పంచడం..తుంచడం!
జగన్ పాలనకు రెండేళ్లు
May 30 2021
రెండేళ్ల పాలనలో ఏమున్నది గర్వకారణం?
నవరత్నాలు మినహా అన్నీ పక్కకే!
వ్యక్తిగత లబ్ధి.. రాజకీయ ప్రయోజనానికే ప్రాధాన్యం
రాజధాని అమరావతిని అటకెక్కించారు.. ‘మూడు’పై ముందుకుపోలేరు
నగరాలు, పరిశ్రమల అభివృద్ధికి మంగళం.. తాడేపల్లికే సీఎం పరిమితం
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమూ ‘రివర్స్’.. పోలవరం పరిస్థితిపై అనిశ్చితి
ప్రత్యేక హోదాపై ఎప్పుడో హ్యాండ్సప్.. నోరెత్తే నేతలపై కేసులు, అరెస్టులు
ఒక్కచాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారు. ఐదేళ్లలో ఇప్పటికి రెండేళ్లు కరిగిపోయాయి. విభజన అనంతరం నవ్యాంధ్రగా ఏర్పడిన సీమాంధ్ర తొలి నాళ్లలో కన్న కలలన్నీ చెదిరిపోయాయి. కొత్త సర్కారు ప్రాధాన్యాలు మారిపోయాయి. రాజధాని అమరావతి లేదు. కొత్త పరిశ్రమలు లేవు. పెట్టుబడులు రావు. రెండేళ్ల పాలన గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే... అప్పులు తెచ్చి ‘సంక్షేమం’ పేరిట నగదు పంచడం, రాజకీయ ప్రత్యర్థులను రకరకాల కేసుల్లో అరెస్టు చేయడం! ఈ రెండింటిపైనే దృష్టి! ‘వైఎస్ జగన్మోహన్ రెడ్డి అను నేను’ అని ప్రమాణ స్వీకారం చేసి రెండేళ్లయిన సందర్భంగా ఒక విశ్లేషణాత్మక కథనం....
(అమరావతి- ఆంధ్రజ్యోతి)
వ్యక్తిగత లబ్ధి చేకూరే పథకాలను అమలు చేయడం.. అందులోనూ ఉత్పాదకత, ఉత్పత్తితో సంబంధంలేకుండా నేరుగా ఖాతాల్లోకే నగదు జమచేయడం.. ఓటు బ్యాంకును భద్రంగా చూసుకోవడం! సూటిగా చెప్పాలంటే... ఇదే రెండేళ్ల వైసీపీ పాలన సారాంశం! జగన్ పాలన కూల్చివేతలతోనే మొదలైంది. ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలోనే ప్రజా వేదికను కూల్చివేశారు. ఇది ఇప్పటిదాకా రాష్ట్ర ప్రజలు ఎరుగని అనుభవం. అవినీతి అధికారులు అక్రమ సంపాదనతో కట్టుకున్న భవనాలను బిహార్‌లో స్కూళ్లు, పాఠశాలలుగా మార్చారు. కానీ... స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే, ప్రజా ధనంతో నిర్మించిన ప్రజా వేదికను ప్రజల అవసరాల కోసం వాడుకునే అవకాశమున్నా... ‘అక్రమ నిర్మాణం’ అంటూ కూల్చివేయడం విస్మయపరిచింది. ఇక జరగబోయేది కట్టడం కాదు... కూల్చడమేనా అనే అనుమానాలకు అప్పుడే బీజాలు పడ్డాయి. మే 20వ తేదీన జరిగిన ఒకరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశం సందర్భంగా.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తరహాలో రాష్ట్రంలో ఒక ప్రథమశ్రేణి నగరంలేదని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ... ఆ దిశగా నగరాలను అభివృద్ధి చేసే ప్రయత్నాలు మాత్రం జరగడంలేదు. రాష్ట్రంలో ‘కాస్మొపాలిటిన్’ లక్షణాలున్న ఏకైక నగరం విశాఖపట్నం! ఈ నగరాన్ని పర్యాటక, ఐటీ, వాణిజ్య రాజధానిగా మార్చేందుకు చేపట్టిన ప్రణాళికలన్నీ వైసీపీ సర్కారు పక్కన పడేయడం గమనార్హం. మరోవైపు... అభివృద్ధి అంటే నాలుగు భవనాలు నిర్మించడమేనా అంటూ ప్రభుత్వ పెద్దలు కొత్త వాదన తీసుకురావడం విశేషం. భవనాలు నిర్మించడం ఒక్కటే అభివృద్ధి కాకపోవచ్చు. కానీ... ఆర్థిక కార్యకలాపాలకు, కొత్త ఉపాధికి ఊతమిచ్చేది నగరాలే!
కేసులు... అరెస్టులు...
