప్రత్యామ్నాయ శక్తిగా తయారవుదామని బ్రదర్ అనిల్‌కుమార్ పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. సోమవారం విశాఖపట్నంలోని ఓ హోటల్‌లో ఉత్తరాంధ్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంఘాల నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ‘‘ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగడం లేదు. మీరు ముందుకువచ్చి పార్టీ స్థాపిస్తే మేమంతా వెనకుండి నడిపిస్తాం’’ అని సమావేశంలో అన్ని సంఘాల నేతలు బ్రదర్ అనిల్‌కుమార్‌ను కోరినట్టు తెలిసింది. ‘‘మీరంతా సంఘటితంగా కలిసి వస్తామంటే.. ముందుండి నడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నా’’ అని అనిల్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత లోతుగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించేందుకు త్వరలోమరోసారి సమావేశమవుదామని చెప్పినట్టు సమాచారం.
బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలకు బదులుగా బలహీన వర్గాల నాయకత్వంలో ప్రత్యామ్నాయం అవసరమని వివరించినట్టు సమాచారం. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకూ ఈ సమావేశం జరిగింది. సమావేశానికి హాజరైన సుమారు 70 మంది ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఒక్కో ప్రతినిధి ఐదు నుంచి పది నిమిషాల పాటు సమస్యలు ఏకరవు పెట్టినట్టు సమాచారం. అనంతరం బ్రదర్ అనిల్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల.. ఆంధ్రప్రదేశ్‌కు కూడా పార్టీని విస్తరించాలని పలువురు కోరుతున్నారని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడానికి సహకరించాలని ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు కోరారని వెల్లడించారు. వారి ప్రతిపాదనను కచ్చితంగా సమర్థించి, మద్దతు ఇస్తానని ప్రకటించారు. గత ఎన్నికల్లో తాను ఇచ్చిన పిలుపునకు స్పందించి ఎంతో మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రైస్తవ, ముస్లిం మైనారిటీ సంఘాల నాయకులు వైసీపీ విజయానికి కృషి చేశారని చెప్పారు. సీఎం జగన్ కానీ, ప్రభుత్వం కానీ ఈ వర్గాల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. దీంతో వారంతా పిలిచి తమ సమస్యలు, ఇబ్బందులు తనకు వివరించారని చెప్పారు. ‘‘ప్రభుత్వం నుంచి ఆయా వర్గాలు ఏం ఆశించారో, ఏం కోల్పోయారో వివరించారు. వారి బాధలు వినేవారు కానీ, సమాధానం చెప్పేవారు కానీ లేరు. దీంతో బాధ్యత తీసుకోవాలని నిర్ణయించాను’’ అని అన్నారు.
జగన్ బిజీగా ఉన్నట్టున్నారుఇటీవల విజయవాడలో ఇదే తరహాలో నిర్వహించిన సమావేశంలో ఆయా సంఘాలు వెలిబుచ్చిన సమస్యలు, అభిప్రాయాలను సీఎం జగన్‌కు వివరించారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ‘‘ఆయన (జగన్) పథకాల అమలు బిజీలో ఉన్నట్టున్నారు. నేను నా పనుల్లో తీరిక లేకుండా ఉన్నాను. నేను ఆయన్ను కలిసి రెండున్నరేళ్లు అయ్యింది’’ అని బ్రదర్ అనిల్ సమాధానమిచ్చారు. జగన్‌కు ఇప్పుడైనా వివరించేందుకు ప్రయత్నిస్తారా అన్న ప్రశ్నకు.. లేఖ ద్వారా లేదా వ్యక్తిగతంగా కలిసి ఆయన దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. హామీలను నెరవేర్చకుండా వైసీపీ సర్కారు కక్షసాధింపుతో పరిపాలన చేసే పరిస్థితి కనిపిస్తోందని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. వైఎస్ కుటుంబంలో విభేదాలు ఉన్నాయా? అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో బాధిత కుటుంబానికి కచ్చితంగా న్యాయం జరుగుతుందని బ్రదర్ అనిల్ అన్నారు. కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోందని, అది చిన్న వ్యవస్థ కాదని వ్యాఖ్యానించారు.
అనిల్ పిలుపుతో వైసీపీకి ఓట్లు: హనోక్‌గత ఎన్నికల్లో బ్రదర్ అనిల్‌కుమార్ ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారానికి రాకపోయినా ఫోన్‌లు చేసి, సమావేశాలు ఏర్పాటు చేసి జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారని ఈ సమావేశంలో ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రిస్టియన్ చారిటీ (ఏఐసీసీ) జాతీయ అధ్యక్షుడు గారా హనోక్ వెల్లడించారు. ఆయన పిలుపు మేరకు తామంతా వైసీపీ విజయానికి కృషి చేశామన్నారు. టీడీపీకి ఓటేద్దామనుకున్నవారు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేశారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తరువాత అందరికీ అన్యాయం చేస్తున్నారని జగన్‌ను ఉద్దేశించి అన్నారు.
సర్కారు పట్టించుకోవడం లేదు!: సంఘాలుసమావేశంలో పాల్గొన్న నేతలు తమ సమస్యలు, కష్టాలను బ్రదర్ అనిల్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ఈ సందర్భంగా పార్టీ ఏర్పాటు చేయాలని కోరినట్టు సమా చారం. క్రైస్తవుల అండదండలతో అధికారం దక్కించుకున్న జగన్.. వారి యోగక్షేమాలను పట్టించుకోవడం లేదని క్రైస్తవ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. క్రిస్టియన్ మిషనరీల ఆధ్వర్యంలో నడుస్తున్న ఎయిడెడ్ పాఠశాలలు, చర్చిలు, హాస్టళ్లను ప్రభుత్వం లాక్కొంటోందని పలువురు బిష్‌పలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీల రాయితీలను కూడా వైసీపీ సర్కారు నిలిపివేసిందని కొందరు విమర్శించారు. సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
No comments:
Post a Comment