నిషేధంపై నిలదీత
16-09-2019 03:05:15
16-09-2019 03:05:15
- ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహ జ్వాలఫోర్త్ ఎస్టేట్‌ను అణిచేయడంపై తీవ్ర నిరసన
- నిషేధించిన చానళ్ల పునరుద్ధరణకు డిమాండ్
- నిరంకుశత్వంపై ఉద్యమం తప్పదని హెచ్చరిక
- జర్నలిస్టు, ప్రజా సంఘాల ఆందోళన
- స్వచ్ఛందంగా కదిలిన ప్రజలు.. టీవీలు పగలగొట్టిన
- పశ్చిమ వాసులు.. నిలిపివేతపై ట్రాయ్‌కు ఫిర్యాదుల వెల్లువ
- ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహ జ్వాల.. ఫోర్త్ ఎస్టేట్‌ను అణిచేయడంపై తీవ్ర నిరసన
- అనంతపురం, శ్రీకాకుళంలలో భారీ ర్యాలీ
(ఆంధ్రజ్యోతి-న్యూ్‌సనెట్‌వర్క్)
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ-5 ప్రసారాల నిషేధం రాష్ట్ర వ్యాప్తంగా గగ్గోలు పుట్టిస్తోంది. ఆయా చానళ్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక వైఖరిని ప్రజలే నిలదీస్తున్నారు. తమ డబ్బును వెచ్చించి పెట్టుకున్న కేబుల్ కనెక్షన్లపై ప్రభుత్వ పెత్తనం ఏంటని ప్రశ్నల శరాలను సంధిస్తున్నారు. జర్నలిస్టులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో పలు జిల్లాల్లో ఆదివారం చేపట్టిన భారీ ర్యాలీలు, నిరసన ప్రదర్శనలకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య మూలస్తంభాల్లో ఒకటైన మీడియాపై ప్రభుత్వ వైఖరి సరికాదని నినదించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరావాలని డిమాండ్ చేశారు. ఆయా నిరసన కార్యక్రమాల్లో నాయకులు మాట్లాడు తూ.. సీఎం జగన్ ఇప్పటికైనా ప్రజాస్వా మ్య పద్ధతిలో ప్రభుత్వాన్ని నడపాలని హితవుపలికారు. ‘‘ఇప్పటికైనా మారండి.
లేకుంటే ఈ నిరసనలు ప్రజా ఉద్యమాలుగా మారడం ఖాయం’’ అని నేతలు హెచ్చరించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం, ఉరవకొండ, గుత్తి, కళ్యాణదుర్గం, హిందూపురం నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలు మిన్నంటాయి. ప్రజల హక్కులను కాపాడాలని గతంలో గగ్గోలు పెట్టిన వారే.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హక్కులను కాలరాస్తున్నారని.. ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వమే పత్రికా స్వేచ్ఛను ఖూనీ చేస్తోందని జర్నలిస్టు, ప్రజా సంఘాలు ధ్వజమెత్తాయి. ఏబీఎన్, టీవీ-5 ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ.. నల్లబ్యాడ్జీలతో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ప్రెస్‌క్లబ్ నుంచి టవర్‌క్లాక్, సప్తగిరి సర్కిల్ మీదుగా అంబేడ్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగింది.
ర్యాలీ పొడవునా.. ‘మీడియా స్వేచ్ఛకు సంకెళ్లా..? సిగ్గు...సిగ్గు’-‘ముఖ్యమంత్రి డౌన్.. డౌన్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఏబీఎన్, టీవీ-5 ప్రసారాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీశ్, సీపీఎం నేత నాగేంద్ర, కాంగ్రెస్ నేత శంకర్, బీజేపీ నాయకుడు జంగటి అమర్‌నాథ్, ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర కమిటీ చైర్మన్ బీసీఆర్ దాస్, రాష్ట్ర అధ్యక్షుడు ఎగ్గిడి మల్లయ్య, ‘చంద్ర-దండు’ వ్యవస్థాపకుడు ప్రకాశ్‌నాయుడు, టీడీపీ రాష్ట్ర నేతలు ఆదెన్న, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు, మా జీ మేయర్ స్వరూప, ఏపీయూడబ్ల్యుజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి పాల్గొన్నారు. 151 మంది ఎమ్మెల్యేలున్నా.. ప్రభుత్వం భయపడుతోందనేందుకు ఇంతకంటే నిదర్శనం లేదన్నారు.
శ్రీకాకుళంలో..
