Jun 14 2021 @ 02:55AMహోంఆంధ్రప్రదే
ఐటీ సలహాదారు.. మందు దందా!
నెలకు రూ.40 కోట్ల ముడుపులు?
ఒక్కో కేసుకు రూ.200 చొప్పున వసూలు
కనీవినీ ఎరుగని బ్రాండ్లూ ఆయన చలవే
సుప్రీం, దారుహౌస్ రుద్దడంలో కీలక పాత్ర
జగన్, సాయిరెడ్డిలకు సన్నిహితుడు
డిస్టిలరీలకు, ప్రభుత్వ పెద్దలకు సంధానకర్త
మద్యం లావాదేవీలన్నీ ఆయన కనుసన్నల్లోనే
ముఖ్యనేత తరఫునా, సొంతంగా వసూళ్లా?
ఐటీ సలహాదారు రాజశేఖర్‌రెడ్డి దందాపై సర్వత్రా చర్చ
ఆయన ఓ ఐటీ రంగ నిపుణుడు.. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రంగంలో సలహాదారు కూడా.. ఆ విభాగానికి ఆయన సలహాలు ఇస్తున్నారో లేదో తెలియదు గానీ.. సంబంధం లేని ‘మందు’ శాఖలో మాత్రం ఆయన పేరు మార్మోగిపోతోంది. ప్రపంచంలోనే కనీవినీ ఎరుగని మద్యం బ్రాండ్లు రాష్ట్రంలో ప్రత్యక్షం కావడానికి.. ప్రీమియం బ్రాండ్లు మాయమవడానికి ఆయనగారి చలవే కారణమని తెలుస్తోంది. అసలు పని వదిలేసి.. పైసలొచ్చే కొసరు పనే ఆయనకు ముద్దుగా మారిందనేది సంబంధిత వర్గాల మాట. మొత్తంమీద మద్యం మామూళ్ల లావాదేవీల్లో ఆయన మునిగి తేలుతున్నారన్న చర్చ సర్వత్రా సాగుతోంది!
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో జరుగుతున్న మద్యం దందాకు మూల పురుషుడిగా, తెర వెనుక వ్యక్తిగా రాష్ట్ర ఐటీ సలహాదారు కేశిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పేరు ప్రభుత్వ వర్గాల్లో విస్తృతంగా వినబడుతోంది. గతంలో అమెరికాలోని కాలిఫోర్నియాలో పనిచేసిన ఈయన.. ఆ త ర్వాత వైసీపీకి తన సేవలందించారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సారథ్యంలోని ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ(ఐప్యాక్)లో పనిచేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆయన్ను ఐటీ సలహాదారు(పాలసీ, పెట్టుబడులు)గా నియమించుకుంది. గత రెండేళ్లుగా ఈ పదవిలో కొనసాగుతున్నారు.
తాజాగా మద్యం విక్రయాల్లో జరుగుతున్న గోల్‌మాల్ వెనుక ఈయన పేరు వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది. జగన్ ప్రభుత్వం వచ్చాక మద్యం అమ్మకాల్లో కొత్త పోకడలు తలెత్తిన విషయం తెలిసిందే. గతంలో ఉండే ప్రముఖ బ్రాండ్లన్నీ పారిపోగా.. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో నడిచే చిల్లరమల్లర బ్రాండ్లన్నీ తెరపైకి వచ్చాయి. ఎవరూ కనీవినీ ఎరుగని బ్రాండ్లు ఇవి. కొన్ని డిస్టిలరీలను తమ అధీనంలోకి తెచ్చుకుని అక్కడ తయారుచేసే మద్యానికి రోజుకో లేబుల్ మార్చేస్తూ విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. అవి తప్ప మరే ఇతర బ్రాండ్లూ రాష్ట్రంలో అమ్మడానికి వీల్లేని పరిస్థితులు సృష్టించారు. అయితే ఈ ఎంపిక చేసిన బ్రాండ్ల తెర వెనుక బాగోతాలన్నీ ఐటీ సలహాదారు రాజశేఖర్‌రెడ్డి ద్వారా జరుగుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటు జగన్మోహన్‌రెడ్డికి, ఇటు విజయసాయిరెడ్డికి సన్నిహితంగా మెలిగే ఈయన కనుసన్నల్లోనే మద్యం వ్యాపారమంతా నడుస్తోంది. రాష్ట్రంలో నెలకు 20 లక్షల కేసుల మేర మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఒక్కో కేసుకు రూ.200 వంతున ముడుపులు చెల్లించాల్సి వస్తోందన్నది మద్యం వ్యాపార వర్గాల మాట.