ప్రతిపక్ష నేతగా ఉండగా... ప్రభుత్వంపై జగన్, వైసీపీ నేతలు నిత్యం విరుచుకుపడేవారు. ఇక... సోషల్ మీడియాను ప్రధాన అస్త్రంగా వాడుకున్నారు. అధికారంలోకి వచ్చాక సోషల్ మీడియా పోస్టులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టులు పెడితే చాలు... సీఐడీ రంగంలోకి దిగుతోంది. రాత్రికి రాత్రి అరెస్టులు చేస్తోంది. ఇక... విపక్షంలో చురుగ్గా వ్యవహరించే నేతలపై రకరకాల కేసులు పెట్టడం, ఆందోళనలు చేయకుండా గృహనిర్బంధం చేయడం నిత్యకృత్యంగా మారింది. ఈ స్థాయి కక్ష సాధింపు చర్యలు గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ లేవని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ప్రాజెక్టులు పార‘నీరు’
రాష్ట్రానికి జల జీవ నాడి... పోలవరం! 2021 జూన్ నాటికి పూర్తి చేస్తామని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఇప్పటి వరకూ కాఫర్ డ్యామ్‌ను మూసివేసే పనులు కూడా పూర్తి చేయలేదు. ఆ సంగతి పక్కనపెడితే... నీటినిల్వ గరిష్ఠ మట్టాన్ని 41.15 మీటర్లకు తగ్గించి పోలవరం జలాశయాన్ని ఒక సాధారణ బ్యారేజీగా మార్చే ప్రమాదం కూడా కనిపిస్తోంది. కొత్తగా మరో ఎత్తిపోతలను తెరపైకి తేవడం మరో అనుమానానికి దారి తీస్తోంది. కొత్త అంచనాల ప్రకారం నిధులు ఇచ్చేది లేదని కేంద్రం తేల్చి చెప్పినా... ఒత్తిడి తెచ్చి, నిధులను సాధించుకోలేని పరిస్థితి నెలకొంది.
ఇంటికే పరిమితం...
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ జగన్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికే పరిమితమయ్యారు. క్యాబినెట్ సమావేశాలు ఉంటే మినహా... ‘సచివాలయానికి రాని సీఎం’గా పేరు తెచ్చుకున్నారు. జిల్లాల పర్యటనలు, జనంలోకి వెళ్లడం దాదాపుగా నిల్! ఇక... ముఖ్యమంత్రి అయ్యాక ఢిల్లీలో ఒకసారి మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత అమరావతిలోకానీ, ఢిల్లీలో కానీ మీడియాతో మాట్లాడిందే లేదు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు నీలం సంజీవరెడ్డి నుంచి నవ్యాంధ్ర తొలి సీఎం చంద్రబాబు వరకు ఎవ్వరూ ఈ తరహాలో ఇంటికి పరిమితం కాలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మాట తప్పినట్లేనా...
ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు ‘ప్రత్యేక హోదా- దాని ప్రయోజనాల’పై జగన్ మాట్లాడని రోజు లేదు. ఎన్నికల ప్రచారమంతా దాని చుట్టూనే సాగింది. అధికారంలోకి రాగానే... హోదా గాలిలో కలిసిపోయింది. ఈ రెండేళ్లలో కేంద్రంపై చిన్నపాటి ఒత్తిడి కూడా తెచ్చిన పాపాన పోలేదు. పైగా... ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లోనే హోదాపై జగన్ చేతులు ఎత్తేశారు. ‘‘బీజేపీకి మనతో అవసరం లేదు. సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి... విన్నపాలు చేసుకోవడంతప్ప మరో మార్గం లేదు’’ అంటూ విపక్షనేతగా ఉన్నప్పుడు చూపిన ‘పోరాట పటిమ’ను ఒక్కసారిగా పక్కనపెట్టేశారు. ఇది మాత్రమే కాదు! రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి అనేక అంశాలపై కేంద్రంపై ఒత్తిడి తేకుండా...లేఖలు రాసి వదిలేస్తున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం ఒక ఉదాహరణ. ఇక... అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందిని శాశ్వత ఉద్యోగులను చేస్తానన్న హామీ ని మరిచిపోయారు. అధికారంలోకి రాగానే పాత పెన్షన్ ప ద్ధతి పునరుద్ధరిస్తామని, సీపీఎస్ రద్దుచేస్తామని చె ప్పారు. దీనిపై కేంద్రానికి లేఖ రాయడం మినహా చేసిందేమీ లేదు.
నవరత్నాల సర్కార్...
ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ‘నవరత్నాల’ను అమలు చేస్తే చాలు... ఇక అన్నీ చేసినట్లే అని సర్కారు భావిస్తోంది. ఆదాయం పెంచుకునే మార్గాలన్నీ వదిలేసి... అప్పులు తెచ్చి, పథకాలు అమలు చేయడపైనే దృష్టి సారించింది. ఊరికి, మండలానికి, జిల్లాకు, రాష్ట్రానికి పనికొచ్చే పనులు చేయకపోయినా... వ్యక్తిగత లబ్ధి చేకూర్చే పథకాలను అమలు చేయడం ద్వారా ‘సొంత ప్రతిష్ఠ’ను పెంచుకోవడమనే ఫార్ములా పూర్తిస్థాయిలో అమలవుతోంది.
బాబు ముద్ర ఉండొద్దని..
నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు ముద్రను చెరిపివేయడమే లక్ష్యంగా కొత్త పాలన జరుగుతోందనే విమర్శలున్నాయి. చంద్రబాబు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ, ప్రజలను కలిసే ‘ప్రజా వేదిక’ కూల్చివేత అందులో భాగమే అనే విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత... ‘అమరావతి’నీ అటకెక్కించారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట పాలనా రాజధాని, శాసన రాజధాని, న్యాయ రాజధాని అంటూ మూడు ముచ్చట మొదలుపెట్టారు. ఇందులో ఉన్న శాసన, న్యాయపరమైన సంక్లిష్టతలు, రాజధానికి భూములిచ్చిన రైతులకు న్యాయం ఎలా చేస్తారో చెప్పకుండానే... ప్రకటన చేశారు. దీని ఫలితం... అటు అమరావతి మూలన పడిపోయింది. ఇటు మూడు రాజధానులూ ముందుకు కదలడంలేదు. ‘ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది?’ అంటే... సమాధానం చెప్పుకోవడానికి తడుముకోవాల్సిన పరిస్థితి!