‘మీడియాపై నిషేధాజ్ఞలా? చానెళ్ల గొంతునొక్కడమన్నది అప్రజాస్వామికం’ అంటూ శ్రీకాకుళంలో జర్నలిస్టులు నినదించారు. ఆదివారం శ్రీకాకుళంలో ఏపీయూడబ్ల్యుజే ఆధ్వర్యంలో జర్నలిస్టు సంఘాలు ఆందోళన చేపట్టాయి. వీరికి ప్రజాసంఘాలు మద్దతుగా నిలిచాయి. నల్లబ్యాడ్జీలను ధరించి ఏడురోడ్ల జంక్షన్‌లో మానవహారాన్ని చేపట్టి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశాయి. ‘మీడియాకు స్వేచ్ఛ ఇవ్వండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అనే నినాదాలతో హోరెత్తించారు. నాయకులు మాట్లాడుతూ మీడియా గొంతు నొక్కడం అప్రజాస్వామిక చర్యగా పేర్కొన్నారు. మీడియాపై ప్రభుత్వ వైఖరి మారకుంటే ఆందోళనను తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తే, అవి చూసి తప్పులను సరిచేసుకోవాల్సిందిపోయి.. మీడియాపై ఆంక్షలు విధించడం సబబు కాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యుజే జిల్లా కార్యదర్శి ఈశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి సనపల నరసింహమూర్తి పాల్గొన్నారు.
టీవీలు పగలగొట్టి..
ఏబీఎన్, టీవీ5 చానళ్లను నిలిపివేయడం ప్రజా వ్యతిరేక చర్య అని పశ్చిమ గోదావరిజిల్లాలోని విస్సాకోడేరు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబీఎన్ చానల్ నిలిచిపోవడంపై ఆగ్రహాంతో ఊగిపోయారు. కేబుల్ ఆపరేటర్ల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంట్లో ఉన్న టీవీలను బయటకు తీసుకువచ్చి జాతీయ రహదారిపై ర్యాలీ చేపట్టారు. అనంతరం రహదారిపైనే టీవీలను పగలకొట్టి నిరసన తెలిపారు. ఇప్పటికైనా చానల్‌ను పునరుద్ధరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గ్రామానికి చెందిన బి.సూర్యనారాయణ, ఆరేపల్లి నాగరాజు, బొర్రా కోటేశ్వరరావు, బొక్కా శ్రీనివాసరావు, సింగంపల్లి బాబూరావు తదితరులు నిరసనలో పాల్గొన్నారు. భీమవరంలో రైతు కార్యాచరణ సమితి తాజా పరిస్థితులపై దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. నిజాలను నిర్భయంగా వెల్లడించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి పట్ల ఈ రకంగా వ్యవహరించడం తగదని రైతు సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు. దళిత సంఘాల నేతలు మాట్లాడుతూ.. మీడియాపై ఒత్తిళ్లు ఏమాత్రం సహేతుకం కాదన్నారు. చానళ్ల ప్రసారాలను నిలిపివేయడం వెనుక ప్రభుత్వ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోందని సీపీఐ ఆరోపించింది.
ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు
రాష్ట్రంలో ఏబీఎన్, టీవీ-5 చానెళ్ల ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలి. ప్రజాస్వామ్యం మనుగడ సాధించాలంటే మీడియా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. మీడియా పీకనొక్కే ప్రయత్నాలు గతంలో కేసీఆర్ తెలంగాణలో చేశారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం చేస్తోంది. ఈ చర్య ప్రజాస్వామిక విలువలకు, విధానాలకు తీరని హాని. ప్రభుత్వం వెంటనే చానళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలి.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు
నిలిపివేతపై ఉద్యమిస్తాం
ఏబీఎన్, టీవీ5 చానళ్ల ప్రసారాలను నిలిపివేయడంపై ఉద్యమిస్తాం. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 ప్రసారాలను నిలిపివేయడమే దీనికి ఉదాహరణ. ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన మీడియా గొంతునొక్కే చర్యలు తగవు. వెంటనే వీటి ప్రసారాలను పునరుద్ధరించాలి. లేదంటే నిరసన కార్యక్రమాలు చేపడతాం. మీడియాకు సంకెళ్లు వేయడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. కేబుల్ ఆపరేటర్లను స్వయానా మంత్రులే బెదిరించడం సిగ్గుచేటు. సీఎం జగన్ నియంతలా వ్యవహరిస్తే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరు.
టీఎన్‌ఎ్‌సఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మం చౌదరి
ఇది అప్రజాస్వామికం
వైసీపీ ప్రభుత్వం మీడియా గొంతు నొక్కడం అప్రజాస్వామికం. ప్రజాస్వామ్యంలో మీడియా ఫోర్త్ ఎస్టేట్. ప్రభుత్వానికి, మీడియాకి మధ్య ఏవైనా అభిప్రాయ భేదాలు ఉంటే కూర్చొని చర్చించుకోవాలే తప్ప మీడియా గొంతు నొక్కడం, నిషేధించడం మంచి పద్ధతి కాదు. ఏబీఎన్, టీవీ5 చానళ్లను నిలిపి వేయడం సరికాదు. మీడియా, ప్రభుత్వం కలిసి ప్రజాస్వామ్య హక్కులను, భావ స్వేచ్ఛను కాపాడాలే తప్ప ప్రభుత్వం మీడియాను అడ్డుకోవడం సరైన విధానం అనిపించుకోదు. ఇప్పటికైనా వాటిని పునరుద్ధరించాలి.
బీజేపీ నేత రావెల కిషోర్‌బాబు
ADVERTISEMENT
No comments:
Post a Comment