ఈ లెక్కన నెలకు రూ.40 కోట్లు ముడుపుల దందా సాగుతోందన్న మాట. మరి ముఖ్య నేత తరఫునే ఈ వసూళ్లు చేస్తున్నారా.. లేదా తానే సొంతంగా దందా సాగిస్తున్నారా అనేది తేలాల్సి ఉంది! మొత్తానికి నెలకు రూ.40 కోట్ల మేర పిండుతున్న ముడుపులు ఎక్కడెక్కడికి చేరుతున్నాయన్న దానిపై అటు మద్యం వ్యాపారుల్లోనూ, ఇటు ఎక్సైజ్ అధికారుల్లోనూ ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.
అదాన్ వెనుక..
అదాన్ డిస్టిలరీస్ పుట్టుపూర్వోత్తరాలు, దాని వెనుక ఉన్న పెద్దల వివరాలను పరిశీలిస్తే ఈ గూడుపుఠాణి వ్యవహారం మరింత స్పష్టంగా అర్థమవుతుంది. అదాన్ డిస్టిలరీ్‌సకు ప్రస్తుతం ఇద్దరు డైరెక్టర్లున్నారు. వారిలో ఒకరు కె.శ్రీనివాస్. ఈయన టెనెట్‌బైలాజికల్ ప్రైవేటు లిమిటెడ్ అనే మరో కంపెనీలో కూడా డైరెక్టర్. ఆ కంపెనీలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌రెడ్డి కూడా డైరెక్టరే. అదాన్ డైరెక్టర్ శ్రీనివాస్ కాకినాడ సీపోర్టు ప్రైవేటు లిమిటెడ్‌లో అదనపు డైరెక్టర్‌గా ఉండడం గమనార్హం. వీటన్నిటినీ పరిశీలిస్తే రాష్ట్రంలో మద్యం వ్యాపారం మొత్తం ఎలా నడుస్తుందో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఐటీ సలహాదారుగా ఉంటూ అక్కడ చేసింది, చేస్తోంది ఏమీ లేకపోయినా.. ఈ మద్యం లావాదేవీల్లో మాత్రం రాజశేఖర్‌రెడ్డి తలమునకలైపోయారని.. డిస్టిలరీ్‌సకు, ప్రభుత్వ పెద్దలకు అనుసంధానకర్తగా కీలక లావాదేవీలన్నీ ఆయన చక్కబెడుతుంటారని ప్రచారం జరుగుతోంది. డిస్టిలరీస్ యాజమాన్యాలతో ప్రభుత్వ పెద్దలకు సాన్నిహిత్యం ఉండడం, ప్రభుత్వంలో ఉన్నవారే వారితో వ్యవహారాలు నడిపిస్తుండడంతో ఈ వాదనకు మరింత బలం చేకూరుతోంది!!
రెండే రెండు బ్రాండ్లు..
రాష్ట్రంలో అమ్ముడవుతున్న మద్యంలో అత్యధిక భాగం రెండు బ్రాండ్లే కనిపిస్తాయి. అందులో ప్రధానమైనది అదాన్ డిస్టిలరీస్ ఉత్పత్తి చేసే సుప్రీం బ్లెండ్ విస్కీ. రెండోది దారుహౌస్. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న అదాన్ డిస్టిలరీస్ సుప్రీం బ్లెండ్ విస్కీని తయారు చేస్తుండగా.. కర్నూలు కేంద్రంగా దారుహౌస్ బ్రాందీ తయారవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో 70 శాతం మేర ఈ మద్యమే అమ్ముడవుతోంది. అదేదో జనం ఇష్టపడి కొనుక్కుంటోంది కాదు. ప్రభుత్వమే ఈ రెండు బ్రాండ్లను.. మరీ ముఖ్యంగా సుప్రీం బ్రాండ్‌నే రాష్ట్ర మద్యం దుకాణాల్లో అమ్ముడయ్యేలా శాసిస్తూ.. అనివార్యంగా ప్రజలు వాటినే కొనుక్కునే పరిస్థితి సృష్టించింది. ఈ మద్యం మాత్రమే కొనుగోలు చేసి దుకాణాల్లో అమ్మించడానికి తెర వెనుక జరిగిన తతంగం, ఆ తర్వాతి లావాదేవీల్లో రాజశేఖర్‌రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.